ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి కాంగ్రెస్‌ అత్తరు పూతలు : టీఆర్ ఎస్ నేత

by Sridhar Babu |
ఇంద్రవెల్లి నెత్తుటి గాయానికి కాంగ్రెస్‌ అత్తరు పూతలు : టీఆర్ ఎస్ నేత
X

దిశ, షాద్ నగర్: కాంగ్రెస్‌పై టీఆర్‌ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హక్కుల కోసం ఉద్యమించిన అమాయక ఆదివాసీలపై నాడు అధికారంలో ఉండి కాల్పులు జరిపిన కాంగ్రెస్‌, నేడు అదే ఇంద్రవెల్లి వేదికగా ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు నాటకాలు ఆడుతున్నదని టీఆర్ఎస్ నాయకులు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబల్ నాయక్ మండిపడ్డారు. 1981 ఏప్రిల్‌ 20న అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ అడవిబిడ్డలపై కాల్పులు జరిపింది. ఆ ఘటనలో 13 మంది చనిపోయినట్టు లెక్కలు చూపినా.. అనధికారికంగా 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలియదా అన్ని ప్రశ్నించారు.

నాడు ఆదివాసీల ప్రాణత్యాగాలకు సాక్ష్యంగా నిలిచిన ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్దే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవమైన ఈ నెల 9న కాంగ్రెస్‌ దళిత-గిరిజన దండోరా పేరిట సభ నిర్వహించడంపై రాంబల్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అడవిపై హక్కు తమదని అడిగిన ఆదివాసీలను పిట్టలను కాల్చినట్టు కాల్చిచంపి, నేడు అదే అమరవీరుల సమాధుల మీద సభను నిర్వహించాలని చూడటం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ఆదివాసీలు చిందించిన నెత్తుటి మరకలను కాంగ్రెస్‌ తుడవగలదా? వారి ప్రాణాలకు విలువ కట్టగలదా? అంటూ ప్రశ్నించారు. 40 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడూ ఆదివాసీల అభివృద్ధిని పట్టించుకోలేదని, ఇప్పుడు దండోరా పేరిట వారిపై జాలిచూపడం విడ్డూరమని, అమరవీరుల త్యాగాలను అపవిత్రం చేసే ఎత్తుగడలు వేస్తున్నదని ఆరోపించారు.

స్వరాష్ట్రంలో స్వేచ్ఛగా..

ఇంద్రవెల్లి ఘటనకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ తాను అధికారంలో ఉన్నప్పుడు స్తూపం వద్ద నివాళులర్పించే అవకాశాన్ని ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2015 ఏప్రిల్‌ 20న తొలిసారిగా ఆదివాసీలు అమరవీరుల స్తూపం వద్ద స్వేచ్ఛగా నివాళులర్పించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే అవకాశం కల్పించిందని రాంబల్ నాయక్ అన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ గిరిజన దండోరా పెట్టడం అంటే చంపినోడే శవానికి దండేసినట్టని పేర్కొన్నారు. 1981 ఏప్రిల్‌ 20న ఇంద్రవెల్లిలో పెద్ద సంఖ్యలో గిరిజనులను పిట్టల్లా కాల్చిన అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడే గిరిజనోద్ధరణ అంటుండటం విడ్డూరంగా ఉందని రాంబల్ నాయక్ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed