ప్రజలకు నచ్చితేనే ఐదేళ్లు.. లేకుంటే పక్కకే

by Anukaran |   ( Updated:2021-01-17 22:36:06.0  )
ప్రజలకు నచ్చితేనే ఐదేళ్లు.. లేకుంటే పక్కకే
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: అధికారం ఎప్పుడూ ఎవరి సొంతం కాదనీ.. ప్రజల అభిమానం, ఆశీర్వాదాలు తప్ప.. పదవులు ఎవడి అబ్బ సొత్తూ కాదని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన వేంసూరు పర్యటనలో భాగంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తన అభిమానులు, కార్యకర్తలపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం సరైంది కాదని హెచ్చరించారు. అందరం ఓకే గొడుగు కింద, ఓకే చెట్టు నీడలో ఉన్నామని.. పదవుల్లో లేనంత మాత్రాన చిన్నచూపు చూడొద్దన్నారు. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని.. గెలుపోటములు సహజమన్నారు. పదవులు రావాలని ఉండి కలిసొచ్చే కాలం వస్తే ఎవ్వరూ ఆపలేరని.. అలాగే పదవులు పోవాలని ఉన్నప్పుడు కాంక్రీట్ గోడలు కట్టుకున్నా ఎవ్వరూ కాపాడలేరని అన్నారు. ఐదేళ్ల తర్వాత మంచిగా పరిపాలన చేస్తే తిరిగి అధికారంలో కూర్చోబెడతారని.. లేకపోతే ప్రజలే పక్కకు పెడతారని హాట్ కామెంట్స్ చేశారు.

ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందే

తాను ఎక్కడికి పోవాలన్నా ఎవరి పాస్‌పోర్ట్, పర్మిషన్ తనకు అవసరం లేదని పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తనను అభిమానించే వారు, ఆశీర్వదించే వారు తప్పకుండా వస్తుంటారని చెప్పారు. ఈ రోజు ఎవరైతే పదువులు అనుభవిస్తున్నారో వారందరికీ ఆ పదవులు రావడానికి కారణం ఎవరో తెలుసన్నారు. తాత్కాలికంగా ఎవరు ఎలా ఉన్నా.. పొద్దుగూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి చేరాల్సిందేనని.. అదే గూట్లో గుడ్లు పెట్టాల్సిందేనని పరోక్షంగా అన్నారు. ప్రజల మనసును గెలవాలి కానీ.. రాజకీయం చేస్తూ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని.. అంతకు అంతా మూల్యం చెల్లించక తప్పదని పొంగులేటి హెచ్చరించారు. వడ్డీ, చక్ర వడ్డీతో సహా చెల్లించే రోజు వస్తుందని, ఏ విషయమూ తాను అంత సులభంగా మరచిపోనని నొక్కి వక్కాణించారు. ఈ రోజు తనతోపాటు మువ్వా విజయ బాబు, దయానంద్ పదవుల్లో లేకపోవచ్చని.. అలాగని కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం, కక్ష సాధింపు చర్యలు చేయడం సరైంది కాదన్నారు. పొంగులేటి వెంట మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డాక్టర్ మట్టా దయానంద్, ఇతర ముఖ్యనేతలు ఉన్నారు.

పొంగులేటి కామెంట్స్‌పై చర్చ

ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఈ మధ్యే మంత్రి కేటీఆర్ చొరవతో మళ్లీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ యాక్టివ్ అయ్యారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తూ ముందుకు పోతున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా తమ నేతకు మళ్లీ మంచిరోజులొచ్చాయని సంబురపడ్డారు. పార్టీ తరపున తమ నాయకుడికి ‘మంచి హామీ’ కూడా వచ్చిదంటూ ప్రచారం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి హాట్ కామెంట్స్ మళ్లీ తీవ్ర చర్చకు దారితీశాయి. తమ వర్గం వారిని కేసుల పేరుతో కావాలనే ఇబ్బందులకు గురి చేస్తుండడంతో తీవ్ర అసహనంతో ఉన్న పొంగులేటి ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా యువనేత కేటీఆర్ మంత్రాంగం ఫలితాలిచ్చినట్టే ఇచ్చి వికటించిందంటున్నారు కొందరు. మళ్లీ జిల్లాలో వర్గపోరు తప్పదని.. పార్టీపై తీవ్ర ప్రభావం చూపనుందనే చర్చ జోరుగా నడుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed