- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారు స్పీడ్‌కు బ్రేక్ వేసిన 'వరద'
దిశ, తెలంగాణ బ్యూరో: అక్టోబర్‌లో కురిసిన వానలు హైదరాబాద్ నగరాన్నే కాదు.. టీఆర్ఎస్ పార్టీనీ ముంచాయి. వరద బురదలో కారు కొట్టుకుపోయింది. కలిసి వస్తుందనుకున్న వరద సాయం నిండా కష్టాలపాలు చేసింది. ప్రచారంలోనే అభ్యర్థులను నిలదీయడం చూస్తే గులాబీ దళానికి ఎదురుదెబ్బ తగులుతుందని భావించారు. కానీ సంక్షేమ పథకాలు, వరద సాయం అందిన వారైనా అండగా ఉంటారనే భరోసాతో టీఆర్ఎస్ అధిష్టానం ఆశలు పెట్టుకుంది. కానీ ఓటర్లు మరిచిపోని దెబ్బ కొట్టారు. టీఆర్ఎస్ ప్రలోభాలకు లోనుకామంటూ ఓటుతో సమాధానమిచ్చారు. ఫలితంగా కారు స్టీరింగ్ రూట్ తప్పింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా రోడ్డుపై బోల్తా పడింది. గతంలో వచ్చిన సీట్లు, ఇప్పుడు ఊహించిన సీట్ల కంటే సగానికే పరిమితం చేసి కారు స్పీడ్‌కు బ్రేక్ వేశారు.
వరద ప్రాంతాల్లోనే దెబ్బ..
అక్టోబర్ 4 నుంచి 8వ తేదీ వరకు కురిసిన వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలమైంది. రూ. 67 వేల కోట్లతో అభివృద్ధి చేశామంటూ చెప్పుకున్న టీఆర్ఎస్‌కు వరదలతో భారీ నష్టం వాటిల్లింది. లక్షల కుటుంబాలు వరద పాలయ్యాయి. రెండు రోజుల పాటు కనీసం తిండి లేకుండా వరద నీటిలో గడిపారు. నిత్యావసరాలు మొత్తం నష్టపోయాయి. వీటితోపాటు ప్రధాన రోడ్లు కూడా నాశనమయ్యాయి. గ్రేటర్‌లో టీఆర్ఎస్ పాలన ఏంటో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగానైనా తేరుకున్న ప్రభుత్వం వరద సాయం పంపిణీకి శ్రీకారం చుట్టింది. వరద బాధితులకు ఇంటికి రూ. 10 వేలు నేరుగా పంపిణీ చేస్తామని ప్రకటించి ముందుగా రూ. 550 కోట్లు విడుదల చేసింది. ఇదే పార్టీ కొంప ముంచింది. వాస్తవంగా వరద బాధితులకు సాయం అందలేదు.
అధికారగణాన్ని మొత్తం పక్కనపెట్టి కార్పొరేటర్ల నుంచి గల్లీ లీడర్ల దాకా సాయం పంపిణీ మొదలుపెట్టారు. కొన్నిచోట్ల కార్పొరేటర్లు, నేతలు దగ్గరుండీ జాబితా రాయించుకుంటూ పంపిణీ చేయించారు. అంతేకాకుండా ఆధార్ కార్డులు తీసుకుని నేతలే నగదు తీసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిబంధనలు లేకుండా వస్తుండటంతో పార్టీ నేతలు వాటిని మింగేశారు. కొన్నిచోట్ల కేవలం రూ. 3 వేలలోపు మాత్రమే ఇచ్చి మిగిలినదంతా జేబుల్లో పెట్టుకున్నారు. అసలైన బాధితులకు చాలా మందికి చేరలేదు. బాధితులకు కాకుండా బినామీలు, రెండు, మూడు అంతస్థుల్లో ఉన్న వారికి నగదు ఇచ్చి సగం సగం పంచుకున్నారు. దీంతో వ్యతిరేకత పెరిగింది.
ఇదే సమయంలో విమర్శలు ఎక్కువ రావడంతో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని, బ్యాంకు ఖాతాల నుంచి పంపిణీ చేస్తామని ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజుల ముందు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలా మంది పేద వర్గాలు మీ సేవ కేంద్రాల ఎదుట బారులు తీరారు. దరఖాస్తు చేసుకున్నారు. ఓ వృద్ధురాలు క్యూలో ఉండి చనిపోయింది. సాయం పంపిణీ నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘం చెప్పడంతో బాధితుల నుంచి విమర్శలు పెరిగాయి. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు.
ఇరు వర్గాల్లో వ్యతిరేకతే..
వరద సాయం పంపిణీ టీఆర్ఎస్ కొంప ముంచింది. వరద సాయం వచ్చిన వారి నుంచి సగం సగం తీసుకోవడంతో ఆ వర్గాలు కూడా దూరమయ్యాయి. ఇచ్చినట్టే ఇచ్చి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అసలైన బాధితులకు ఇవ్వకుండా బినామీల పేరుతో తీసుకున్నారని, బాధితులకు రాలేదంటూ వ్యతిరేకత మొదలైంది. రెండు రోజులపాటు లైన్లలో ఉండి దరఖాస్తు చేసుకుంటే ఇవ్వలేదంటూ బహిరంగంగానే విమర్శలు చేశారు. దీంతో రెండు వర్గాలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకమయ్యాయి.
ఎన్నికల తర్వాత ఇస్తామంటే నమ్మలేదు..
గ్రేటర్ ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు చాలా ప్రాంతాల్లో చుక్కలు చూపించారు. పలు చోట్ల నేతలను నిలదీశారు. దీంతో ఓటర్లు వ్యతిరేకమవుతున్నారంటూ గమనించి ప్రభుత్వం డిసెంబర్ 7 తర్వాత నుంచి వరద సాయం పంపిణీ చేస్తామంటూ ప్రకటించారు. దీంతో కొంతమంది నమ్మినా ఓటింగ్‌కు దూరమయ్యారు. కొన్నిచోట్ల బస్తీలు, కాలనీల్లో ఓట్లేసినా కారుకు వేయలేదు. సీఎం కేసీఆర్ కూడా బహిరంగ సభ నుంచి ప్రకటించినా ఓటర్లు నమ్మలేదు.
ఈ ప్రాంతాలే ముంచాయి..
వరద ప్రాంతాల్లో బీజేపీ జెండా ఎగురవేసింది. వరదలు ఎక్కువ వచ్చిన ప్రాంతాల్లో ఇదే కారణంగా భావిస్తున్నారు. ఎల్బీనగర్ సర్కిల్లో మొత్తం డివిజన్లలో కాషాయ దళం గెలిచింది. ఉప్పల్ ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. ఇక్కడ రెండుచోట్ల కాంగ్రెస్, మిగిలిన చోట్ల బీజేపీ శ్రేణులు గెలిచాయి. ముషీరాబాద్ ప్రాంతంలో కూడా వరదలు ముంచెత్తాయి. ఇక్కడ మంత్రులు పాగా వేసినా ఫలితం రాలేదు. అంతేకాకుండా ఎమ్మెల్యేల బంధువులు పోటీ చేసి ఓడిపోయారు. వరద సాయం ఇవ్వలేదంటూ వారిని నిలదీశారు. సికింద్రాబాద్లో కూడా అంతే. మహేశ్వరం, మల్కాజిగిరి, పటాన్చెరు, ప్రాంతాల్లో కూడా వరద సాయం దెబ్బ కొట్టింది. ఇక శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి వంటి ప్రాంతాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా.. దాదాపుగా బీజేపీ కూడా అదేస్థాయిలో ఓట్లు రాబట్టుకుంది.
ఎల్ఆర్ఎస్ కూడా కారణమే..
మరోవైపు ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ కూడా వ్యతిరేకతను మూటగట్టాయి. చాలా ప్రాంతాల్లో దీన్ని ముందు నుంచీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపార వర్గాలు వ్యతిరేకంగా ఓట్లేశారని స్పష్టమవుతోంది. వాస్తవంగా ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రభుత్వం ఖజానా నింపుకునే ప్రయత్నం చేసింది. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వలేకపోయింది. అదే సమయంలో బీజేపీ ఎల్ఆర్ఎస్ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. దీంతో టీఆర్ఎస్‌కు తక్కువ సీట్లు రావడంలో ఎల్ఆర్ఎస్ కూడా భాగం పంచుకుంది.