హుజురాబాద్‌‌కు గిరి గీస్తోన్న టీఆర్ఎస్.. రంగంలోకి ట్రబుల్ షూటర్

by Sridhar Babu |   ( Updated:2021-05-17 00:29:18.0  )
Etala Rajender
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ పట్టు సడలిపోకుండా ఉండేందుకు అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పాట్టు సాధించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించింది. మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ల పర్యవేక్షణలో క్షేత్ర స్థాయి కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.ఈ మేరకు బాధ్యతల వికేంద్రీకరణ కూడా అప్పగించిన అధిష్టానం ఈటల రాజేందర్ ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీని ఎవరూ వీడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం. హుజురాబాద్‌కు కరీంనగర్ మేయర్ సునీల్ రావు, ఇల్లంతకుంట, జమ్మికుంటకు సుడా ఛైర్మన్ జీవి రామకృష్ణారావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుకు వీణవంక, కమలాపూర్ మండలానికి కిమ్స్ రవిందర్ రావులకు బాధ్యతలు అప్పగించారు. మండలాల ఇంచార్జీలు క్షేత్ర స్థాయిలో ఉన్న కేడర్‌తో టచ్‌లో ఉంటూ పార్టీ వీక్ కాకుండా ఉండే విధంగా కార్యాక్రమాలు చేపట్టాలని అధిష్టానం సూచించినట్టు తెలిసింది.

ఈటల మార్క్ అనేదే లేకుండా పార్టీ వేళ్లూనుక పోయే విధంగా చర్యలు చేపట్టాలని పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తోంది. గత నాలుగైదు రోజులుగా హుజురాబాద్ కేడర్ లో మార్పు వచ్చి ఈటలకు దూరం అవుతున్నప్పటికీ కొందమంది ఈటల వెంటే ఉంటామన్న ప్రకటనలు చేస్తున్న విషయంపై కూడా ఇంఛార్జీలు దృష్టి సారించనున్నారు. వారిని సముదాయించి పార్టీలోనే కొనసాగే విధంగా ఒప్పించే బాధ్యత కూడా వీరిపైనే ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రజల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అక్కడి ప్రజలకు ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా అందించిన నిధులు, ఇతరాత్రా లబ్ది వివరాలను కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కూడా ఇంచార్జీలకే అప్పగించినట్టు సమాచారం. 2001లోనే స్థానిక ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులు అన్నింటా విజయం సాధించిన విషయాన్ని గుర్తు పెట్టుకుని అక్కడి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పూర్తి స్థాయిలో పార్టీకి అనుకూలంగా మరల్చే విధంగా చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని అధిష్టానం భావిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed