దుబ్బాకలో టీఆర్ఎస్‌కు కొత్త భయం

by Anukaran |
దుబ్బాకలో టీఆర్ఎస్‌కు కొత్త భయం
X

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ నువ్వా నేనా అనే తీరులో తలపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఎవరికి వారు తమకు గెలుపు ఖాయమని బయటకు చెప్పుకుంటున్నా లోలోపల మాత్రం టెన్షన్‌గానే ఉందని కార్యకర్తలు అంటున్నారు. కాంగ్రెస్ సీన్ లోకి రావాలని తాపత్రయపడుతోంది. త్రిముఖ పోటీ రెండు మండలాలకు మాత్రమే పరిమితమైంది. మిగిలిన చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది.

దుబ్బాక, దిశ ప్రతినిధి: ఎన్నికల తేదీ సమీపించడంతో పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. సిద్దిపేట, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, కొల్లాపూర్, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గ్రామాలలో మకాం వేసి ప్రజలను పదేపదే కలుస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఆ పార్టీ సీనియర్ నేతలు విస్తృతంగా తిరుగుతున్నారు. మూడు పార్టీల ప్రచారం పట్టణ ప్రాంతాల్లోనే జోరుగా సాగింది. మారుమూల గ్రామాలలో ఎన్నికల సందడి పెద్దగా లేదు. గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా పెను మార్పులే కనిపిస్తున్నాయి. ఏ పార్టీకి ఓటు వేయాలో ప్రజలు చాలా స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నారు. అందువల్లనే టీఆర్ఎస్ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. బీజేపీ మాత్రం రైతులు, వృద్ధులు, మహిళల్లో ఏ మేరకు మొగ్గుచూపుతారన్నదానిపై ఆందోళన పడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి మూడవ స్థానానికే పరిమితం అనే అభిప్రాయం ఆ పార్టీ స్థానిక నాయకుల్లో మాత్రమేగాక ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది.

ఆయన మంచి పనులే…

దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులతో తొగుట, మిర్‌దొడ్డి మండలాల్లో ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కొంత మేరకు ఓటు బ్యాంకు తెచ్చుకోగలిగారు. గతంలో ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులపై ప్రజలు ఇప్పటికీ సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన హయాంలో కట్టిన చెక్‌డ్యాములు, మార్కెట్ యార్డులు, కొత్త రోడ్లు, పల్లెల్లో సీసీ రోడ్లు లాంటివన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఈ రెండు మండలాల్లో టీఆర్ఎస్, బీజేపీలకు ఎదురుగాలి తప్పేలా లేదు. మిగిలినచోట్ల మాత్రం టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాత్రమే గట్టి పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల నాటికంటే ప్రజలు కాస్త చైతన్యంతోనే వ్యవహరిస్తున్నారు. తొగుట మండలంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు నిర్వాసితులు చాలా స్పష్టమైన నిర్ణయాన్నే తీసుకున్నారు. పక్కనే ఉన్న మిర్‌దొడ్డి మండలంలోని కొన్ని గ్రామాల ప్రజల్లోనూ ఇదే వాతావరణం కనిపిస్తోంది.

నోట్ల పంపిణీపై ఆశలు…

ఇన్ని రోజుల పాటు ముమ్మరంగా ప్రచారం చేసిన టీఆర్ఎస్, బీజేపీకి ఇప్పుడు కొత్త తలనొప్పి మొదలైంది. చివరి రోజు చేపట్టాల్సిన రహస్య ప్రహసనంపైనే ఆశలూ పెట్టుకున్నాయి. పంపకాల తీరు పోలింగ్ సరళలో మార్పు తెస్తుందని అంటున్నారు. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కార్యకర్తలకు నిఘా డ్యూటీ అప్పగించారు. ఇప్పటికే గల్లీ లీడర్లకు నోట్ల బట్వాడా జరిగిందని, పంపిణీ మొదలు పెట్టడమే తరువాయి అని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. కేంద్ర బలగాలు రంగంలోకి దిగినందున ఈ కార్యక్రమాలు అనుకున్నట్లుగా సాగుతాయో లేదోననే ఆందోళన కూడా ఉంది.

ఓట్లు రాలుతాయా?

సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం స్థానికంగా ఉన్న పార్టీ నేతలకు పెద్దగా చేసిందేమీ లేదన్న అసంతృప్తి తీవ్ర స్థాయిలోనే ఉంది. ఇప్పుడు ఆయన భార్య నిలబడి గెలిచినా భవిష్యత్తులో ఆయన కుమారుడిదే పెత్తనం ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నారు. హరీశ్‌రావు మొత్తం బాధ్యతలు తీసుకున్నా ప్రతీ అవసరానికి అక్కడికి వెళ్లడం సాధ్యం కాదని, అయినా ఆశించిన లబ్ధి కలుగుతుందో లేదోనని సందేహపడుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ఇది పసిగట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టినా పోలింగ్ సమయానికి అసంతృప్తవాదుల ఓట్లు పడతాయా లేదా అనే అనుమానం ఉంది. ఈసారి ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసి సొంత పార్టీ నేతలకు కనువిప్పు కలిగించాలనే అభిప్రాయాన్ని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు వ్యక్తం చేశారు.

సానుభూతి పవనాలు…

రామలింగారెడ్డి ఆకస్మికంగా చనిపోవడంతో సహజంగానే సానుభూతి ఉండాలి. దుబ్బాకలో మాత్రం అది పెద్దగా వర్కవుట్ అయ్యేలా లేదు. రామలింగారెడ్డి కుమారుడిపై తీవ్రమైన వ్యతిరేకత ఉండడమే ఇందుకు కారణం. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపైనా, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డిపైనా సానుభూతి కనిపిస్తోంది. రఘునందన్‌రావు పై రెండు రకాలుగా సానుభూతి వ్యక్తమవుతోంది. గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయినందున ఈ ఒక్కసారికి గెలిపిద్దామనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే ఆయనను ఇబ్బంది పెడుతోందని, వేధింపులకు గురిచేస్తోందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పట్ల మాత్రం సానుభూతి లేకపోవడాన్ని పార్టీ నేతలు గ్రహించారు. పోలింగ్ శాతం పెరిగితే అది తమకే అనుకూలంగా మారుతుందని మూడు పార్టీలూ భావిస్తున్నాయి. ప్రజల ఆలోచనలో మార్పు ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో, ఏ పార్టీ పుట్టి ముంచుతుందో చూడాలి.

Advertisement

Next Story