బల్దియా కమిషనర్‌‌‌‌పై TRS కార్పొరేటర్ల ఆగ్రహం.. మంత్రితో మీటింగ్.. ఏం జరగనుంది.?

by Sridhar Babu |   ( Updated:2021-07-26 08:07:45.0  )
బల్దియా కమిషనర్‌‌‌‌పై TRS కార్పొరేటర్ల ఆగ్రహం.. మంత్రితో మీటింగ్.. ఏం జరగనుంది.?
X

దిశ ప్రతినిధి. కరీంనగర్ : కరీంనగర్ బల్దియా కమిషనర్‌పై అధికార పార్టీ కార్పొరేటర్లు గుర్రుగా ఉన్నారు. పరిపాలనపరమైన విషయాల్లో జాప్యం చేస్తున్నరంటూ 32 మంది కార్పొరేటర్లు మంత్రి గంగుల కమలాకర్‌కు వినతి పత్రం ఇచ్చారు. నగర ప్రజల సత్వర సమస్యల పరిష్కారం కోసం తాము ఇస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఆస్తి మార్పిడి దరఖాస్తులు ఆరునెలలైనా పరిశీలించడం లేదని, ప్రభుత్వ పథకాల్లో తమ జోక్యం లేకుండానే అమలు చేస్తున్నారని కార్పొరేటర్లు మంత్రి గంగులకు విన్నవించారు.

రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి రోజున కూడా ఆహ్వానించలేదని, అపాయింట్‌మెంట్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి రావడంతో పాటు, ఛాంబర్‌లో తమను నిలబెట్టే మాట్లాడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో పెట్టడం, ఎమర్జన్సీ వర్క్స్ పనుల టెండర్ల నిర్వహణలోనూ వేగం ప్రదర్శించకపోవడం వల్ల తమ తమ డివిజన్లలోని ప్రజలకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు కార్పొరేటర్లు మంత్రికి వివరించారు.

నగరంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో కొత్త వర్క్స్ చేపట్టేందుకు వారు ముందుకు రావడం లేదని, తాము ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయడం లేదంటూ కార్పొరేటర్లు మంత్రితో చెప్పారు. ప్రాక్టికల్‌గా ఎదురైన కొన్ని సమస్యలను వివరిస్తూ తయారు చేసిన వినతి పత్రాన్ని మంత్రి గంగుల కమలాకర్‌కు కార్పొరేటర్లు అందించారు.

Advertisement

Next Story

Most Viewed