- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరందుకున్న క్యాంపు రాజకీయాలు.. గోవాలో టీఆర్‌ఎస్ క్యాంపు
దిశ, అశ్వారావుపేట టౌన్: కేంద్రపాలిత ప్రాంతం కేంద్రంగా అధికార పార్టీ క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టడంతో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు గోవా బాట పట్టనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని టీఆర్ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కో ఆప్షన్ మెంబర్లను గోవా తరలించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో ఖమ్మం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లు పాల్గొన్న ఎన్నికల సన్నాహక సమావేశంలో గోవా యాత్రకు సిద్ధపడాలని ఓటు హక్కు గల ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థి తాత మధు గోవా క్యాంపుపై మాట్లాడారు.. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికకు మోకాలడ్డు పెట్టినట్లుగా బరిలో నిలిచి ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. అందువల్లే గోవా క్యాంపు అనివార్యమైందని, లేకపోతే మీరందరూ ఇంటి నుండి నేరుగా వచ్చి ఓటు వేసి వెళ్లేవారని, తప్పని పరిస్థితుల్లో వారం పది రోజులు తన కోసం కేటాయించాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను కోరారు.
గోవా వయా హైదరాబాద్
డిసెంబర్ 10వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుండగా నవంబర్ 29 లేదా 30వ తారీఖున టీఆర్ఎస్ ఎంపీటీసీలు గోవాకి పయనం అవ్వనున్నారు. అంటే దాదాపు వారం రోజులు గోవాలో క్యాంపు నిర్వహించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఏర్పాటు చేసిన 2 లగ్జరీ బస్సుల్లో హైదరాబాద్ చేరుకొని అక్కడి నుండి ఆకాశ మార్గం ద్వారా విమానంలో గోవా చేరుకుంటారని అనుకున్నారు. మరి ఏమైందో తెలియదు గానీ ఎయిర్ బస్సు ప్రయాణాన్ని ఉపసంహరించుకుని రోడ్డు మార్గం ద్వారా ఎయిర్ కండిషన్ బస్సులలో గోవా చేరేలా ప్రయాణాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబరు 8, 9 వ తేదీలలో వీరి తిరుగు ప్రయాణం ఉండే అవకాశం ఉంది.
క్యాంపుపై సభ్యుల్లో ఆశలు
గత ఎమ్మెల్సీ ఎన్నికలలో పలు రాజకీయ పార్టీలు విహార యాత్రలను తలపించే విధంగా క్యాంపులను నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా మాజీ ఎంపీ అప్పట్లో అధికార పార్టీలో లేనప్పటికీ ఓటు హక్కు ఉన్న వ్యక్తులను కుటుంబ సమేతంగా మైసూర్, ఊటీ, కొడైకెనాల్, కంచిలోని పర్యాటక కేంద్రాలను తిప్పి చూపించారు. ఖరీదైన హోటళ్లలో వసతితో పసందైన వంటకాలు రుచి చూపించడమే కాకుండా ప్రతి కుటుంబంలో స్త్రీకి బంగారపు గొలుసును బహుమతిగా కూడా అందజేశారు. ఇటువంటి గత సంఘటనలను దృష్టిలో ఉంచుకొని గోవాకి పయనమయే వారిలో ఆశలు మొదలయ్యాయని వినికిడి. అధికార పార్టీ కాబట్టి ఆ మాత్రం ఆశలు పెట్టుకోవడంలో కూడా తప్పే లేదు. అయితే అక్కడి ఏర్పాట్లు ఏ రేంజ్ లో ఉంటాయనేది వెళితే గానీ తెలియదు. గోవా కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి డ్యూటీ ఫ్రీతో అక్కడ వస్తువులు తక్కువ ధరలో లభిస్తాయి. దీంతో మంచిగా షాపింగ్ చేసుకునేందుకు వీలు ఉంది.
ముఖ్యంగా గోవా అంటే మద్యం సేవించడానికి, జూదం ఆడడానికి అనువైన ప్రాంతంగా ఎక్కువ ప్రసిద్ధి. క్యాంప్ కు వెళ్లే సభ్యుల్లో మగవారైతే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసి రావచ్చు. అదే స్త్రీలకు మాత్రం ఈ టూర్ అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అయితే గతంలో జరిగిన క్యాంపుల్లో లాగా కుటుంబసమేతంగా కాకుండా ఓటు హక్కు ఉన్న సభ్యుడు నైతే ఒక్కడిని, సభ్యురాలు అయితే భర్తతో పాటు రావాలని కోరినట్లు సమాచారం.
ఇతర పార్టీల క్యాంపుపై సందిగ్ధత
అశ్వారావుపేట నియోజకవర్గంలో జడ్పీటీసీ ఐదుగురు, ఎంపీటీసీలు 58 మంది, కో ఆప్షన్ సభ్యులు ఐదుగురు మొత్తం కలిపి 68 మంది. అయితే వీరిలో ఒకరు మృతి చెందడంతో ప్రస్తుతం 67 మంది ఉన్నారు. వారిలో 46 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందినవారే. మిగిలిన 11 మంది ఇతర పార్టీలకు చెందినవారు. వీళ్ళ పార్టీలు క్యాంపులు నిర్వహించేది లేదన్నది ఇప్పటికింకా ఎటూ తేలలేదు. కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మాత్రం క్యాంపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది. అయితే కొందరు టీడీపీ ఎంపీటీసీలకు గోవా క్యాంపుకు రావాల్సిందిగా టీఆర్ఎస్ నాయకులు ఆహ్వానాలు పంపారు. మొత్తంమీద టీఆర్ఎస్ గోవా క్యాంపు షురూ అవ్వడంతో స్థానికంగా ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కానీ ఇతర పార్టీలకు చెందిన ఎంపీటీసీల క్యాంపుపై మాత్రం సందిగ్ధం నెలకొంది..
- Tags
- Goa