గ్రేటర్ కోసం ఆదిలాబాద్‌ టు హైదరాబాద్

by Aamani |
గ్రేటర్ కోసం ఆదిలాబాద్‌ టు హైదరాబాద్
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుక్షణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క గులాబీ అగ్రనేత మీకు కనిపించరు. జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, గ్రంథాలయ, మార్కెట్ కమిటీ చైర్మన్లు, చివరకు సర్పంచులు, వార్డ్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు.. ఇలా ఒక్కరంటే ఒక్కరు అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంటికి కనబడకుండా పట్నం వెళ్లిపోతారు.

అవును మీరు చదివింది నిజమే… దుబ్బాక దెబ్బ తర్వాత టీఆర్ఎస్ అధిష్టానం గ్రేటర్ ఎన్నికల్లో పరువు పోకుండా కచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులను హైదరాబాదుకు రావాలని ఇప్పటికే ఆదేశాలు వచ్చాయి. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నేతలందరూ రాజధానికి వచ్చేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.

మంత్రి అల్లోలకు బంజారాహిల్స్ బాధ్యతలు..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి బంజారాహిల్స్ కార్పొరేటర్ ఎన్నికల బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు అవుననే చెప్పాయి. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె అక్కడ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు కోసం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించిన అధిష్టానం ప్రచారం మొదలు కొని గెలుపు దాకా అన్నీ బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికే అప్పగించింది.

ఇక్కడి ప్రాంత ప్రజల నివాసాలకు వెళ్లి ప్రచారం చేసేలా..!

ఉమ్మడి జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కాగజ్​నగర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఉట్నూర్ తదితర ప్రాంతాల ప్రజలు పెద్ద మొత్తంలో హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ ప్రాంత నేతలను హైదరాబాద్​కు తరలించి వారిచేత ఓట్లు రాబట్టవచ్చని అధిష్టానం యోచిస్తున్నది. ముఖ్యంగా బోయిన్​పల్లి, సుచిత్ర, ఆల్వాల్, కూకట్​పల్లి, మియాపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో కుటుంబాలు ఉన్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఆ కుటుంబాలను గుర్తించి, ఆ ఓట్లను అధికార పార్టీకి పడేలా చేయడం ఈ ప్రాంతం నుంచి వెళ్లే నాయకుల పనిగా అధిష్టానం ప్రణాళికను రచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్యేలకు బాధ్యతలు…

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో పాటు జిల్లాకు చెందిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మిగతా ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాదులో అందుబాటులో ఉండాలని అధిష్టానం సూచించింది. అయితే, శాసన సభ్యులకు పూర్తి స్థాయి ఎన్నికల బాధ్యతలను ఇంకా అప్పగించక పోయినప్పటికీ మంగళవారం ఉదయం నుంచి అందుబాటులో ఉండాలని అధిష్టానం నుంచి వారికి ఆదేశాలు వచ్చాయి. దీంతో శాసన సభ్యులంతా హైదరాబాద్​కు వెళ్లారు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మిగతా నేతలందరినీ అక్కడికి రప్పించాలని అధిష్టానం సూచించింది. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టీఆర్ఎస్ వర్గాల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల సందడి నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed