టెన్షన్.. టెన్షన్.. రెచ్చిపోయిన TRS కార్యకర్తలు.. బీజేపీ నేత కారు ధ్వంసం(వీడియో)

by Anukaran |   ( Updated:2023-05-19 08:27:05.0  )
టెన్షన్.. టెన్షన్.. రెచ్చిపోయిన TRS కార్యకర్తలు.. బీజేపీ నేత కారు ధ్వంసం(వీడియో)
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : మల్కాజ్‌గిరి అట్టుడుకుతోంది. బీజేపీ కార్పొరేటర్లను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్యన దాడులు, హెచ్చరికలు, ధర్నాలతో ఎప్పుడేం జరుగుతుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పంద్రాగస్టు రోజున బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి ఘటనతో ముదిరిన గులాబీ, కమలం పార్టీల వివాదం తారస్థాయికి చేరింది.

బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుల మధ్యన బూతు పురాణం పీక్ స్టేజీకి చేరిన విషయం విధితమే. దానికి కొనసాగింపుగా సోమవారం కూడా మల్కాజ్‌గిరిలో ఆందోళనలు, ఆరెస్ట్‌లు, కేసులు నమోదయ్యాయి.

బంద్ ఉద్రిక్తం..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మైనంపల్లి వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంద్‌లో భాగంగా షాపులను తెరవకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్ చేశారు.

పోలీసులు తీరును నిరసిస్తూ మల్కాజ్‌గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. దీనివల్ల పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట కూడా చోటు చేసుకుంది. ఆందోళనకారులు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

కార్పొరేటర్ కారు ధ్వంసం..

ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నేరెడ్‌మెట్ పీఎస్ వద్దకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇదే క్రమంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి నేతృత్వంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ర్యాలీగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. టీఆర్ఎస్ నాయకులను చూడగానే బీజేపీ నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువురి మధ్య మాటమాట పెరిగింది. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మౌలాలి బీజేపీ కార్పొరేటర్ సునీతాయాదవ్ కారును టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు.

కారుపై కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో కారు అద్దాలు పగిలాయి. కార్పొరేటర్ సునీత యాదవ్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మైనంపల్లితోపాటు తన తనయుడు రోహిత్‌తో పాటు మరో 20 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలియజేశారు. ఏది ఏమైనా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు దాడులు, ప్రతి దాడులతో భయాందోళనలను కల్గించడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే ఇరు పార్టీలు, నేతల మధ్యన ఉన్న యుద్ద వాతావరణాన్ని తగ్గించి, నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed