- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవస్థలు పడుతున్న రైతులు.. మాయాజాలం ప్రదర్శిస్తున్న మిల్లర్లు
దిశ, తెలంగాణ బ్యూరో/నల్లగొండ: వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు అనేకఅవస్థలు పడుతున్నారు. ఇదే అదునుగా మిల్లర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖల నుంచి స్పష్టత కరువైంది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వమే ఈ సీజన్‌కు పూర్తిగా కొంటుందని రెండు శాఖల మంత్రులు ఇప్పటికే స్పష్టం చేశారు. గతేడాది లాగానే ఈసారి కూడా తగినన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఇప్పటికీ పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రాలేదు. రైతులు తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు కేవలం 2.20 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది. రాష్ట్రం మొత్తం మీద సుమారు 1.30 కోట్ల టన్నుల దిగుబడి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఎక్కువ భాగం నేరుగా రైస్ మిల్లర్లకే అమ్ముకుంటున్నారు.
మంత్రులు ఇచ్చిన వివరాల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద 6,545 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కానీ, శుక్రవారం నాటికి కేవలం 1,762 మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. వరి కోతలు ప్రారంభం కావడానికి ముందే కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి రావాల్సి ఉన్నా ఇప్పటికీ తెరుచుకోలేదు. రైతులు మార్కెట్ యార్డుకు వెళ్లిన తర్వాత తమకు ఆదేశాలు రాలేదంటూ పలుచోట్ల సమాధానం రావడంతో ఎవరిని సంప్రదించాలో అర్థంకాని అయోమయ స్థితిలో పడ్డారు. రోడ్లపైనా వరి కుప్పలు పొగుపడ్డాయి. రైస్ మిల్లుల దగ్గరా వందలాది ట్రాక్టర్లు వెయిటింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా కొనుగోలు కేంద్రాలు సమయానికి తెరుచుకోకపోవడంతో వర్షానికి తడిచిపోతాయన్న ఆందోళనతో రైతులు నేరుగా మిల్లులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్, జనగాం, యాదాద్రి జిల్లాల్లో రైతులు కోతలు ముగించుకుని అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడనికి రైస్ మిల్లర్లతో వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు కుమ్మక్కు కావడమే కారణమన్న అనుమానాలూ రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
సన్న బియ్యానిది అరిగోస
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులు ఎక్కువగా సన్నవడ్లను సాగుచేశారు. అయితే ప్రభుత్వం ప్రతిపాదించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నవడ్లను కొనే పరిస్థితి లేదు. దీంతో రైతులకు రైస్ మిల్లర్లే దిక్కయ్యారు. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాల్ వరి ధాన్యానికి రూ.1960 మద్దతు ధరగా నిర్ణయించింది. సాధారణ రకం ‘ఏ’ గ్రేడ్ ధాన్యమంటూ ఆ మద్దతు ధరకు అటు ఇటుగా ధరను పెట్టి వ్యాపారులు కొనుగోలుచేయాలి. కానీ రైస్ మిల్లర్లు రకరకాల కొర్రీలు పెడుతూ క్వింటాల్ వరి ధాన్యానికి రూ.1600 మించి ధర పెట్టడం లేదు. ఇదేంటని అడిగితే మా మిల్లులో వరి ధాన్యం సరిపడా ఉందని, వేరే దగ్గర అమ్ముకోండంటూ బదులిస్తున్నారు. అసలే రోజుల తరబడి మిల్లుల ముందు పడిగాపులు కాస్తే 15 రోజులకు సీరియల్ వస్తుంది. ఇప్పుడు మళ్లీ ధర నచ్చక వేరే మిల్లుకు పోతే అక్కడ మరో 20 రోజులకు పైగా ఎదురుచూడాలి. పైగా అక్కడ సైతం ఇదే ధర ఉంటే ఎలా అంటూ రైతులు మిల్లర్లు చెప్పిన ధరలకే ధాన్యం అమ్ముకుంటున్నారు.
టోకెన్ల కోసం పడిగాపులు
మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో రైస్ మిల్లులు భారీగానే ఉన్నాయి. కానీ మిర్యాలగూడ ప్రాంతంలో కేవలం 40 నుంచి 50 మిల్లుల్లో మాత్రమే ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇదే సమయంలో వరిపంట రైతుల చేతికి ఒకేసారి రావడం, మిల్లులకు ధాన్యం పోటెత్తడంతో మిల్లుల వద్ద పరిస్థితి అదుపు చేయలేకుండా ఉంది. దీంతో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలంటూ రైతులు రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగం టోకెన్ల పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో టోకెన్లు ఉన్నవారు మాత్రమే ధాన్నాన్ని మిల్లులకు తీసుకురావాల్సి ఉంది. మిర్యాలగూడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో మరో 5 రోజులకు సరిపడా టోకెన్లు ఇప్పటికే జారీ చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా టోకెన్లు దొరకాలంటే ప్రజాప్రతినిధులు, అధికారులతో పైరవీలు చేయించుకోవాల్సిన దుస్థితి.
రోడ్డెక్కుతున్న అన్నదాతలు
వరి కోయాలంటే టోకెన్ ఉండాలనే నిబంధన విధించడంతో అన్నదాతలు తెల్లవారుజాము నుంచే వ్యవసాయ కార్యాలయాలకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు. కానీ అధికారులు సకాలంలో ఆఫీసులకు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా ఇందుకు నిరసనగా రైతులు త్రిపురారంలో రాస్తారోకోకు దిగారు. టోకెన్ల జారీలో నిర్లక్ష్యంపై ఆందోళన చేపట్టారు. టోకెన్లు ఉంటేనే రోడ్డుపైకి ట్రాక్టర్లు రావాలని పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు సర్ధిచెప్పడంతో రైతులు నిరసన విరమించారు. మిర్యాలగూడలోని రైతు వేదిక వద్ద ధాన్యపు టోకెన్ల కోసం రైతన్నలు బారులు తీరారు. ఉదయం నాలుగు గంటల నుంచే టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నా.. అదేమీ పట్టనట్లుగా అధికారులు 11 గంటలకు నెమ్మదిగా టోకన్లు పంపిణీ చేపట్టారు. మూడో తేదీనే టోకెన్ల కోసం వచ్చామని అప్పుడు టోకెన్లు లేవని ఈ రోజు రమ్మని చెప్పారని అక్కడున్న రైతులు పేర్కొన్నారు. చీటీ రాసి ఇవ్వడంతో ఉదయం నుంచి వేచి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. టోకెన్ల కోసం ఇన్నిసార్లు తిరగాలంటే ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
చోద్యం చూస్తోన్న పాలకులు, అధికారులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాలు తెరుచుకోకపోవడం, మిల్లర్లపై పర్యవేక్షణ కొరవడడంతో వారు చెప్పిందే వేదంగా మారింది. ధాన్యం లోడు గేటు దాటి మిల్లు లోపలికి వెళితే మిల్లరు ఎంత ధర చెబితే అంతే ఫైనల్. లేకుంటే ధాన్యం కొనుగోలు చేసేది లేదు. దీనిపై పలుమార్లు పోలీసులు సిరీయస్ అయినా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. పైగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు మాత్రం ఇప్పటి ధాన్యం కొనుగోళ్ల సంగతిని పక్కకు నెట్టి యాసంగి సీజన్‌లో వరిసాగుపై రాజకీయాలు చేస్తుండడం గమనార్హం. రైతులు ఓ పక్క ధాన్యం అమ్ముకోలేక ముప్పుతిప్పలు పడుతుంటే ఆ రైతాంగాన్ని ఏ ప్రజాప్రతినిధి పట్టించుకున్న పాపనపోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు అలసత్వం వీడి అన్నదాతల వెతలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.