తెలంగాణాకు చేరిన మిడతల దండు

by Sridhar Babu |   ( Updated:2020-06-12 03:59:33.0  )
తెలంగాణాకు చేరిన మిడతల దండు
X

దిశ. కరీంనగర్: మిడతల దండు తెలంగాణాకు వచ్చి చేరింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో మిడతలు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివార్లలోకి వచ్చాయి. గోదావరి తీరంలోని చెట్లపై ఆకులు తింటున్నాయి. అయితే అధికారులు అంచనాలను తలకిందులు చేస్తూ దిగువ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం భూపలపల్లి జిల్లా కలెక్టర్ అజీం కూడా గోదావరి తీరంలో పర్యటించి అప్రమత్తం చేశారు. అయితే మండలంలోని మెట్ పల్లి గ్రామానికి మిడతలు చేరే అవకాశం ఉందని అంచనా వేసి ఆ ప్రాంత సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అనూహ్యంగా అవి మెట్ పల్లికి దాదాపు 25 కిటో మీటర్ల దిగువ ప్రాంతాన ఉన్న పెద్దంపేట శివార్లకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో రసాయనాలను చల్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దంపేట గోదావరి తీరంలోకి చేరుకున్న మిడతలు అక్కడి చెట్ల ఆకులను తినేశాయి. ఆ ప్రాంతంలో పంటలు అంతగా లేనందున అటవీ ప్రాంతంతో పాటు, నదీ తీరంలో మొలిచిన మొక్కల ఆకులను తింటున్నాయి.

Advertisement

Next Story