జాతీయ దృక్పథంతో బాధ్యతలు నిర్వర్తించాలి

by Shyam |
జాతీయ దృక్పథంతో బాధ్యతలు నిర్వర్తించాలి
X

దిశ, క్రైమ్​బ్యూరో: సివిల్ సర్వీస్ అభ్యర్థులు జాతీయ దృక్పథంతో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని హోంశాఖ మాజీ కార్యదర్శి, పద్మభూషణ్​ అవార్డు గ్రహీత కె.పద్మనాభయ్య సూచించారు. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమల విభాగాల్లో తమ ప్రత్యేకతను చాటు కోవాలన్నారు. యూపీఎస్సీ సీఎస్​ఈ -2019లో విజయం సాధించిన అభ్యర్థులకు నేరేడ్​మెట్​ రాచకొండ పోలీస్​ కమిషనరేట్​ కార్యాలయంలో సీపీ మహేష్​ భగవత్​ ఆధ్వర్యంలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కె.పద్మనాభయ్య మాట్లాడుతూ సర్వీస్​‌లో ఐఏఎస్​ లేదా ఐపీఎస్​ ఒంటరిగా పనిచేయలేరన్నారు. ప్రభుత్వంలోని అన్నిరంగాల అధికారులుతో పాటు సమాజంలోని మేధావులతో కూడా స్నేహం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సివిల్​ సర్వీస్​ సుధీర్ఘ ప్రయాణం అన్నారు. సివిల్ సర్వెంట్లు స్థానిక భాష, చట్టాలను నేర్చుకోవాలన్నారు. అప్పుడు మాత్రమే క్షేత్ర స్థాయి అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. పేదలు, నిరుపేదల పట్ల సానుకూలంగా ఉండాలన్నారు. సీపీ మహేష్​ భగవత్​ మాట్లాడుతూ సివిల్ సర్వీస్​ సాధించిన తర్వాత విజయాన్ని గర్వంగా ఫీల్​ కావద్దన్నారు. యూపీఎస్సీకి షార్ట్‌ కట్‌లు లేవన్నారు. పట్టుదల, అంకితభావం, కృషి అవసరం అన్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఫైనాన్స్​ విభాగం ప్రత్యేక కార్యదర్శి సాధు నర్సింహ‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ నుంచి సివిల్స్​ సాధించిన 15మంది అభ్యర్థులను సత్కరించారు.

Advertisement

Next Story