Trending: వారెవ్వా.. పంచాయితీని పరిష్కరించిన గేదె! అవాక్కైన గ్రామ పెద్దలు, పోలీసులు

by Shiva |
Trending: వారెవ్వా.. పంచాయితీని పరిష్కరించిన గేదె! అవాక్కైన గ్రామ పెద్దలు, పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న పంచాయితీని పరిష్కరించే క్రమంలో తలలు పట్టుకున్న గ్రామ పెద్దలు, పోలీసులకు ఓ గేదె పరిష్కారం చూపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేశ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్ అస్కరన్‌పూర్ గ్రామానికి చెందిన నంద్‌లాల్ సరోజ్‌కు చెందిన గేదె కొన్ని నెలల క్రితం తప్పిపోయింది. దీంతో అతడు ఆ గేదె కొసం చుట్టుపక్కల గ్రామాల్లో కాళ్లరిగేలా వెతకడం ప్రారంభించాడు.

అయితే, ఆ గేదె పురే హరికేష్ గ్రామంలోని హనుమాన్ సరోజ్‌ ఇంట్లోకి వెళ్లగా నంద్‌లాల్ సరోజ్‌కు తన గేదె కనిపించింది. అయితే, తన గేదె తనకు ఇవ్వాలంటూ వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో నంద్‌లాల్, మహేశ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి హనుమాన్ సరోజ్‌పై ఫిర్యాదు చేశాడు. కాగా, గురువారం ఇద్దరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అక్కడ కూడ గేదె తనదంటే తనదని ఇద్దరూ పంచాయితీకి దిగారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. పంచాయతీని పరిష్కరించేందుకు ఎస్‌హెచ్‌‌వో శ్రవణ్ కుమార్ సింగ్ రంగంలోకి దిగారు.

ముందుగా గేదెను ఒంటరిగా రోడ్డుపై వదిలేస్తామని, దానంతట అది యజమానిని గుర్తించి ఎవరి వెంట అయితే వెళ్తుందో అది వారిదేనని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఎస్‌హెచ్‌వో శ్రవణ్ నం‌ద్‌లాల్, హనుమాన్‌లను వారి గ్రామాలకు వెళ్లే దారిలో వ్యతిరేక దిశలో నిలబెట్టాడు. అనంతరం గేదెను పోలీస్ స్టేషన్ నుంచి వదిలేయగా అది నంద్‌లాల్‌ అనుసరించి రాయ్ అస్కరన్‌పూర్ గ్రామం వైపు వెళ్లింది. దీంతో చేసేదేమి లేక హనుమాన్ సరోజ్ అబద్ధం ఆడాడనే విషయం పోలీసులకు తెలియడంతో అతడిని మందలించి వదిలేశారు. ఈ క్రమంలో నెలలు గడిచినా.. గేదె తన యజమానిని గుర్తించి అతడి వెంట వెళ్లడంతో గ్రామ పెద్దలు, పోలీసులు దాని తెలివిని చూసి అవాక్కయ్యారు.

Advertisement

Next Story

Most Viewed