- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వర్గీకరణ’ ఆలస్యంపై ఎస్సీలు సీరియస్.. కాంగ్రెస్‌లో కొత్త టెన్షన్..!
దిశ, తెలంగాణ బ్యూరో : ఎస్సీ వర్గీకరణ అంశం కాంగ్రెస్ నేతల్లో సరికొత్త అలజడిని తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అన్ని రాష్ట్రాలకన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడంతో మాదిగ కమ్యూనిటీలో సంతోషం వ్యక్తమైంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగున్నరేండ్ల పాటు అమలైన ఫార్ములాతో తెలంగాణలో వెంటనే అమల్లోకి వస్తుందని పలువురు భావించారు. పార్టీలకు అతీతంగా ఆ కమ్యూనిటీకి చెందిన లీడర్లు సైతం ఆశలు పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించడంతో నీరసపడ్డారు. ఇప్పుడు సింగిల్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రకటించడంతో ఆందోళనలో పడ్డారు. కాలయాపన జరుగుతుందనే అనుమానాలు వారిలో నెలకొన్నాయి. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందోననే గుబులు కాంగ్రెస్ నేతల్లో మొదలైంది.
తాత్సారం అంటూ మందకృష్ణ ఆరోపణలు
ఎస్సీ వర్గీకరణ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదంటూ ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 9న అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి రెండు నెలలు దాటిపోయిందని, మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు అందకుండా పోయాయన్నారు. డీఎస్సీ నియామకాల్లో అన్యాయం జరుగుతున్నదని, ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకునేలోపు ఇంకా ఎన్ని పరీక్షల్లో అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందోననే ఆందోళన వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటై పలు కుల సంఘాలతో చర్చలు జరిపి విధివిధానాలపై కసరత్తు చేసి నివేదిక ఇచ్చేటప్పటికి ఇంకెంత కాలం పడుతుందోననే అనుమానాన్ని వెలిబుచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవెళ్లలో ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించి వర్గీకరణపై స్పష్టమైన హామీ ఇచ్చారని పలువురు కాంగ్రెస్ నేతలు గుర్తుచేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాగ్దానం చేసిందని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందని పలువురు కాంగ్రెస్ నేతలు (ఎమ్మెల్యేలు సహా) గుర్తుచేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నిమిషాల వ్యవధిలోనే అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ స్టేట్‌మెంట్ ఇవ్వడంతో సంతృప్తి చెందామన్నారు. వర్గీకరణపై విధాన నిర్ణయం తీసుకుని వీలైనంత తొందరగా అమలు చేయాలంటూ మంద కృష్ణమాదిగ సహా పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. అతి తొందర్లోనే ఆ ఫలాలను అందుకుంటారనే భరోసా ఇచ్చారని, కానీ ఆ తర్వాత కేబినెట్ సబ్ కమిటీ, జ్యుడీషియల్ కమిషన్ లాంటి నిర్ణయాలతో జాప్యం జరుగుతుందనే సందేహాలు మొదలయ్యాయని ఆ నేతలు వ్యాఖ్యానించారు.
స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం
ఎలాంటి లీగల్ చిక్కులు రాకుండా పకడ్బందీ ప్రణాళికతో వర్గీకరణపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. అందులో భాగంగానే అడ్వొకేట్ జనరల్‌తో మాట్లాడి అభిప్రాయాలను తెలుసుకున్నది. కేబినెట్ సబ్ కమిటీ, జ్యుడీషియల్ కమిషన్ మెకానిజం సైతం భవిష్యత్తులో కోర్టు కేసులతో ప్రక్రియ ఆగిపోకూడదన్న ముందుజాగ్రత్త చర్యల్లో భాగమేనని వివరించింది. కానీ జ్యుడీషియల్ కమిషన్ అధ్యయనం చేసి స్పష్టమైన సిఫారసులు చేయడం, ఆ తర్వాత ప్రభుత్వం పరిశీలించి ఆమోదించడం, అవసరమైన సవరణలు చేయడం, చట్టం లేదా ఉత్తర్వుల దిశగా అడుగులు వేయడం.. వీటన్నింటితో కాలయాపన జరుగుతుందనేదే మాదిగ కమ్యూనిటీ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ఆందోళన. ప్రభుత్వ ఆలోచన ఎలా ఉన్నా సత్వరం ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్ ఫలాలను అందుకోలేకపోతున్నామనేదే వారు లేవనెత్తుతున్న వాదన.
స్థానిక ఎన్నికలపై ప్రభావం?
వర్గీకరణ అమలు కాకపోవడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగెటివ్ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే సందేహాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సగటున 15 వేల నుంచి 50 వేల వరకు ఓటు బ్యాంకు (మాదిగ) ఉన్నదని, వీరిని కన్విన్స్ చేయడం సవాలుగా మారనున్నదని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని టేకప్ చేసి కాంగ్రెస్‌ను, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అవకాశమున్నదని, మంద కృష్ణమాదిగ సైతం వరుస ఆందోళనలతో ఉద్యమ రూపాన్ని తీసుకుంటారని అనుమానపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఫార్ములా రెడీగా ఉన్నందున దాని ఆధారంగానే అమలు చేస్తే సమస్య ఉండదనే అభిప్రాయంతో ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తమిళనాడు, పంజాబ్ ఎస్సీ వర్గీకరణ పాలసీని రూపొందించి అమల్లోకి తెచ్చాయని, ఇక్కడ జాప్యం జరగడం రాజకీయ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందనే సందేహాన్ని లేవనెత్తారు.