ఇవి ఇందిరమ్మ ఇళ్లేనా? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ?

by Y.Nagarani |
ఇవి ఇందిరమ్మ ఇళ్లేనా? ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ?
X

దిశ, కొత్తగూడెం రూరల్: కొత్తగూడెం రామవరం ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. చాలా లబ్ధిదారులు స్లాబ్, కిటికీ లెవెల్ వరకు నిర్మించుకున్నారు. దాదాపు 20ఏండ్లుగా వినియోగంలో లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకుని, బీటలు వారిన పరిస్థితి నెలకొంది. గృహాలన్నీ ముళ్లపొదల్లో దర్శనమిస్తున్నాయి. చుట్టుపక్కల సేకరించిన చెత్తను ఏండ్లుగా ఇక్కడే వేస్తుండటంతో ఇందిరమ్మ కాలనీ ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డ్‌గా మారింది. దుర్వాసన వెదజల్లుతుండటంతో స్థానికులు సతమతం అవుతున్నారు. గతంలో ఇక్కడ వేసిన రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెరగడంతో క్రమంగా రహదారి మూసుకుపోతోంది. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు ఈ ఇండ్లను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. మరోవైపు కొన్ని ఇండ్లు దళారుల చేతిలోకి వెళ్లాయని, మరొకొన్ని ఇండ్లు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గానికి దాదాపు 1100పైగా ఇందిరమ్మ గృహాలు మంజూరు చేశారు. విడతలవారీగా పాత కొత్తగూడెం రామవరం ప్రాంతంలో గృహాలు మంజూరు చేయగా కొందరు నిర్మించుకోగా మరికొందరు ఇండ్లను నిర్మించుకోలేకపోయారు. రామవరం ప్రాంతంలో ఎక్కువ మంది లబ్ధిదారులు స్లాబ్ కిటికీ లెవెల్ వరకు నిర్మించుకోగా బిల్లులు సకాలంలో రాని కారణంగా వాటిని పూర్తి చేసుకోలేకపోయారు. ఇలా ఇండ్లు సగం వరకే పూర్తి కావడంతో అవి ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. అలంకారప్రాయంగా ఉన్న ఇందిరమ్మ గృహాలు ముళ్లపొదల్లో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఇండ్ల చుట్టూ పిచ్చి చెట్లు పూలవనంలో మునిగిపోయి కనిపిస్తున్నాయి. దాదాపు 20ఏండ్లుగా రామవరంలో ఇందిరమ్మ గృహాలు ఉపయోగం లేకపోవడంతో అవి శిథిలావస్థకు చేరుకొని బీటలు బారిన పరిస్థితి నెలకొంది. ఈ గృహాలను బీఆర్ఎస్ పాలనలోనూ ఉపయోగంలోకి తేలేకపోయారు.

చెత్త డంపింగ్ యార్డ్‌గా...

కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న ఇందిరమ్మ కాలనీ ప్రస్తుతం చెత్త డంపింగ్ యార్డ్‌గా నిలిచింది. గతంలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఇందిరమ్మ ఇండ్లు కొందరు నిర్మించుకొని నివాసం ఉంటుండగా మరికొందరు నిర్మించుకోలేక మధ్యలోనే నిర్మాణాలను వదిలేయడంతో ఈ గృహాలు శిథిలావస్థకు చేరుకొని ముళ్ల పొదల్లో ములుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి గత కొన్ని సంవత్సరాలుగా ఉండటంతో రామవరం ప్రాంతంలో సేకరించిన చెత్తను మొత్తం తీసుకువచ్చి ఇంద్రమ్మ కాలనీలో పోయడంతో అక్కడంతా డంపింగ్ యార్డ్‌గా మారి పరిసర ప్రాంతాల ప్రజలకు దుర్వాసన వెదజల్లుతుండటంతో వారంతా ఆవేదన చెందుతున్నారు.

కనుమరుగవుతున్న రహదారి..

గతంలో రామవరం ప్రాంతంలో ఇందిరమ్మ కాలనీకి వేసిన రోడ్డు కనుమరుగవుతోంది. ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెరిగి రహదారి మూసుకుపోతోంది. ఇలా ఉండటంతో నిరుపయోగం ఉన్న ఇందిరమ్మ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు సైతం నిలయంగా నిలిచినట్లుగా తెలుస్తోంది. కాలనీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్ నిరుపయోగంగా మారింది.

దళారుల చేతిలో..

రామవరం ప్రాంతంలో నిరుపయోగంగా ఉన్న కొన్ని ఇందిరమ్మ ఇండ్లు దళారుల చేతిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని ఇండ్లు ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సంబంధిత అధికారులు విచారణ జరిపి కబ్జాకు గురైన ఇండ్లు స్వాధీనం చేసుకుని, అసలైన లబ్ధిదారులకు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

పేదలకు కేటాయించాలి

రామవరంలో నిరుపయోగంలో ఉన్న ఇందిరమ్మ గృహాలను అసలైన నిరుపేదలకు కేటాయించాలి. శిథిలావస్థలో ఉన్న గృహాలను పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని కాంగ్రెస్ నాయకులు నాగ సీతారాములు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం : పుల్లయ్య, కొత్తగూడెం పట్టణ తహసీల్దార్

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం ప్రాంతంలో ఉన్న ఇందిరమ్మ గృహాల నిరుపయోగంపై ప్రభుత్వ సూచన మేరకు చర్యలు తీసుకుంటాం. నిజమైన లబ్ధిదారులకు పక్కా గృహాలు అందేలా కృషి చేస్తాం. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తాం.

Advertisement

Next Story

Most Viewed