భారీ బదిలీలకు రంగం సిద్ధం.. ఒకటీ రెండు రోజుల్లో...

by karthikeya |   ( Updated:2024-10-05 02:45:09.0  )
భారీ బదిలీలకు రంగం సిద్ధం..  ఒకటీ రెండు రోజుల్లో...
X

దిశ, తెలంగాణ బ్యూరో: సచివాలయంలో వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేయడానికి రంగం సిద్ధమైంది. సాధారణ పరిపాలన (జీఏడీ), ఆర్థికం (ఫైనాన్స్), న్యాయ (లా) విభాగాలు మినహా మిగిలిన అన్ని డిపార్టుమెంట్లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొదలు జాయింట్ సెక్రెటరీ వరకు బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనికి అనుసరించాల్సిన విధానాలపై జీఏడీ రూపొందించినన నివేదికకు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సచివాలయ వర్గాల సమాచారం. ఆ నిర్ణయం ఆధారంగా ఒకటీ రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నది. గడిచిన పదేండ్ల కాలంలో స్వల్ప స్థాయిలో బదిలీలు చోటు చేసుకున్నా.. లాంగ్ స్టాండింగ్ అనే కోణం ఆలోచించి నిర్ణయం జరగలేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం 32 విభాగాల్లో దాదాపు 400 మందికి మించి బదిలీ అయ్యే అవకాశమున్నట్లు తెలిపాయి. దీంతో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్రెటరీ, డిప్యూటీ సెక్రెటరీ స్థాయి వరకు పదుల సంఖ్యలో బదిలీలు ఉంటాయని, జాయింట్ సెక్రెటరీ ర్యాంకులో మాత్రం తక్కువ మంది ఉండొచ్చని సూచనప్రాయంగా తెలిపాయి.

దీర్ఘకాలంగా పని చేస్తున్నందున..

దీర్ఘకాలంగా ఒకే డిపార్టుమెంటులో వీరు పనిచేస్తున్నందున ఇప్పుడు బదిలీ చేయాల్సి వస్తున్నట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వివరించారు. సాధారణంగా ప్రతి సంవత్సరం రొటీన్ పద్ధతిలో ఇలాంటి బదిలీలను పరిపాలనా అవసరాల రీత్యా ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుందని, కానీ 2017, 2018 సంవత్సరాల్లో చాలా తక్కువ సంఖ్యలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. ఒకే శాఖలో ఎక్కువ కాలంగా వీరు పనిచేస్తుండడంతో తగినంత అనుభవాన్ని సంపాదించినా.. మిగిలిన సిబ్బందికి అవగాహన కల్పించలేని పరిస్థితి నెలకొన్నదని ప్రభుత్వం భావించింది. ఏదేని పరిస్థితుల్లో అనుభవం ఉన్న సదరు ఉద్యోగి ఆఫీసులో అందుబాటులో లేకపోతే మిగిలిన స్టాఫ్‌తో ఆ పనులు జరగడం లేదనే నిర్ధారణకు వచ్చింది. దీనికి తోడు ఫోకల్, నాన్-ఫోకల్ పోస్టులనే అభిప్రాయంతో ఇతర సిబ్బందికి తగిన అవకాశాలు రావడంలేదని, ఎప్పటికీ వారు అనుభవాన్ని పొందలేని కింది స్థాయిలోనే ఉండిపోతున్నరనే ఫీడ్ బ్యాక్ కూడా అధికారుల ద్వారా ప్రభుత్వానికి వెళ్లింది. కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ అధికారులు సైతం సదరు అనుభవమున్న వ్యక్తిపైనే ఆధారపడాల్సి వస్తున్నదని తేలింది. ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకున్న ప్రభుత్వం... వేర్వేరు డిపార్టుమెంట్లలోకి బదిలీ చేయాలని నిర్ణయించింది.

ర్యాంకుల వారీగా వివరాలు

జీఏడీ అధికారులు ఆయా విభాగాల్లో నాలుగేండ్లు, ఆరేండ్లు, పదేండ్లకంటే ఎక్కువ కాలం నుంచి ఎవరెవరు పనిచేస్తున్నారో ర్యాంకులవారీగా వివరాలను సేకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. వీటిని పరిశీలించిన అనంతరం నాలుగేండ్ల కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం సింగిల్ యూనిట్ సిస్టమ్ పద్ధతిలో బదిలీలు చేపట్టాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రకారం ఫైనాన్స్, జీఏడీ, లా డిపార్టుమెంట్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో బదిలీలు చేపట్టేలా నిర్ణయం జరిగింది. ఈ లెక్కల ప్రకారం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ర్యాంకులో సుమారు 150 మంది (ఇందులో దాదాపు పాతిక మంది ఆరేండ్లకు పైగా పనిచేస్తుండగా, మరో ఇరవై మంది పదేండ్లకు మించి పనిచేస్తున్నారు) బదిలీ కానున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. సెక్షన్ ఆఫీసర్‌ ర్యాంకులో మరో 150 మంది, అసిస్టెంట్ సెక్రటరీ స్థాయిలో దాదాపు యాభై మంది, డిప్యూటీ సెక్రెటరీ లెవల్‌లో దాదాపు ఇరవై మంది ఉంటారని పేర్కొన్నాయి.

ఒకేసారి బదిలీ చేస్తే పనిపై ప్రభావం

ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఏదేని ఒక అంశానికి సంబంధించి నాలుగు స్థాయిల్లో ఫైల్ సర్క్యులేట్ అవుతుందని సచివాలయ వర్గాలు తెలిపాయి. పరిశీలన తర్వాత ఫైనల్ డెసిషన్ జరుగుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్టంగా ఒక డిపార్టుమెంటులో ఒకేసారి బదిలీలు జరగడం ద్వారా కొత్తవారు బాధ్యతలు చేపడితే ఆశించినంత వేగంగా పనులు జరగవనే అభిప్రాయపడ్డాయి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తయారు చేసిన జాబితాలో 50% మందిని మాత్రమే బదిలీ చేస్తే కొత్తగా వచ్చేవారిని గైడ్ చేయడానికి వీలవుతుందని పేర్కొన్నాయి. ప్రతి ఏటా ఇలాంటి బదిలీలు చేపడితే పనిపై ప్రభావం పడకుండా ఉంటుందన్నాయి. కొత్త సిబ్బందికి ఆయా అంశాలపై అవగాహన లేకపోవడంతో ఫైల్ సర్క్యులేషన్, డిసిషన్ మేకింగ్‌లో ఆలస్యం కావొచ్చనే అభిప్రాయముంది. కొత్త సిబ్బందికి పూర్తిస్థాయి పట్టు దొరికేంతవరకు అనుభవం ఉన్న పాతవారిని కూడా కంటిన్యూ చేస్తే బాగుండేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తప్పుపట్టకపోయినా ఆచరణాత్మక ఇబ్బందులపైనే ఆందోళన చెందుతున్నారు. బదిలీ నిర్ణయంతో 32 డిపార్టుమెంట్లకు చెందిన పై నాలుగు ర్యాంకుల్లోని (జాయింట్ సెక్రెటరీలు మినహా) సిబ్బంది వేర్వేరు విభాగాలకు వెళ్లనున్నారు. పదేండ్ల తర్వాత పూర్తిస్థాయిలో బదిలీ కావడంపై హర్షం వ్యక్తం చేస్తూనే పట్టు దొరికేంత వరకు ఆశించినంత వేగంగా ప్రభుత్వ పనులు జరగవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. బదిలీ వేటు పడకుండా కొద్దిమంది పైరవీలు చేసుకుంటున్నారన్న మాటలూ సచివాలయం కారిడార్లలో వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed