ట్రెండింగ్ వెబ్ సిరీస్ లు

by Shyam |   ( Updated:2020-05-22 06:04:51.0  )
ట్రెండింగ్ వెబ్ సిరీస్ లు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది. ఓ వైపు సినిమాలు.. మరో వైపు వెబ్ సిరీస్ లతో .. ప్రేక్షకలోకానికి సరికొత్త వేదికగా నిలుస్తున్నాయి. వెబ్ సిరీస్ లైతే.. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందుతూ నెటిజన్లకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. క్రైమ్, హార్రర్, సస్పెన్స్, లవ్, కామెడీ, ట్రాజెడీ ఇలా అన్నీ జోనర్ల వెబ్ సిరీస్ లకు నెటిజన్లు పట్టం కడుతున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే.. వెబ్ సిరీస్ లు సక్సెస్ సాధించడంతో పాటు .. రెండో పార్ట్ తీసేందుకు కూడా అవకాశం తీసుకు వస్తున్నాయి. గత వారం విడుదలైన కొన్ని సిరీస్ లతో పాటు, మే చివరి వారంలో మన ముందుకు కొన్ని వెబ్ సిరీస్ లు రానున్నాయి.

1. బేతాళ్ :
నెటిజన్లు ఎంతో ఆసక్తి తో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ లలో ‘బేతాళ్’ ముందు వరసలో ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ‘బేతాళ్’ మరిన్ని అంచనాలు పెంచింది. ‘అడవుల్లో నివసిస్తున్న ప్రజల్ని మరో చోటుకు తరలించి, ఆ ప్రదేశంలో హైవే నిర్మించాలని అధికారులు భావిస్తారు. అందుకోసం ఆర్మీ అధికారులు బేతాళ్ కొండల్లో ఉన్న ఆ మనుషుల దగ్గరకు వెళతారు. అయితే రెండు శతాబ్దాల క్రితం చనిపోయిన బ్రిటీష్ ఆర్మీ అధికారి.. జాంబీలైన తన సైనికులతో బేతాళ్ కొండల్లోకి వచ్చిన ఆర్మీ అధికారులపై దాడికి దిగుతారు.’.మరి ఆ తర్వాత ఏం జరుగుతుందన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. మొట్టమొదటి సారిగా ఇండియాలో వస్తున్న జాంబీ సిరీస్ కావడంతో పాటు, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఈ సిరీస్ ను నిర్మిస్తుండటంతో నెటిజన్లలో దీనిపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. హారర్ జోనర్ లో వస్తున్న ఈ సిరీస్ లో వినీత్ కుమార్, అహానా కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. గెటవుట్, పారానార్మల్ యాక్టివిటీ, ఇన్సైడియస్, ది ఇన్విజబుల్ మ్యాన్ తదితర హాలీవుడ్ చిత్రాలకు ప్రొడక్షన్ వర్క్ అందించిన జేసన్ బ్లమ్ కు చెందిన బ్లమ్ హౌజ్ ప్రొడక్షన్స్ బేతాళ్ సిరీస్ కు పనిచేస్తుండటం విశేషం. మే 24న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

2. కాళి -2
2018లో విడుదలైన ‘కాళి’ వెబ్ సిరీస్ సక్సెస్ సాధించింది. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘తన కొడుకును కాపాడుకోవడానికి ఎంతమందితోనైనా పోరాడటానికైనా సిద్ధపడిన తల్లి కథే’ ఈ సిరీస్. ఈ పోరాటంలో.. ఆమె ఎంతోమంది కరుడుగట్టిన నేరస్థులను కూడా చంపుతుంది. తల్లిగా ఓ కొడుకుపై ఆమె చూపించే ప్రేమ, కొడుకునే కాపాడుకునేందుకు ఆమె చేసే పోరాటం
ఆమె ధైర్యం, తె1గువ నెటిజన్లకు ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగించాయి. లీడ్ రోల్ పోషించిన పౌలి డామ్ నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. రోహన్ ఘోస్, ఆరిత్ర సేన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు రెండో పార్ట్ మే 29న జీ5 ఒరిజనల్ వేదికగా విడుదలవుతుంది.

3.భూతియాగిరి
ఇదో కామెడీ హార్రర్ బేస్డ్ సిరీస్. వారసత్వంగా వచ్చిన ఓ ఇంటిని .. హోటల్ గా మార్చాలనుకుంటాడు దిలావర్ రానా. అయితే ఆ ఇంట్లో దెయ్యాలున్నాయని ఊరంతా చెప్పుకుంటారు. రానా ఆ ప్రచారాన్నే తనకు హోటల్ ను కస్టమర్ రావడానికి ఉపయోగించుకుంటారు.‘బెస్ట్ హంటింగ్ ఎక్స్ పీరియన్స్’ కోసం తమ హోటల్ కు రావాల్సిందిగా అడ్వర్టైజ్ చేస్తారు. అయితే అందులో నిజంగానే ఉన్న పిల్ల దెయ్యాలు కస్టమర్స్ ను ఏం చేస్తాయి. బిజినెస్ లో రానా సక్సెస్ సాధించాడా లేదా అన్నదే ఈ సిరీస్ కథ. దిలావర్ రానా గా సుమిత్ వ్యాస్ నటించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్ వేదికగా మే 14న ఇది విడుదలైంది.
4. రిజెక్ట్ ఎక్స్ 2
గతేడాది వచ్చిన ‘రిజెక్ట్ ఎక్స్ ’ మిస్టరీ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీనికి సీక్వెల్ గా ‘రిజెక్ట్ ఎక్స్ -2’ వస్తోంది. ఫస్ట్ సిరీస్ కు మించిన థ్రిల్లర్ అంశాలతో దీన్ని రూపొందించామని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. ఈషా గుప్తా ఇందులో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈషా గుప్తా ఓ మర్డర్ మిస్టరీని ఇన్విస్టిగేట్ చేస్తోంది. ఈ కేసు ఇన్విస్టిగేషన్, మర్డర్ మిస్టరీలు ‘జెఫర్సన్ వరల్డ్ స్కూల్’ లో చదివే కొందరు విద్యార్థుల లైఫ్ ను ఏ విధంగా ప్రభావితం చేసిందనే కథాంశంతో ఇది తెరకెక్కింది. సోనాలి బింద్రే భర్త బెహల్ దీన్ని నిర్మించారు. గత వారం మే 14న ఈ సిరీస్ జీ5 లో విడుదలైంది.

5. పాతాళ్ లోక్ :
ఇటీవల కాలంలో సినీ అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూసేలా చేసిన వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’. ఇటీవలే విడుదలైన ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది. ‘ఢిల్లీలో ఉన్న ప్రముఖ న్యూస్ చానెల్ హెడ్ పై మర్డర్ అటెంప్ట్ జరగనుందని పోలీసులకు తెలుస్తుంది. దాంతో చంపడానికి వచ్చిన నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అయితే మర్డర్ ప్లాన్ వేసిందెవరు? ఎందుకు చంపాలనుకుంటున్నారు? పోలీసులు కేసును సాల్వ్ చేశారా లేదా? కేసును సాల్వ్ చేయకుండా అడ్డుకునేదెవరు?’ ఇదే పాతాళ్ లోక్ కథ. ఉత్కంఠ రేపే సస్పెన్స్ తో ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు . జైదీప్ అహ్లావత్ లీడ్ రోల్ పోషించారు. సుదీప్ శర్మ ఈ సిరీస్ కు కథ అందించారు. అవినాష్, ప్రొసిత్ రాయ్ లు ఈ సిరీస్ కు దర్శకత్వం అందించారు. బాలీవుడ్ ప్రముఖ నటి అనుష్క శర్మ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 15న ఇది విడుదలైంది.

‘ద కాసినో’ జూన్ 12న జీ5 లో రాబోతుండగా, గతంలో సక్సెస్ సాధించిన కొన్ని వెబ్ సిరీస్ లకు సీక్వెల్ సిరీస్ లు కూడా మరికొన్ని రోజుల్లో రానున్నాయి. అందులో ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, బారిష్, బ్రీత్, కామాటిపుర, అభయ్ లు ఉన్నాయి.

Advertisement

Next Story