తొలి పాటతోనే ‘రోడ్రిగో’ సంచలనం

by Shyam |
తొలి పాటతోనే ‘రోడ్రిగో’ సంచలనం
X

దిశ, వెబ్‌డెస్క్‌: అమెరికన్ యాక్ట్రెస్, సింగర్ ఒలివియా రోడ్రిగో తన ఫస్ట్ సింగిల్ ‘డ్రైవర్స్ లైసెన్స్’తో సంచలనాలు సృష్టిస్తోంది. తొలి పాటతోనే బిల్‌బోర్డ్ హాట్ 100‌లో అగ్రస్థానం దక్కించుకున్న ఒలివియా సంగీత సంచలనంగా మారింది. అంతేకాదు ఈ పాట ఇటీవల పాపులర్‌గా మారిన ‘బెడ్‌రూమ్ పాప్’ ట్రెండ్‌కు సాక్ష్యంగా నిలుస్తుంది. మ్యూజికల్ సునామీ ఒలివియా రోడ్రిగో విశేషాలతో పాటు, ‘బెడ్‌రూమ్ పాప్’ అంటే ఏమిటో తెలుసుకుందాం.

కాలిఫోర్నియాలో జన్మించిన రోడ్రిగో.. ఆరో ఏట నుంచే సింగింగ్, యాక్టింగ్‌లలో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలో 2015లో ‘ఎన్ అమెరికన్ గర్ల్ : గ్రేస్ స్టిర్స్ అప్ సక్సెస్’ వీడియో ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించగా, 2016లో ‘బిజార్డ్‌వార్క్’ సిరీస్‌లో పైజ్ ఓల్వెరా పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది. డిస్నీ చానల్ ప్రొగ్రామింగ్‌లోనూ బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, తన కెరీర్‌ను కొనసాగించింది. 2019లో వచ్చిన ‘మాక్యుమెంటరీ హై స్కూల్ మ్యూజికల్: ది మ్యూజికల్: ది సిరీస్’లో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, మ్యూజిక్ కూడా అందించి ఇండస్ట్రీ ప్రశంసలందుకుంది. అమెరికా ప్రఖ్యాత మ్యూజిక్ లేబుల్ కంపెనీలు ఇంటర్‌స్కోప్, గెఫెన్ రికార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 8న ఆమె తన తొలి సింగిల్ ‘డ్రైవర్స్ లైసెన్స్’‌ సాంగ్‌ను విడుదల చేయగా, తొలి వారంలోనే ఆ సింగిల్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, మోస్ట్ నాన్ హాలీడే స్ట్రీమింగ్ సాంగ్‌గా రెండుసార్లు స్పాటిఫై రికార్డును బద్దలుకొట్టింది. 11న.. రోడ్రిగో పాట స్పాటిఫైలో 15.7 మిలియన్లకు పైగా గ్లోబల్ స్ట్రీమింగ్‌కు చేరుకోగా, మరుసటి రోజే 17 మిలియన్లకు పైగా గ్లోబల్ స్ట్రీమ్‌లను అధిగమించింది. ఈ క్రమంలో ఈ పాట బిల్‌బోర్డ్ హాట్ 100‌లో అగ్రస్థానం దక్కించుకోగా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, నెదర్లాండ్స్, నార్వే, యునైటెడ్ కింగ్‌డమ్‌ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ టేలర్ స్విఫ్ట్, న్యూజిలాండ్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ లోర్డే‌ను స్ఫూర్తిగా తీసుకున్న రోడ్రిగో ఒకే పాటతో స్టార్ అయింది.

ఇటీవల కాలంలో ‘బెడ్‌రూమ్ పాప్’ చాలా పాపులర్ అవుతున్న ట్రెండ్. ఇదేంటంటే.. చాలా మంది డెబ్యూ సింగర్స్ చేతిలో డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంతో టాలెంట్ ఉన్నప్పటికీ రికార్డింగ్ స్టూడియో బుక్ చేసుకుని పాటలు పాడటం ఆర్థికంగా కష్టమవుతుంది. ఒకవేళ పాడినా, మ్యూజిక్ లేబుల్స్‌తో ఒప్పందం చేసుకోవడం, ప్రమోటర్లు, మీడియా వంటి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అలా కాకుండా తమ సంగీతాన్ని ప్రపంచంతో పంచుకోవాలనుకునే యువ సంగీత కళాకారులు( గాయకులు, రచయితలు, నిర్మాతలు) తమ బెడ్‌రూమ్ లేదా ఇల్లే వేదికగా పాటలు పాడితే, వాటిని డైరెక్ట్‌గా ప్రేక్షకులతో పంచుకునే అవకాశాన్ని యూట్యూబ్, స్పాటిఫై ఇతర స్ట్రీమింగ్ సర్వీసులు అందిస్తున్నాయి.

Advertisement

Next Story