- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మెడకు బిగుస్తున్న ఉచ్చు.. ఆందోళనలో టీఆర్ఎస్ శ్రేణులు
దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్ సింహమీద స్వారీ చేస్తున్నారు. దళితబంధు పథకాన్ని ప్రకటించి తేనెతుట్టెను కదిపారు. పథకాన్ని ప్రకటించిన తొలిరోజుల్లో బాగానే అనిపించినా అమలులో అనేక చిక్కులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. వాసాలమర్రిలో హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలోని అన్ని ఎస్సీ కుటుంబాలకు సాయం మంజూరుచేశారు. అంతటితో ఆగకుండా ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్ సెగ్మెంట్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆ సెగ్మెంట్లోని 20,929 కుటుంబాలకు సాయం అందించనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా అందరికీ దళితబంధు అందించడం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉన్నది. లబ్ధదారుల ఎంపిక పెను సవాలుగా మారనుంది. ఈ మేరకు అధికార పార్టీ నేతలపై ఒత్తిడి కూడా ఎక్కవగా ఉండే చాన్స్ ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న‘దళితబంధు’ పథకం ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మెడకు చుట్టుకుంటున్నది. హుజూరాబాద్‌లో లాంఛనంగా దీనిని ప్రారంభించడానికి ముందే అక్కడి దళిత కుటుంబాల నుంచి నిరసనలు మొదలయ్యాయి. సముదాయించడం పార్టీ నేతలకు తలకు మించినభారంగా మారింది. పేద దళితులందరికీ దీన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్తున్నా లబ్ధిదారుల ఎంపిక ఎలాగో తెలియక గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వ సిబ్బందికి, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ అంశం సవాలుగా పరిణమించింది. ఎమ్మెల్యేలకు ఇది గుదిబండగానే మారింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులను ఎంపిక చేయకలేక పెండింగ్‌లో ఉంచినట్టే ఇప్పుడు దళితబంధు కూడా తయారైందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో మొత్తం 76 దళిత కుటుంబాలకూ నిధులు విడుదలయ్యాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం 20,929 కుటుంబాలకూ అందించనున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. మంత్రి హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం తాజాగా దాన్నే నొక్కిచెప్పారు. అయితే హుజూరాబాద్ మినహా మిగిలిన 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందో, అందరికీ అందుతుందా? లేక కొంత మందికేనా? అనే సందేహాలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. ఈ పథకంపై వరుస సమీక్షలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ ఇటీవల ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌కు వంద మంది చొప్పున లబ్ధిదారులను తొలి దఫా ఎంపిక చేస్తామని ప్రకటించారు. కానీ హుజూరాబాద్‌లో అన్ని కుటుంబాలకూ అందుతున్నందున రాష్ట్రవ్యాప్తంగా ఇదే డిమాండ్ మొదలైంది. దీన్ని చల్లార్చడం ఇప్పుడు అధికార పార్టీ నేతలకు కత్తిమీద సాములా మారింది.
బీసీ, మైనారిటీ ‘బంధు’డిమాండ్..
ఒకవైపు బీసీ బంధు, మైనారిటీ బంధు ప్రకటించాలని ఆయా సెక్షన్ల ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. బీసీ బంధు ఇవ్వకుంటే హుజూరాబాద్‌లో ఓట్ల బంద్ తప్పదంటూ ఆ సంఘాలు హెచ్చరించాయి. ప్రజల్లోకి కూడా అదే సందేశాన్ని తీసుకెళ్లాయి. దళితబంధు విషయంలో దళితుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కోవడం సవాలుగా మారిన పరిస్థితుల్లో బీసీలు, మైనారిటీల నుంచి కూడా ఊహించని రీతిలో ఒత్తిడి పెరుగుతుండటం గమనార్హం. పేద దళితులు ఎక్కడున్నా వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయని, కానీ ఒక్క హుజూరాబాద్‌లో మాత్రమే మొత్తం దళిత కుటుంబాలకు ఈ సాయాన్ని అందించి మిగిలిన నియోజకవర్గాల్లో కొందరికే అందించడం అనేక విమర్శలకు దారి తీస్తున్నది. దళితులు సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రే ఇప్పుడు హుజూరాబాద్‌కు ఒక రకంగా మిగితా నియోజకవర్గాలకు మరో విధంగా అమలుచేస్తూ వివక్ష చూపుతున్నారన్న అపవాదును మూటగట్టుకున్నారు.
అమలు పెను సవాలే..
దశలవారీగా రాష్ట్రమంతా అమలుచేస్తామని, మొత్తం దేశానికే ఇది ఆదర్శనీయమైన పథకంగా మారుతుందని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నా ఒకే గ్రామంలో కొద్దిమందికి అంది మిగిలినవారికి అందలేదన్న అసంతృప్తిని ఏ విధంగా చల్లారుస్తారనేది కీలకంగా మారింది. సర్పంచ్ మొదలు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి వరకు ఇలాంటి పెను సవాలునే ఎదుర్కోనున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే దళితుల్లోనే కొద్ది మందికి ఇచ్చి మెజారిటీ కుటుంబాలకు ఇవ్వకపోవడం వివక్షాపూరితమేననే విమర్శలకు సమాధానం చెప్పడం మరో సవాలని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని శనివారం హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళిత మహిళలు ఘాటుగానే నిలదీశారు. మంత్రి హరీశ్‌రావు, ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పర్యటనలోనూ దళిత కుటుంబాల నుంచి ఇవే నిలదీతలు ఎదురయ్యాయి. రాష్ట్రంలోని మొత్త దళితులందరికీ అమలు చేయాలంటే ప్రభుత్వానికి దాదాపుగా రూ. 1.20 లక్షల కోట్లు ఖర్చవుతుందని ముఖ్యమంత్రే ప్రకటించారు. నాలుగైదేళ్ళలో బడ్జెట్ సర్దుబాటు చేసి అమలు చేస్తామన్నారు.
దశలవారీగా అమలుచేయాలనుకున్న ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో మాత్రం పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఒకేసారి మొత్తం 20,929 కుటుంబాలకు అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించడం మిగిలిన నియోజకవర్గాల్లో వ్యతిరేకతకు కారణమైంది. ఏక కాలంలో రాష్ట్రమంతా అమలుచేయడానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్‌ను సమకూర్చుకోలేక, అసంతృప్తికి గురైన దళిత కుటుంబాలకు సర్దిచెప్పలేక ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ వరకు రానున్న కాలంలో అగ్నిపరీక్షను ఎదుర్కోనున్నారు. మరోవైపు విపక్షాల నేతలు ఇప్పటి నుంచే రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందించాల్సిందేనని ఒత్తిడిచేసే విధంగా బలమైన గొంతుకనే వినిపిస్తున్నారు. ఇదిలా ఉండగా స్వయంగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఈ పథకాన్ని సింహం మీద స్వారీలా అభివర్ణించారు.