ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. అందుకేనా?

by Sridhar Babu |
ఐపీఎస్‌ అధికారుల బదిలీ.. అందుకేనా?
X

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ కమిషనరేట్‌లో ఎస్బీ విభాగం జాయింట్ సీపీగా పనిచేస్తున్న డాక్టర్ తరుణ్ జోషి (2004) వరంగల్ సీపీగా బదిలీ అయ్యారు. సీఐడీ ఐజీ పోస్టులో కొనసాగుతూ కరీంనగర్ డీఐజీగా, ప్రస్తుతం వరంగల్ ఇంచార్జ్ సీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న పి.ప్రమోద్ కుమార్ (2001)ను వరంగల్ సీపీ స్థానం నుంచి తప్పించారు. ఇకనుంచి ప్రమోద్ కుమార్ సీఐడీ ఐజీతో పాటు కరీంనగర్ డీఐజీగా కొనసాగనున్నారు.

ఇదిలా ఉండగా, ఖమ్మం సీపీగా కొనసాగుతున్న తఫ్సీర్ ఇక్బాల్ (2008) ను ఆదిలాబాద్ ఎస్పీగా, ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్ (2013) ను ఖమ్మం సీపీగా బదిలీ చేశారు. ఈ బదిలీలలో 2013 బ్యాచ్ కు చెందిన విష్ణువారియర్ అందరికంటే జూనియర్ అయినప్పటికీ ఖమ్మం సీపీగా నియామకం చేయడం గమనార్హం. త్వరలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే బదిలీలు చేసినట్లు తెలిసింది.

Advertisement

Next Story