33 కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన రైలు.. తప్పిన భారీ ముప్పు

by Shamantha N |   ( Updated:2021-03-17 23:11:39.0  )
Train Rolls Backwards
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రగతి రథ చక్రాలు వెనక్కి పరుగులు తీశాయి. ముందుకు వెళ్లాల్సిన రైలు అనుకోని ఘటనతో వెనక్కి వెళ్లింది. ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 33 కిలోమీటర్ల పాటు వెనక్కి ప్రయాణించింది. ఆ సమయంలో ట్రాక్‌పై ఇతర రైళ్లు, జనాలు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగిందంటే..

ఢిల్లీ నుంచి తనక్‌పూర్‌కు వెళ్లాల్సిన పూర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు కొంతదూరం వెనక్కి ప్రయాణించింది. ఉత్తరాఖండ్ బోర్డర్ లోకి ఎంటర్ అయిన తర్వాత బన్‌బసా సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక జంతువు రైలుకు అడ్డుగా వచ్చింది. ఇది గమనించిన డ్రైవర్ ఫాస్ట్‌గా దూసుకుపోతున్న ఆ రైలుకు సడెన్ బ్రేక్ వేశాడు. అంతే.. వాయువేగంతో ముందుకు దూసుకుపోతున్న ఆ రైలు ఒక్కసారిగా వెనకకు ప్రయాణించడం ప్రారంభించింది. అదే సమయంలో రైలులో సాంకేతిక సమస్య కూడా తలెత్తడంతో దానిని అదుపు చేయడం డ్రైవర్‌కు సాధ్యం కాలేదు. దీంతో ఒక్కటి కాదు, రెండు కాదు.. ఏకంగా 33 కిలోమీటర్ల దాకా వెనక్కి ప్రయాణించింది.

రైలు వెనక్కి వెళ్తున్న సమయంలో ట్రాక్ మీద వేరే రైళ్లేవి రాకపోవడం.. జనాల సంచారం కూడా లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. 33 కిలోమీటర్ల మేర వెనక్కి వచ్చిన ఆ రైలు చివరికి ఖటిమ అనే ఊళ్లో ఆగింది. రైలులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు ఈశాన్య రైల్వే అధికారులు చెప్పారు. రైలు ఆగిన తర్వాత వారందరినీ బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపించినట్టు వివరించారు. ఈ ఘటనకు లోకోపైలెట్, గార్డ్‌ను బాధ్యులుగా చేస్తూ వారిద్దరినీ సస్పెండ్ చేసినట్టు వారు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed