హత్య కేసులో రైలు ఇంజిన్ అరెస్ట్

by  |   ( Updated:2020-10-21 03:55:30.0  )
హత్య కేసులో రైలు ఇంజిన్ అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్: ఓ హత్య కేసులో రైలు ఇంజిన్‎ను అరెస్ట్ చేసి సీజ్ చేశారు అధికారులు. ఇలాంటి ఘటన భారతీయ రైల్వే చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ జరిగి ఉండదు. రైలు ఇంజిన్ హత్య చేయడమేంటీ అని అశ్చర్యపోయే ఘటన అస్సాం రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ కేసుపై డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్ సోమవారం గౌహతిలోని బాముని మైదాన్ రైల్వే యార్డుకు వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాల్ని సీజ్ చేసినట్లుగా ఫారెస్ట్ అధికారులు లోకోమోటివ్ (రైలు ఇంజిన్)ను సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 27వ తేదీన లండింగ్ డివిజన్ ఫారెస్ట్ పరిధిలో గూడ్స్ రైలు వెళ్తుండగా ఓ ఏనుగు, దాని పిల్లలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు అక్కడికక్కడే చనిపోగా.. పిల్ల ఏనుగును కిలోమీటర్ వరకు ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో రైలు పైలట్, కోపైలట్ ఇద్దరినీ రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.

వన్య ప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏనుగు అనేది షెడ్యూల్ 1లో ఉన్న వన్యప్రాణి. రిజర్వ్ ఫారెస్టులో వెళ్లేటప్పుడు రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలడంతో ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు రాజీవ్ దాస్ తెలిపారు. పోలీసులు నేరాలు జరిగిన సందర్భంగా ఆయా ఆయుధాలను ఎలాగైతే సీజ్ చేస్తారో అలాగే తాము రైలు ఇంజిన్‎ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనతో రైలు ఇంజిన్‎కి కూడా సంబంధం ఉందని దాస్ వెల్లడించారు.

దీనిపై ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుభనన్ చంద్ర స్పందిస్తూ.. అరెస్ట్ అయిన ఆ ఇంజిన్‌ని రిలీజ్ చేయించామని తెలిపారు. కానీ, రైళ్లు ఓవర్ స్పీడ్‎తో వెళ్తున్నాయన్నది నిజమని స్పష్టం చేశారు. రైలు ఇంజన్ ని సీజ్ చేయటమంటే దాన్ని ఫారెస్ట్ అధికారులు తమతో పట్టుకెళ్లడం కాదనీ.. దాన్ని వర్క్ చేయకుండా సీజ్ చేశారనీ తెలిపారు. ఇంజిన్‎ను సీజ్ చేసినట్లుగా రిపోర్టులో రాయడంతో దాన్ని తాము వాడే ఛాన్స్ ఉండదన్నారు. అయితే తాము దానిని విడిపించామని.. ఇప్పుడు మళ్లీ దాన్ని తిరిగి వినియోగిస్తున్నామని వెల్లడించారు.

కాగా, 2019లో అస్సాంలో రైళ్లు ఢీకొని 80 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. అలాగే 100 మంది మనుషులు కూడా మృతి చెందారు. ఈ క్రమంలో రైల్వే అధికారులు అస్సాంలో తిరిగే రైళ్ల వేగాన్ని తగ్గించడం ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed