వరంగల్ మార్కెట్‌లో టెన్షన్ టెన్షన్.. అధికారులపై మండిపడుతున్న వ్యాపారులు

by Shyam |   ( Updated:2021-11-01 00:49:12.0  )
వరంగల్ మార్కెట్‌లో టెన్షన్ టెన్షన్.. అధికారులపై మండిపడుతున్న వ్యాపారులు
X

దిశ‌, కాశీబుగ్గ : ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ అట్టుడుకుతోంది. కొనుగోళ్లను బ‌హిష్కరించిన వ్యాపారులు సోమ‌వారం ప‌రిపాల‌న భ‌వ‌నం ఎదుట ధ‌ర్నాకు దిగారు. అడ్తిదారుల‌కు చెల్లించాల్సిన రూ.10కోట్లను నాగేంద్ర ట్రేడింగ్ కంపెనీ యాజ‌మాన్యం ఇవ్వకుండా ప‌రారైంద‌ని ఆరోపించారు. నెల‌రోజులుగా తాము చేస్తున్న పోరాటాన్ని క‌లెక్టర్ గాని, పోలీసులు గాని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ చైర్మన్ ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు కస్టడీలో ఉన్న నాగేంద్ర అండ్ కంపెనీ యజమానిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పగించకుండా ఎందుకు ఆల‌స్యం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. త‌మ‌కు అప్పగిస్తే బాధితులంద‌రికీ న్యాయం చేసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. వ్యాపారులు తీవ్రంగా న‌ష్టపోయే అవ‌కాశం ఉన్నా ఈ కేసును నీరుగార్చే ప్రయ‌త్నం తెర‌వెనుక జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుప‌డ‌దని ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సార్లు చెప్పార‌ని, అలాగే వ్యాపారి బాగుంటే ప్రభుత్వాల‌కు ప‌న్నుల రాబ‌డి పెరిగి స‌మాజ సంక్షేమం సాధ్యమ‌వుతుంద‌ని గుర్తు చేశారు. మోస‌గాళ్లను ర‌క్షించే ప్రయ‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. వ్యాపారుల‌పై క‌క్ష‌గ‌ట్టి వారిని మార్కెట్‌లో లేకుండా చేస్తామ‌ని అనుకుంటే సాధ్యం కాద‌ని అన్నారు. వ్యాపారుల‌ను మోసం చేయాలని చెబుతున్నది ఎవ‌రో అర్థం కావ‌డం లేదంటూ న‌ర్మగ‌ర్భంగా మాట్లాడారు. మార్కెట్ అధికారులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. వ్యాపారులు లేకుండా అధికారులు వ్యాపారం నిర్వహించ‌గ‌ల‌రా..? మార్కెట్ నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేప‌ట్టగ‌ల‌రా..? అంటూ సూటిగా ప్రశ్నించారు. రైతులు, వ్యాపారులు ప‌చ్చగా ఉంటేనే మిగ‌తా వ‌ర్గాలు కూడా బాగుంటార‌ని అన్నారు. గ‌తంలో కూడా అనేక మంది ఖ‌రీద్దారులు మోసం చేశార‌ని, అయితే వారిపై దాడులు చేసిన చరిత్రగాని, బ‌ల‌వంతంగా వ‌సూళ్లు చేసిన చ‌రిత్ర మార్కెట్ చ‌రిత్రలో లేద‌ని ఉద్ఘాటించారు. ఇదిలా ఉండ‌గా ఆందోళ‌న విష‌యం తెలుసుకున్న పోలీసులు మార్కెట్‌కు చేరుకుని ఆందోళ‌న‌కారుల‌ను శాంతిప‌జేశారు. వ్యాపారుల‌తో మార్కెట్ అధికారులు స‌మావేశం ఏర్పాటు చేయ‌డానికి అంగీక‌రించ‌డంతో ప్రస్తుతం చ‌ర్చలు జ‌రుగుతున్నాయి.

Advertisement

Next Story