ఆ చట్టాలతో రైతులకు నష్టం : ఉత్తమ్

by Shyam |
ఆ చట్టాలతో రైతులకు నష్టం : ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్ :

కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ తరుణంలో దేశ ప్రజలంతా రైతుల తరఫున గళం విప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.

రైతులకు నష్టం కలిగిస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ సహించదన్నారు. రైతుల పక్షాన అందరం నిలవాలని పిలుపునిచ్చారు. బడా కంపెనీలకు లాభం చేస్తూ, రైతులకు నష్టం కలిగించేలా కేంద్రం చేసిన చట్టాలున్నాయన్నారు. ఇందులో ఎక్కడ కూడా కనీస మద్దతు ధర ప్రస్తావన లేదని చెప్పారు. అలాగే మద్దతు ధరను కొనసాగిస్తామని చట్టంలో పొందుపర్చలేదన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా రైతుల పక్షాన నిలబడి పోరాడాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టుచేశారు.

కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై అనేక పార్టీలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో, తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు నిచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యకలాపాలు చేపడుతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ సైతం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story