కరోనా టెస్టుల సంఖ్య పెంచాలి : ఉత్తమ్

by vinod kumar |
కరోనా టెస్టుల సంఖ్య పెంచాలి : ఉత్తమ్
X

దిశ, న్యూస్ బ్యూరో: ప్రభుత్వం కరోనా టెస్టులు చేయడంతో జాప్యం వహిస్తోందని, రాష్ట్రంలో లక్షకు కేవలం 37 మందికే పరీక్షలు జరుగుతున్నాయని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. కరోనా వైరస్ నియంత్రణపై ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్ నాయకులు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సోమవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్.సీ కుంతియాతో కలిసి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జిలు, ముఖ్య నాయకులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆపత్కాల సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. లాక్‌డౌన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం ద్వారా తెలియజేయాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పినట్టు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షల సంఖ్యను పెంచితేనే వాస్తవాలు బయటికి వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టెస్టుల విషయంలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయ్నతం చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రంలో రేషన్ కార్డులు లేని నిరుపేదలకు కూడా ఉచిత బియ్యం, ఆర్థిక సాయం అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో దఫా ఇస్తామంటున్న బియ్యం, రూ.1500 వెంటనే అందించాలని కోరారు. విదేశాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్లొన్నారు.

Tags : Uttam Kumar Reddy, AICC Principal secretary, Video conference, Corona Tests

Advertisement

Next Story