- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐసీసీ పీఠం దక్కేదెవరికో?
దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎన్నిక వేదికగా క్రికెట్ రాజకీయం వేడెక్కుతోంది. బీసీసీఐ, ఈసీబీ మధ్య పోటీ నువ్వా-నేనా అన్నట్టుగా ఉంది. పట్టు నిలుపుకోవాలని బీసీసీఐ భావిస్తుండగా, తమ అభ్యర్థినే గెలిపించుకోవాలని ఈబీసీ తహతహలాడుతోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూఐ, ఈబీసీ రుణ డీల్‌ను ఐసీసీ ఎథిక్స్ కమిటీ రద్దు చేయడంతో కొత్త విమర్శలకు ఊతమిచ్చినట్లయింది. ఇది లంచంతో సమానమని బీసీసీఐ వాదిస్తుండగా, కొలిన్ గ్రీవ్స్ బలమైన అభ్యర్థి కావడంతోనే విమర్శలు చేస్తున్నారని ఈబీసీ అంటోంది.
ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీకాలం జూలైతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ కొలిన్ గ్రీవ్స్ చైర్మన్ పదవి చేపట్టడం ఖాయమని అందరూ భావించారు. కాగా, ఐసీసీలో పట్టు నిలుపుకోవడానికి సౌరవ్ గంగూలీని ఎన్నికల బరిలో నిలపాలని బీసీసీఐ భావిస్తోంది. మంగళవారం నుంచి మూడ్రోజులపాటు జరిగే ఐసీసీ వీడియో కాన్ఫరెన్స్‌లో నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. అయితే, అకస్మాతుగా ఒక డీల్ తెరపైకి వచ్చింది. ఇటీవల క్రికెట్ వెస్టిండీస్‌కు కొంత మొత్తం రుణం ఇవ్వాలని ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కానీ, ఇందుకు ఐసీసీ ఎథిక్స్ అధికారి నిరాకరించారు. ఐసీసీ ఎన్నికల సమయంలో ఒక క్రికెట్ బోర్డుకు మరో బోర్డు రుణం ఇవ్వరాదని ఆయన పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని ఇతర క్రికెట్ బోర్డులు తమ విమర్శనాస్త్రాలుగా మలచుకుంటున్నాయి. ఈసీబీ చైర్మన్ కొలిన్ గ్రీవ్స్ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవడానికే సీడబ్ల్యూఐకు రుణం ఇస్తున్నాడని, ఇది ఒక రకంగా లంచమేనని వాదిస్తున్నాయి. ఇదంతా శశాంక్ మనోహర్ కనుసన్నల్లో జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో రుణం ఇవ్వడమేంటని బీసీసీఐ కూడా వాదిస్తోంది. చైర్మన్ ఎన్నికను డబ్బుతో ప్రభావితం చేయాలని ఈసీబీ భావిస్తోందని ఆరోపించింది. ఈడీల్ సక్రమంగా లేనందునే ఏప్రిల్ 30న ఐసీసీ జనరల్ కౌన్సిల్ ఈ విషయాన్ని ఎథిక్స్ అధికారి ముందుకు తీసుకొచ్చింది. ఆయన వెంటనే ఈ డీల్ రద్దు చేశారు. కాగా, ఐసీసీ చైర్మన్ ఎన్నికకు ఈ డీల్‌కు సంబంధం ఉందని మాత్రం బయటకు వెల్లడించలేదు. ఐసీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఈ డీల్ జరగడంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి.
అనుకూలంగా మార్చుకుంటున్న బీసీసీఐ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో తెరపైకి వచ్చిన ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా బీసీసీఐ మలచుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో అన్ని క్రికెట్ బోర్డులు నష్టాల్లో ఉన్న మాట వాస్తవమే. అయినా ఎన్నికల్లో తటస్థంగా ఉన్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకే ఎందుకు రుణం ఇస్తోందని వాదిస్తోంది. కాగా, ఈ రుణానికి, ఎన్నికకు సంబంధం ఉండకపోవచ్చు. అయితే, డీల్ జరిగిన సమయమే ప్రస్తుత ఆరోపణలకు కారణమైందని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. తన అభ్యర్థిని ఈసీబీ గెలిపించుకోవాలని భావించడంలో తప్పులేదు. కానీ, ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడటం మంచిది కాదని విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ పదవికి కొలిన్ గ్రీవ్స్ బలమైన అభ్యర్థి కావడం వల్లే విమర్శలు చేస్తున్నారని ఈసీబీ అంటోంది. ఈ సమయంలో ఐసీసీ, ఈసీబీ కూడా పారదర్శకంగా వ్యవహరించాలని, ఇలాంటి ఆర్థిక వ్యవహారాలు తప్పుడు సమాచారాన్ని పంపుతాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
దక్షిణాఫ్రికా వెనకడుగు
ఐసీసీ చైర్మన్ పదవికి సౌరవ్ గంగూలీనే సరైన అభ్యర్థని క్రికెట్ సౌత్ ఆఫ్రికా(సీఎస్ఏ) డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రకటించిన గంటల్లోనే ఆ దేశ బోర్డు వెనకడుగు వేసింది. గత కొన్ని రోజులుగా బయటకు కనిపించని సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్ నెంజ్యానీ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. ఐసీసీ ప్రోటోకాల్స్‌ను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి క్రికెట్ బోర్డుపైన ఉందని, గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలు వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఐసీసీ ఎన్నికల్లో సీఎస్ఏ అధ్యక్షుడు క్రిస్‌కే ఓటు హక్కు ఉండటం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆ ఓటు గంగూలీకి పడుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. తెర వెనక అందరి మద్దతు కూడగట్టిన తర్వాతే ఐసీసీ చైర్మన్ రేసులో గంగూలీని నిలబెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఇంతవరకు తమ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించలేదు. మూడు రోజుల సమావేశాల్లో అభ్యర్థులు ఎవరనే విషయం తేలనుంది.