రెండువేలు దాటిన కరోనా కేసులు

by  |
రెండువేలు దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వేలు దాటింది. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం మొత్తం 2069 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 51 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈ ఒక్క రోజే దేశమంతా 235 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 156 మంది డిశ్చార్జి కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 1860. కానీ, రాష్ట్రాల లెక్కలకు, ఈ లెక్కలకు పొంతన కుదరడంలేదు. మృతుల సంఖ్య 52కు చేరుకుంది. తెలంగాణలో గురువారం 27, ఆంధ్రప్రదేశ్‌లో 32 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ వివరాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 154, ఆంధ్రప్రదేశ్‌లో 143 చొప్పున ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 17 మంది డిశ్చార్జికాగా తొమ్మిది మంది మరణించారు. ప్రస్తుతం 128 యాక్టివ్ పాటిజివ్ పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం నమోదైన కొత్త కేసుల్లో ఏ జిల్లాలవారు ఎంతమంది ఉన్నారనే వివరాలను ప్రభుత్వం ఇవ్వలేదు. కానీ, జిల్లాల కలెక్టర్లు చెప్తున్న వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, ములుగు జిల్లాలో ఇద్దరు, అనధికారికంగా ప్రభుత్వ అధికారుల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం నల్లగొండ జిల్లాలో ఆరుగురు.. ఇలా దాదాపు 30కు పైగానే ఉన్నాయి.

పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 32 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 143కు చేరుకుంది. ఇంకా అనుమానితుల నుంచి సేకరించిన 409 శాంపిళ్ళ రిపోర్టులు రావాల్సి ఉంది.

Tags : Telangana, Corona, Positive Cases, Deaths, Andhra Pradesh, India

Next Story

Most Viewed