తెలుగు ‘టాప్ 10 -2020’ సాంగ్స్

by Anukaran |   ( Updated:2020-12-05 05:06:28.0  )
తెలుగు ‘టాప్ 10 -2020’ సాంగ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 సినిమా ఇండస్ట్రీకి అంతగా కలిసి రాలేదు. ఏడాది ప్రారంభంలో రిలీజైన ‘అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు, భీష్మ’ లాంటి చిత్రాల ద్వారా కళకళలాడిన ఇండస్ట్రీ.. అదే ఊపు కొనసాగిస్తుందని అనుకున్నా.. కరోనా ఆ ఆశలకు బ్రేక్ వేసింది. దీంతో కరోనాకు ముందు రిలీజైన సినిమాలు, ఆల్బమ్స్‌నే ఇప్పటి వరకు ఎంజాయ్ చేయాల్సి వచ్చింది. కానీ ఉన్న ఆల్బమ్స్ బెస్ట్‌గా ఉండటంతో ప్రేక్షకులపై ఎక్కువ ప్రభావం చూపించగలిగాయి. ముఖ్యంగా ఎస్.ఎస్. థమన్ మ్యూజికల్ ‘అల వైకుంఠపురంలో’ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ హృదయాలను గెలవగా, 2020 తెలుగు టాప్ టెన్ బెస్ట్ సాంగ్స్‌లో మూడు పాటలు కూడా ఇదే ఆల్బమ్ నుంచి ఉండటం విశేషం.

బుట్టబొమ్మ – రాములో రాములా..

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజిక్.. ఇప్పటికీ రికార్డ్‌లు సెట్ చేస్తూనే ఉంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్‌కు బెంచ్ మార్క్‌గా నిలిచిన ఈ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్.. యూట్యూబ్ తెలుగు 2020 సాంగ్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో నిలవగా, అదే సినిమాలోని ఫోక్ అండ్ మాస్ సాంగ్ రాములో రాములా రెండో స్థానంలో నిలవడం విశేషం.

నీలి నీలి ఆకాశం..

ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా రాబోతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. ఈ సినిమా నుంచి వచ్చిన సూపర్ మెలోడి సాంగ్ ‘నీలి నీలి ఆకాశం’ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. అమృతా అయ్యర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న సినిమాకు మున్నా డైరెక్టర్ కాగా.. అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది.

నీ కన్ను నీలి సముద్రం..

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఉప్పెన’. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో ‘నీ కన్ను నీలి సముద్రం పాట’ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తూ నాలుగో స్థానంలో నిలిచింది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

సామజవరగమన..

ఇక రిలాక్స్ అయ్యేందుకు ఎంచుకున్న పాటల్లో ‘అల వైకుంఠపురంలో’ నుంచి మరో పాటకు ఓటేస్తూ సామజవరగమనకు ఐదో స్థానం కట్టబెట్టారు. పీస్ ఫుల్ అండ్ మెలోడి సాంగ్ సామజవరగమన అధిక వ్యూస్‌తో దూసుకుపోతూ మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉండగా.. 2021లోనూ అల ఆల్బమ్ మ్యాజిక్ కంటిన్యూ అయ్యేలా ఉంది.

వాట్టే వాట్టే.. వాట్టే బ్యూటీ..

నితిన్‌ను మళ్లీ హిట్ ట్రాక్‌లోకి తెచ్చిన ‘భీష్మ’ 2020 సాంగ్ లిస్ట్‌లో ఆరో స్థానంలో ఉంది. మహతీ స్వరసాగర్ సంగీతం అందించిన చిత్రంలో ‘వాట్టే.. వాట్టే.. వాట్టే బ్యూటీ’ సాంగ్ డిఫరెంట్ కంపోజింగ్‌తో మాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. జానీ మాస్టర్ కంపోజింగ్‌ యూనిక్ వేలో ఉండగా.. రష్మిక మందన డ్యాన్స్ మూమెంట్స్ ఫేవరెట్ అయిపోయాయి.

నాదీ నక్కిలీసు గొలుసు..

‘పలాస 1978’ సినిమా నుంచి వచ్చిన నాదీ నక్కిలీసు గొలుసు పాట 2020లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోక్ సాంగ్‌గా నిలిచింది. రఘు కుంచె సంగీతం సమకూర్చిన ఈ పాట, సినిమా కన్నా ఢీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. కంటెస్టెంట్ పండు ఈ సాంగ్‌పై చేసిన పర్‌ఫార్మెన్స్ ఊర మాస్‌గా ఉండగా.. ఆ తర్వాత పాటకు ఆదరణ ఎక్కువైపోయింది. దీంతో జోష్‌ఫుల్‌గా సాగే పాట ఏడో స్థానాన్ని దక్కించుకుంది.

లైఫ్ ఆఫ్ రామ్..

సమంత, శర్వానంద్ నటించిన తమిళ్ ఫిల్మ్ ‘96’ రీమేక్‌ ‘జాను’ చిత్రంలోని ‘లైఫ్ ఆఫ్ రామ్’ సాంగ్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ పాటకు అంతగా పాపులరయ్యేందుకు కూడా బుల్లితెరనే హెల్ప్ చేసింది. జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప ప్రోగ్రామ్‌లో కంటెస్టెంట్ యశ్వంత్ ఈ పాట పాడటం.. జనాలకు నచ్చడం.. ఆ తర్వాత అందరి ఫేవరెట్ అయిపోవడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది ప్లే లిస్ట్‌లో ఈ మెలోడీ సాంగ్ కంటిన్యూ అవుతోంది.

ఉండిపోవా నువ్విలా..

నందు, ప్రియాంక హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం ‘సవారి’. చిన్న చిత్రంగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సినిమా సక్సెస్‌లో మ్యూజిక్ కూడా భాగం కాగా.. ‘ఉండిపోవా నువ్విలా’ పాటకు చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకు చాలా ప్లస్ కాగా.. ఉండిపోవా నువ్విలా పాట 2020లో తొమ్మిదో స్థానం కొట్టేసింది.

కరాబు మైండ్ కరాబు..

తెలుగు 2020 టాప్ సాంగ్స్ లిస్ట్‌లో కన్నడ డబ్బింగ్ సాంగ్ చేరడం మరో ప్రత్యేకత. రష్మిక మందన ఇందులో హీరోయిన్ కాగా తన కోసమే సాంగ్ చూసిన, విన్న వారి సంఖ్య చాలా ఉంది. పొగరు టైటిల్‌తో వస్తున్న సినిమాలో లేట్ చిరంజీవి సర్జా సోదరుడు ధృవ్ సర్జా హీరో. చంద్రన్ శెట్టి సంగీతం సమకూర్చిన పాట వివాదం వల్లే పాపులర్ అయింది.

Advertisement

Next Story

Most Viewed