2021లో ఒలింపిక్స్ జరిగి తీరుతాయి : నరీందర్ బత్రా

by vinod kumar |
2021లో ఒలింపిక్స్ జరిగి తీరుతాయి : నరీందర్ బత్రా
X

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా ఈ ఏడాది జులైలో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2020ని వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనాకు వ్యాక్సిన్ తయారు కాకపోవడం, పలు దేశాల్లో రోజు రోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో వచ్చే ఏడాది అయినా ఒలింపిక్స్ జరగడం అనుమానమే అనే వార్తలు వచ్చాయి. ఏకంగా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ అధ్యక్షుడు సైతం.. వైరస్ ఇలాగే కొనసాగితే ఒలింపిక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడు, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బత్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరగడం ఖాయమని ఆయన వెల్లడించారు. శనివారం భారత అథ్లెటిక్ సమాఖ్య ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. టోక్యోలోని నిర్వహణ కమిటీ ముఖ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. వాళ్లెవరూ ఒలింపిక్స్ రద్దవుతాయని చెప్పలేదని అన్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో కరోనాకు పరిష్కారం లభిస్తుందని పరిశోధకులు కూడా చెబుతున్నందున ఒలింపిక్స్ తప్పకుండా జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మన దేశ క్రీడాకారులు, అథ్లెట్లు ఒలింపిక్స్ కోసం సిద్ధపడాలని.. రద్దవుతాయనే ఆలోచనను మైండ్ నుంచి తీసివేయాలన్నారు. అంతేకాకుండా అన్ని క్రీడా సంఘాలు ఒలింపిక్స్ ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఐవోసీ సభ్యుడు జాన్ కోట్స్ సైతం.. వ్యాక్సిన్ కనిపెడితేనే ఒలింపిక్స్ జరుగుతాయన్న వ్యాఖ్యలు హస్యాస్పదమని.. అవన్నీ నిరాధార వార్తలని కొట్టిపారేశారు.

Tags: Coronavirus, Olympics, Tokyo 2020, Narinder Batra, IOC, IOA

Advertisement

Next Story

Most Viewed