నేడు ఓయూ వేదికగా కదం తొక్కనున్న నిరుద్యోగులు

by Shyam |   ( Updated:2021-09-11 12:02:28.0  )
Job Kay Run
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడంతో నిత్యం నిరుద్యోగులు ఆత్మబలిదాలు చేసుకుంటున్నారు. ఈ అంశంపై అటు ప్రతిపక్షాల నుంచే కాకుండా ఇటు నిరుద్యోగులు, విద్యార్థుల్లో కూడా రోజురోజుకూ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సర్కార్ పై పోరాడేందుకు ఉస్మానియా విద్యార్థులు సిద్ధమయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలే ధ్యేయంగా ఎందరో విద్యార్థుల ఆత్మబలిదానాలు చేసుకుంటే రాష్ట్రం సిద్ధించింది. అలాంటిది తెలంగాణ ఏర్పడ్డాక విద్యార్థుల కోసం ప్రభుత్వం ఏమీ చేపట్టకపోవడం, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేపట్టకపోవడంతో ప్రభుత్వంపై పోరాటానికి విద్యార్థి లోకం ఏకం కానుంది. ఇందుకు ఉస్మానియా క్యాంపస్ వేదిక కానుంది.

ఆదివారం సాయంత్రం 4 గంటలకు ‘జాబ్ కే రన్’ అనే కార్యక్రమాన్ని ఓయూ విద్యార్థి నాయకులు నిర్వహించనున్నారు. ఈ రన్‌ను ఉద్యమరూపంగా మలిచేందుకు వారు ప్రణాళికలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టుల భర్తీ చేయడంతో పాటు యూపీఎస్సీ తరహాలో జాబ్ క్యాలెండర్ ఇయర్‌ను ప్రవేశపెట్టాలనే డిమాండ్‌తో ఈ ‘జాబ్ కే రన్’ ను నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లే ధ్యేయంగా మొన్నటి వరకు సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని ఉధృతం చేసిన విద్యార్థి నాయకులు ఇక ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమయ్యారు. మరికొద్ది రోజుల్లో రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని ఇటీవల విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించిన విషయం విధితమే. తాజాగా ‘జాబ్ కే రన్’ ను ఆదివారం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఈ రన్‌లో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల విద్యార్థులు, నిరుద్యోగులు పాలుపంచుకోనున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అనుబంధ విభాగం టీఆర్ఎస్‌వీ మినహా అన్ని విద్యార్థి సంఘాలను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ కార్యక్రమానికి పలువురు వక్తలను సైతం ఓయూ విద్యార్థి సంఘం నేతలు ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పాల్గొననున్నారు. అతిథులుగా ఎల్ హెచ్ పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్, ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ కత్తి వెంకటస్వామి హాజరుకానున్నారు. ఈ రన్ ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్‌సీసీ గేట్ వరకు జరుగుతుందని ఓయూ విద్యార్థి నాయకులు బుర్ర రవితేజ గౌడ్, తేజావత్ వెంకట్ నాయక్ తెలిపారు.

Advertisement

Next Story