నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం

by Shyam |   ( Updated:2020-10-21 20:44:03.0  )
నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: వారం రోజులుగా హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఐదుగురు నిపుణుల కమిటీ గురువారం నుంచి వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. వర్షాలు, వరదల ద్వారా సుమారు రూ. ఐదు వేల కోట్ల మేర నష్టం జరిగిందని, తక్షణ సాయంగా రూ. 1,350 కోట్లను విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు లేఖను కూడా పంపారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యులతో కూడిన బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలన కోసం తెలంగాణకు పంపుతోంది. గురువారం ఈ బృందం తొలుత హైదరాబాద్‌లోని వివిధ కాలనీలను సందర్శించనుంది. కేంద్ర హోం సహాయ మంత్రి కూడా నగరంలో అదే సమయంలో పర్యటించనున్నారు.

కేంద్రం నుంచి వచ్చే బృందం నగరంలోనూ, శివారు ప్రాంతాల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని అంచనా వేయనుంది. పొరుగు జిల్లాల్లో జరిగిన పంట నష్టాన్ని కూడా అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను కేంద్ర హోం మంత్రి నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సమీక్షించి తగిన నష్టపరిహారాన్ని రాష్ట్రానికి విడుదల చేస్తుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు 60 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని, ఇంకా సుమారు 750 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయాల్సి ఉన్నదని మంత్రి కేటీఆర్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు తలా రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 550 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

రాష్ట్రానికి రీయింబర్స్ చేస్తాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న విపత్తుల నిధి నుంచి తాత్కాలికంగా నిధులు ఖర్చు పెట్టాలని, కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత రీయింబర్స్‌ చేస్తుందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రకారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుందని గుర్తుచేశారు. ఈ బృందం రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేస్తుందని, మృతులకు తలా రూ. 4 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పరిహారాన్ని చెల్లించేలా గతంలోనే కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి సాయం అందేలోపు ఎస్‌డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) నిధి నుంచి ఖర్చు చేయవచ్చని వివరించారు.

Advertisement

Next Story