ఇంద్రవెల్లి ఘటనకు నేటికి 40 ఏళ్లు

by Anukaran |
Indravelli
X

అడవి ఎరుపెక్కిన రోజుకు సాక్షి.. నెత్తురు ఇంకిన నేలకు సాక్ష్యం.. సర్కార్ దాష్టీకానికి నిలువెత్తు నిదర్శనం.. ఇంద్రవెల్లి స్థూపం. స్థూపం వెనుక అడవిబిడ్డల త్యాగాలున్నాయి. దోపిడీ, పీడనపై తిరుగుబాటుంది. ఆంక్షల సంకెళ్లు తెంచుకున్న పోరాటముంది. న్యాయం కోసం ఆరాటం దాగుంది.
– దిశ,ఉట్నూర్

నాడు ఏం జరిగిందంటే..

సరిగ్గా 40 ఏళ్ల క్రితం. ఇదే రోజు. అంటే 1981, ఏప్రిల్ 20. ఇంద్రవెల్లి రుదిర క్షేత్రమైన దినం. అమాయక ఆదివాసీ గిరిజనుల గుండెలను తూటాలు చీల్చిన చీకటి రోజు. తాము పోడు చేసిన నేలకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి సభకు పిలుపునిచ్చింది. మొదట సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. గిరిజనుల నుంచి వస్తున్న స్పందన చూసి సభపై నిషేధం విధించారు పోలీసులు. ఈ విషయం తెలియన అడవి బిడ్డలు.. కొండలు, గుట్టలు, వాగులు, వంకలు దాటుకొని ప్రవాహంలా ఇంద్రవెళ్లి తొవ్వ తొక్కారు. అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లో దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన గిరిజనులపై తూటాల వర్షం కురిపించారు పోలీసులు. అంతే పచ్చటి అడవి నెత్తురి చిమ్మింది. పారిన నెత్తురుకు, పగిలిన తలలకు లెక్కలేదు. చెట్టుకొకరు, పుట్టకొకరుగా అడవి బిడ్డలు పారిపోయారు. వెంటాడి మరీ కాల్చిచంపాయి పోలీస్ బలగాలు.

అప్పుడు కూడా తప్పుడు లెక్కలే..

దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించిన ఇంద్రవెల్లి కాల్పుల్లో 13 మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వాధికారులు తేల్చారు. పీయుడీఆర్ నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ 60 మంది చనిపోయినట్లు గుర్తించింది. వందల మందికి గాయాలయ్యాయి. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజాసంఘాల ఒత్తిళ్లు, గిరిజనుల పోరాటం ఫలితంగా 1987లో ఐటీడీఏ నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు. ప్రతి ఏటా ఆదివాసీ గిరిపుత్రులు అమరులను యాదిచేసుకుంటూనే ఉన్నారు.

నెత్తురు చిందినా.. తొలగని చీకట్లు

ఇంద్రవెల్లి గతం కాదు. నెత్తటి జ్ఞాపకం. ఏడాదికోసారి యాది చేసుకుంటే సరిపోదు. ఏ ఆశయం కోసం నాడు ఆదివాసీ గిరిజనులు అసువులు బాసారో వాటి ఆశయాలు ఇంకా నెరవేరలేదు. అభివృద్ధి పేరుతో ఆదివాసీ సంస్కృతిని ధ్వంసం చేసే కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఓట్ల జాతరలో హామీల వర్షం కురిపించే నాయకులు అడవి బిడ్డలపై మొసలి కన్నీరు కార్చుతున్నారు. ఏళ్లు గడిచినా ప్రభుత్వాలు, పాలకులు మారినా వీరి బతుకుల్లో వెలుగుల్లేవు. ఈ చీకట్లు పోయి వెలుగులు వచ్చినప్పుడే ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల త్యాగాలకు నిజమైన నివాళి దక్కినట్లు.

Advertisement

Next Story

Most Viewed