- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్‌లో ‘జనతా కర్ఫ్యూ’ ఈ రోజే.. గుర్తుందా..!
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా కేంద్రప్రభుత్వం విధించిన ఒక రోజు ‘జనతా కర్ఫ్యూ’కు నేటి (మార్చి 22)కి సరిగ్గా ఏడాది. అప్పటికి దేశంలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 364. నలుగురు కరోనాతోనే చనిపోయారు. వైరస్‌ను కట్టడి చేయకుంటే ఉపద్రవం తప్పదంటూ మార్చి 22న ఉదయం 7గంటల మొదలు రాత్రి 9గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. ఇళ్లలోనుంచి బయటకు రావొద్దని పిలుపునిచ్చారు. ఆయన పిలుపునకు ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. బైక్‌లు, ఆటోలు, కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు.. సర్వం స్తంభించిపోయాయి. ఎక్కడివారు అక్కడే చిక్కిపోయారు. జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. కర్ఫ్యూ కష్టాలు ఆ ఒక్క రోజుకు మాత్రమే పరిమితమవుతుందనుకున్నారు.
కానీ ఆ ప్రభావం ఒక జీవితకాలం ఉంటుందని ఎవరూ భావించలేదు. కానీ ఇప్పటికీ లక్షలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. ఉపాధి, ఉద్యోగాలు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డుపడ్డాయి. సంపూర్ణ లాక్‌డౌన్ కార్మికులు, పేదలు, సామాన్యులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. దాదాపు రెండున్నర నెలల పాటు రెక్కలకష్టమే తప్ప ఆస్తులు లేని పేదలు, కార్మికులకు అదంతా ఓ పీడకలగా మిగిలిపోయింది. ఇప్పటికీ వారంతా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రాలేదు. ఊహకు కూడా అందని తీరులో వేలాది కిలోమీటర్లు నడిచి సొంతూళ్లకు వెళ్లిపోయారు. కాళ్లకు అంతటి శక్తి ఉంటుందా? అనేది స్వీయానుభవం ద్వారా అర్థమైంది. పిడికెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడ్డారు. గుక్కెడు నీటి కోసం తపించిపోయారు. ఉద్యోగాలు పోయాయి. ఉపాధి పోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కొత్త కొలువుల సంగతేమోగానీ ఉన్న కొలువులు ఊడిపోయాయి. లాక్‌డౌన్ పోయి అన్‌లాక్ వచ్చింది. ఆంక్షలన్నీ పోయి సడలింపులు వచ్చాయి. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి వ్యాక్సిన్ కూడా వచ్చింది. కానీ పేదల కష్టాలకు మాత్రం పరిష్కారం దొరకలేదు.