ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

by srinivas |
ఇవాళ టీడీపీ ఆవిర్భావ దినోత్సవం
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు వారంటే..గుర్తింపు లేని రోజులవి. రెండేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులు(టి.అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి) మార్చబడ్డారు. నిత్యవసర వస్తువుల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అధిష్టానం సీల్డ్ కవర్ ముఖ్యమంత్రులను నిర్దేశిస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. అటువంటి సమయంలో ప్రముఖ సినీ నటుడు విశ్వ విఖ్యాత నట‌సార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు(ఎన్‌టీ‌ఆర్) 1982 మార్చి 29న టీడీపీ అనే రాజకీయ పార్టీ స్థాపించాడు. సబ్ రిజిస్ట్రార్‌గా ఉద్యోగం చేసిన ఎన్టీఆర్ ఆ తర్వాత కాలంలో ‘మనదేశం’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘తెలుగుదేశం పార్టీ’ స్థాపించి రాజకీయ దురంధరుడిగా పేరుగాంచారు. అప్పటికే రాముడిగా, కృష్ణుడిగా, దుర్యోధనుడిగా,రావణుడిగా, భీష్ముడిగా పౌరాణిక పాత్రాలు మాత్రమే కాకుండా సాంఘీక చిత్రాలు చేశారు. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అన్నట్టు ఆయన దర్శన భాగ్యం కోసం అభిమానులు అలరారే రోజుల్లో పార్టీ పెట్టి ఊరూరా తిరిగి ప్రచార పర్వానికి కొత్త రూపమిచ్చారు ఎన్టీఆర్. ‘‘రండి తెలుగుదేశం పిలుస్తోంది’’అంటూ, సైకిల్ గుర్తుకు ఓటేయండంటూ పిలుపునిస్తూ.. పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఓడించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఈ మేరకు టీడీపీ రికార్డు సృష్టించింది.

ఎన్‌టీ‌ఆర్ ..అంటే..

ఎన్‌టీ‌ఆర్ అన్న పేరు వింటే తన ఒళ్లు పులకరిస్తుందని ఆయన తనయుడు బాలకృష్ణ ఎప్పుడూ చెబుతుంటారు. ఎన్ అంటే నటన..నటనలో రారాజు నటరత్న, విశ్వ విఖ్యాత సార్వభౌముడనీ, టీ అంటే తార అనీ, తారలలో ధృవ తారని, ఆర్ అంటే రాజకీయ దురంధరుడని అభివర్ణిస్తుంటారు. అయితే, నటుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ నాయకుడిగా పార్టీ స్థాపించే నాటికి పూర్థి స్థాయి క్షేత్ర పరిశీలన, పర్యటనలు చేసారని అందుకే అవి పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిందని పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు. అది నిజమే కావొచ్చు. కానీ, ఎన్టీఆర్‌కు ఉన్న అకుంఠిత దీక్ష, ఆత్మ విశ్వాసం, నిర్దిష్టత వల్లే ఆయన్ను విజయాలు వరించాయని అభిమానులు చెబుతుంటారు. కుమారుడు హరికృష్ణను డ్రైవర్‌గా ‘చైతన్య రథం’పై ఊరూరా తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రచారంలో ఉన్నంత కాలం ఒక శ్రామికుడిలా ఖాకీ దుస్తులు మాత్రమే ధరించారు. కాంగ్రెస్‌ పాలనలోని అవినీతిని ఎండగట్టేలా అద్భుతమైన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ సమస్య అని, ఆత్మగౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు. 1983 జనవరిలో ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 199 సీట్లు సాధించి కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 60 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 97 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కేవలం 9 నెలల వయసున్న తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి ఏపీలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం టీడీపీదే. 8వ లోకసభ కాలంలో ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించింది.

టీడీపీలో చీలికలు..

1983లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల తర్వాత ఆగస్టు నెలలో గుండె ఆపరేషన్ నిమిత్తం ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లారు. ఈ సమయంలో నాదెండ్ల భాస్కర రావు తనదే అసలైన పార్టీ అని చెప్పి గవర్నర్ రాం లాల్‌ను కలిశాడు. గవర్నర్ అనుమతితో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎన్టీఆర్ ఆగమానం, ఎమ్మెల్యేలందరితో కలిసి రాష్ట్రపతి ముందు పరేడ్ తర్వాత కేంద్రం కొత్త గవర్నర్‌ను అపాయింట్ చేసింది. అప్పుడు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కాలంలో 1995లో టీడీపీలో మళ్లీ చీలిక వచ్చింది. ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన నాయకత్వంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ కేంద్రంలో ఎన్డీఏ, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లలో భాగస్వామిగా పని చేసింది. ప్రస్తుతం విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అయితే, టీడీపీకి బీసీ ఓటు బ్యాంకు చాలా ముఖ్యమనీ, ఎందుకంటే బీసీలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేసింది ఆ పార్టేనని పరిశీలకులు అభిప్రాయపడుతుంటారు.

Advertisement

Next Story