‘గ్రేటర్’ నిర్లక్ష్యం..తగ్గిన పోలింగ్ శాతం

by Shyam |   ( Updated:2020-12-01 10:39:43.0  )
‘గ్రేటర్’ నిర్లక్ష్యం..తగ్గిన పోలింగ్ శాతం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం చేసినా.. మంగళవారం జరిగిన ఎన్నికల తీరు అభ్యర్థులను, పార్టీలను సైతం నిరాశకు గురిచేశాయి. గ్రేటర్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే చాలా తక్కువ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చాలా కేంద్రాల్లో సిబ్బంది అప్పటివరకూ సిద్ధం కాలేకపోయారు. ఎన్నికల విధుల్లో అనుభవం లేకపోవడం, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకోవడంలో ఆలస్యమయిందని వారు తెలిపారు. పోలింగ్ ప్రారంభమైన కేంద్రాల్లో సైతం ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు, ఇతర ప్రైవేటు ఉద్యోగులు కూడా పోలింగ్‌కు దూరంగానే ఉన్నట్టు కనిపించింది.

ఫలితంగా ఎలక్షన్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో 150 డివిజన్లలో కలిపి కేవలం 3.96 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది. గ్రేటర్‌లో ఉదయం తొమ్మిది గంటల వరకూ 2,95,364 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వికలాంగుల కోసం వీల్ ఛైర్లను ఏర్పాటు చేయడంతో వాటి సహాయంతో వారు తమను ఓటును వేశారు. ఉదయం 11 గంటల వరకూ 8.90శాతం పోలింగ్ రికార్డు కాగా, సాయంత్రం 5 గంటల వరకు 35.80 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. గతంలో వరుసగా జరిగిన మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల సరాసరి 45 శాతం కాగా.. ఈ సారి కేవలం 40 శాతానికే పరిమితం కావడం గమనార్హం.

పోలింగ్ శాతం వివరాలు :

ఉదయం 9 గంటలకు : 3.96%
ఉదయం 11 గంటలకు : 8.90%
మధ్యాహ్నం 1 గంటలకు : 18.20%
మధ్యాహ్నం 3 గంటలకు : 25.66%
సాయంత్రం 4 గంటలకు : 29.36%
సాయంత్రం 5 గంటలకు : 35.80%
సాయంత్రం 6 గంటలకు : ఇంకా రాలేదు.

Advertisement

Next Story

Most Viewed