చీకట్లను చీల్చిన వీరుడి కథ.. నేడు ‘అనభేరి’ 73వ వర్ధంతి

by Anukaran |   ( Updated:2021-03-13 08:06:19.0  )
చీకట్లను చీల్చిన వీరుడి కథ.. నేడు ‘అనభేరి’ 73వ వర్ధంతి
X

దిశ, హుస్నాబాద్: అనభేరి ప్రభాకర్ రావు.. బానిసత్వానికి, దోరపెత్తందారితనానికి, భూస్వాములు, జమీందార్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన తొలితరం కమ్యూనిస్టు యోధుడు. నిజాంనవాబు తన తాబేదార్లు క్రూరమైన నిర్బంధాన్ని అమలు చేసినప్పటికీ భూస్వాముల భూముల్లో, వాడవాడలా ఎర్రజెండాలు ఎగురవేస్తూ ముందుకు దూసుకుపోయిన వీరుడు.. 1947వ సంవత్సరంలో దేశం మొత్తం స్వాతంత్రోద్యమంతో అట్టుడికపోతున్న సమయంలో విద్యావంతుడైన అనభేరి ప్రభాకరరావు విద్యార్థి దశలోనే పోరాట పటిమ ప్రదర్శించారు. విద్యార్థులు, యువకులను చైతన్యం చేసి వారిలో దేశభక్తిని నూరిపోశాడు.

15 ఆగస్టు, 1947… దేశానికి స్వాతంత్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానం మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు. సెప్టెంబర్ 13, 1948 నాడు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మోహినుద్దీన్ కలిసి నిజాం కబంధ హస్తాల్లో పని చేస్తున్న గ్రామ అధికారుల దగ్గరున్న రికార్డులను తగలబెట్టి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పల్లెపల్లెనా తిరుగుతూ జైత్రయాత్రను నిర్వహించాలనుకున్నారు. వీరి ప్రణాళికను పసిగట్టిన నైజాం ప్రభువు బద్దం ఎల్లారెడ్డిని గాలిపెల్లిలో గృహనిర్బంధం చేశారు. ప్రముఖుల నిర్బంధ కాండను గమనించిన అనభేరి ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి యువత, సానుభూతి పరులకు రహస్యంగా పెద్ద సంఖ్యలో గెరిల్లా శిక్షణ ఇచ్చారు.

ప్రభాకర్ రావు దళం స్టేషన్లపై మెరుపు దాడులు చేస్తూ ఆయుధాలు సంపాదించుకున్నారు. వీరికోసం రజాకార్లు, పోలీసులు మహ్మదాపూర్ గ్రామాన్ని దిగ్బంధం చేయగా, వంద మందికిపైగా దళ సభ్యులు ఆత్మరక్షణ కోసం కొండలోయల్లోకి పరిగెత్తడంతో దళం మొత్తం చెల్లాచెదురైపోయింది. ఈ క్రమంలోనే అనభేరి ప్రభాకర్ రావు (పోలంపెల్లి), సింగిరెడ్డి భూపతిరెడ్డి(తాడూరు), బి.దామోదర్ రెడ్డి (నల్గొండ జిల్లా), ముస్కు చొక్కారావు (ఒగులాపూర్), ఏలేటి మల్లారెడ్డి (ఒగులాపూర్), అయిరెడ్డి భూంరెడ్డి( సోమవారంపేట), తూమోజు నారాయణ (బేగంపేట), ఇల్లందుల పాపయ్య(గాలిపెల్లి), పోరెడ్డి రాంరెడ్డి(సోమారంపేట), నల్గొండ రాజారాం (రేగడిమద్దికుంట), సిక్కుడు సాయిలు(రేగడిమద్దికుంట), రొండ్ల మాధవరెడ్డి(రేపాక) 12మంది దళ సభ్యులు రజాకార్లు, పోలీసుల తూటాలకు బలయ్యారు.

సాయుధ పోరాటంలో తొలి వీరమరణం పొందిన అనభేరి ప్రభాకర్ రావు ధరించిన కోటును ఒక కర్రకు తగిలించుకొని ‘షేర్ మర్గయా’ అంటూ అక్కడి గ్రామాల్లో తిరిగారు. అనంతరం నైజాం ప్రభుత్వాన్ని సంపూర్ణంగా ఓడించేందుకు 1948 సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ సంస్థానంపై నలువైపుల నుంచి ఇండియన్ ఆర్మీ పోలీసు చర్య నిర్వహించింది. సెప్టెంబర్ 17 నాడు నైజాం తమ ఓటమిని అంగీకరించి హైదరాబాద్ సంస్థానం భారత్ యూనియన్‌లో విలీనం చేసింది.

‘అనభేరి’ కుటుంబ నేపథ్యం..

అనభేరి వెంకటేశ్వరరావు, రాధాబాయికి నలుగురు సంతానం. వెంకటరమణరావు, అనభేరి ప్రభాకర్ రావు, రామచంద్రరావు, శ్రీరంగారావు. రెండవ సంతానమైన ప్రభాకర్ రావు.. భార్య సరళాదేవికి ముగ్గురు కూతుళ్లు.. సులోచనాదేవి, శకుంతలాదేవి, విప్లవకుమారి.

73 ఏండ్లుగా…

కమ్యూనిస్టుల కంచుకోటగా పిలువబడే హుస్నాబాద్ నియోజకవర్గానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మహ్మదాపూర్ గుట్టల్లో ప్రభాకర్ రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి, పిట్టల వెంకన్న సమాధులను కమ్యూనిస్టులు, గ్రామస్తులు నేటికీ దేవాలయాలుగా పూజించుకుంటున్నారు. 73 వసంతాలు గడుస్తున్నా ‘లాల్ సలాం అనభేరి’ అంటూ ఊరి మధ్యలోనున్న స్తూపం వద్ద ఆయన సహచరులు, గ్రామస్తులు, సానుభూతిపరులు, అభ్యుదయవాదులు, ప్రజానాట్య మండలి కళాకారులు సృతి గీతాలను ఆలపిస్తూ నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటున్నారు. 73 ఏండ్లుగా ప్రభాకర్ రావు చిన్న కుమార్తె విప్లవకుమారి తన తండ్రి సమాధివద్ద ప్రతి ఏటా నివాళి అర్పిస్తూ ఉంటుంది..

అనభేరి జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోని నాటి ఉద్యమ ఘట్టాలతో పాటు అనభేరి ప్రభాకర్ రావు జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. నేటి యువతరం అనభేరి వంటి పోరాట యోదుల జీవిత చరిత్రను పునికిపుచ్చుకొవాలి. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ పై పెట్టాలని కమ్యూనిస్టులు, అభ్యుదయవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. – చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Advertisement

Next Story