కొత్తగా 94మందికి కోరోనా..ఆరుగురు మృతి

by vinod kumar |
కొత్తగా 94మందికి కోరోనా..ఆరుగురు మృతి
X

దిశ, న్యూస్ బ్యూరో:
తెలంగాణలో కరోనా కేసుల గణాంకాల్లో భారీ కుదింపు వచ్చింది. వరుసగా మూడు రోజుల పాటు వందకు పైగా కేసులు నమోదవుతూ వస్తుండగా..సోమవారం 94 కేసులు మాత్రమే నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. హెల్త్ బులిటెన్ ప్రకారం వలస కూలీల్లోనూ, విదేశాల నుంచి వచ్చిన వారిలోనూ కొత్తగా ఎవరికీ పాజిటివ్ రాలేదు.ఇప్పటి వరకూ 434 మంది వలస వచ్చిన వారిలో మాత్రమే కరోనా కేసులు ఉన్నాయని ఆరోగ్య శాఖ పేర్కొంది.జీహెచ్ఎంసీ పరిధిలో 79 మందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 94 మందికి కొత్తగా పాజిటివ్ తేలింది. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్‌లో 3, మెదక్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లో రెండు, మహబూబాబాద్, పెద్దపల్లి, జనగాం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,792కు చేరుకుంది. చికిత్స అనంతరం 1,491 మంది డిశ్చార్జ్ అయ్యారని, రాష్ట్రంలో 1,213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో ప్రకటించింది. కరోనా సోకిన వారిలో సోమవారం ఆరుగురు మృతి చెందగా..ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. అయితే కరోనా కారణంగా చనిపోయిన ఆరుగురిలో మూడున్నర నెలల చిన్నారి కూడా ఉంది. ఒక్కరు మాత్రమే 60 ఏళ్ళ పైబడినవారు. మృతుల్లో నలుగురికి ఎలాంటి అనారోగ్యం లేదని, కేవలం కరోనా కారణంగానే చనిపోయారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మూడున్నరేళ్ళ చిన్నారికి మాత్రం అనారోగ్య లక్షణాలు ఉన్నాయని, కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతుండగానే చనిపోయిందని సమాచారం. ఆరుగురు మృతుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మృతులు నగరంలోని టప్పాచపుత్ర, యాకుత్‌పుర, ఓల్డ్ మలక్‌పేట్, చార్మినార్, ఫలక్‌నుమా, సనత్‌నగర్‌కు చెందిన వారుగా తెలిపారు.

Advertisement

Next Story