నాడు వలసల జిల్లా.. నేడు మాస్కుల తయారీ కేంద్రం

by Shyam |
నాడు వలసల జిల్లా.. నేడు మాస్కుల తయారీ కేంద్రం
X

దిశ, మహబూబ్ నగర్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రాష్ర్ట ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఒకప్పుడు వలసలకు మారుపేరైన మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు తయారు చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని టీటీడీలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేస్తున్న మాస్కులు, పీపీఈ యూనిట్‌ను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విపత్కర సమయంలో ప్రజలందరికీ అవసరమైన మాస్కులను మనమే తయారు చేసుకోవడం, అంతే కాక ఇతరులకు కూడా మాస్కులు సరఫరా చేసేలా జిల్లా ఎదగడం గర్వకారణమని అన్నారు. మహిళా సంఘాలకు ఆర్డర్ ఇచ్చిన లక్ష మాస్కుల తయారీని అధిగమించడమే కాకుండా, ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు మహిళలు ముందుకు వస్తున్నారన్నారు. వారందరిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ ప్రస్తుతం కరోనాతో పోరాడుతూనే అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తుందని, ముఖ్యంగా ఈ రబీలో 50 లక్షల ఎకరాల్లో పంటలు పండాయన్నారు. ప్రత్యేకించి జిల్లాలో పేద ప్రజలు, వలస కూలీలకు కూరగాయలు, నిత్యావసరాలు అందించేందుకు స్టాక్ సమృద్ధిగా ఉందన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారవుతున్న మాస్కులతో పాటు చేతి గ్లౌజులు, పీపీఈ లు తయారు చేసేలా మరికొందరికి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. వీటి అమ్మకం ద్వారా వచ్చిన లాభాన్ని మహిళలకే అందేలా చూస్తామని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని కూడా మహిళా సంఘాలకు అందిస్తామన్నారు. అనంతరం మంత్రి జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరికి 5వేల కిట్లను అందజేశారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలోని బికె. రెడ్డి కాలనీలో డ్రోన్ సాయంతో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ వెంకట్ రావు, ఎస్పీ రేమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ మోహన్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, migrate disk convert mask making, palamuru, minister srinivas goud

Advertisement

Next Story

Most Viewed