కరోనా కట్టడికి బాలుడి విరాళం.. సీఎం నుంచి సైకిల్ గిఫ్ట్‌

by Shamantha N |
కరోనా కట్టడికి బాలుడి విరాళం.. సీఎం నుంచి సైకిల్ గిఫ్ట్‌
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో బాధితులకు సాయపడేందుకు సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తోచినంత విరాళాలు ప్రకటిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఏడేళ్ల బాలుడు తన సేవింగ్స్‌ను కొవిడ్ ఫండ్‌కు డొనేట్ చేసి మార్గదర్శిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం నుంచి సైకిల్‌ను గిఫ్ట్‌గా అందుకోవడం విశేషం. తమిళనాడు, మధురైకి చెందిన బాలుడు హరీశ్ వర్ణమ్ సైకిల్ కొనుక్కునేందుకు డబ్బులు దాచుకున్నాడు. అయితే ప్రస్తుతం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిని చూసి చలించిపోయిన హరీశ్ తన పిగ్గీ బ్యాంకులోని రూ.1000/- సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్‌కు అందజేశాడు.

దీంతో పాటు తను రాసిన ఒక హ్యాండ్ నోట్‌ను కూడా తన తండ్రి ద్వారా చీఫ్ మినిస్టర్‌కు పంపాడు. అందులో పాండమిక్ వల్ల బాధపడుతున్న వారికి సాయపడాలని సీఎంను కోరాడు. ఈ క్రమంలోనే ఆదివారం హరీశ్ ఇంటికి కొత్త సైకిల్ రావడంతో ఆశ్చర్యపోయాడు. పైగా ఆ సైకిల్‌ను ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ పంపించడంతో ఇక తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మధురై నార్త్ ఎమ్మెల్యే దళపతి ద్వారా సైకిల్ పంపించిన ముఖ్యమంత్రి హరీశ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సైకిల్ నచ్చిందా? అని అడగడంతో పాటు బాగా చదువుకోవాలని సూచించినట్లు హరీశ్ చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed