నకిలీ వ్యాక్సిన్.. నటి కమ్ ఎంపీకి అస్వస్థత

by Shamantha N |   ( Updated:2021-06-27 00:44:19.0  )
mimi chakraborthy news
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల కోవిడ్- 19 నకిలీ వ్యాక్సిన్ తీసుకున్న ఆమె శనివారం కడుపు నొప్పి, లో బీపీ, డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్నట్టుగా సన్నిహితులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే నటి అస్వస్థతకు నకిలీ వ్యాక్సినే కారణమని వైద్యులు ఇంకా ధృవీకరించాల్సిఉంది. అయితే ఆమె ఆరోగ్య విషయమై వారి ఫ్యామిలీ డాక్టర్ మాట్లాడుతూ ” మిమి ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ఆమె గత కొంతకాలంగా లివర్‌ సంబంధిత జబ్బుతో బాధపడుతున్నారు. దాని వలనే కొంచెం హైపర్ టెన్షన్ కి గురయ్యారు. ఇక మిమి అనారోగ్యానికి, టీకానే కారణమని చెప్పడం తొందరపాటు చర్యే అవుతుందని” ఆయన తెలిపారు.

ఇటీవల మిమి ఒక నకిలీ ఐఏఎస్ అధికారి మాటలు నమ్మి ఫేక్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హాజరై వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, టీకా వేయించుకున్నప్పటికీ ఎస్సెమ్మెస్ రాకపోవడంతో అనుమానించిన ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది నకిలీ కార్యక్రమమని తేలింది. దీంతో నకిలీ ఐఏఎస్ అధికారి దేవాంజన్ దేవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Next Story