జగిత్యాలలో కలప స్మగ్లింగ్.. ఏం చేయాలంటోన్న అధికారులు..!

by Sridhar Babu |
జగిత్యాలలో కలప స్మగ్లింగ్.. ఏం చేయాలంటోన్న అధికారులు..!
X

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కలప స్మగ్లింగ్ యధేచ్చగా సాగుతోంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు కలప చెట్లను నరికివేసి.. దుంగలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ప్రచారం జోరుగా నడుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

సారంగపూర్ మండలంలో ఆదివారం సాయంత్రం అక్రమంగా కలప తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అనంతరం కల్లెడ డిపోకు తరలిస్తుండగా.. బట్టపెల్లి-పోతారం గ్రామస్తులు అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తమ గ్రామస్తులు వంటగ్యాస్ కొరకు అడవిలో కట్టెలు కొడితే మా గొడ్డళ్లు, సైకిళ్లను లాక్కొని కేసులు పెడతామని బెదిరించే అటవీ అధికారులు.. ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అక్రమంగా కలప తరలిస్తున్నా.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.

మామూళ్ల మత్తులో అధికారులు..

ఇది ఇలా ఉంటే అక్రమ కలప రవాణాపై అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ దందా సాగిస్తున్న వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా అప్పుడప్పుడు తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తూ.. మరోవైపు పెద్దఎత్తున కలపను పక్క జిల్లాలకు తరలిస్తున్నట్లు సమాచారం. అటవీ శాఖలో అధికారుల స్టాఫ్ కొరత, నిర్లక్ష్యంతోనే అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. ఒక బీట్ అధికారికి మూడు చోట్ల ఇన్‌చార్జీ బాధ్యతలు అప్పగిస్తే డ్యూటీలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed