- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు వారాల లాక్ డౌన్: ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి..
దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం మార్చి 25 నుంచి కొనసాగిస్తున్న 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగిసింది. మరో 19 రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 21 రోజుల్లో దేశంలోని కరోనా పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మూడంకెల నుంచి ఐదంకెలకు చేరుకుంది. దాదాపు ఇరవై రెట్లు పెరిగింది. లాక్‌డౌన్ తొలిరోజు నాటికి దేశంలో మొత్తం 564 పాజిటివ్ కేసులు ఉంటే తొలిదశ ముగింపు సమయానికి (ఏప్రిల్ 14) దాదాపు 11 వేలకు చేరుకుంది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చేనాటికి దేశం మొత్తం మీద కరోనా కారణంగా 11 మంది మరణిస్తే ఏప్రిల్ 14 నాటికి అది 339కు చేరుకుంది. అప్పట్లో 75 జిల్లాల్లో మాత్రమే ఉన్న కరోనా ఇప్పుడు నాలుగు రెట్లు దాటి 334 జిల్లాలకు విస్తరించింది. లాక్‌డౌన్ చాలా మంచి నిర్ణయమంటూ అనేక దేశాలు అభినందిస్తున్నాయి. అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ కూడా ప్రశంసిస్తున్నాయి. అయినా కరోనా పెరుగుతూనే ఉంది. అయితే ఈ లాక్‌డౌన్ నిర్ణయమే తీసుకోకపోయినట్లయితే కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో పెరిగేదో అర్థం చేసుకోవడం కష్టమేమీకాదు.
కరోనా వైరస్ ఇన్‌క్యుబేషన్ పరిది ఐదు నుంచి 14 రోజులు అని వైద్యులు పేర్కొంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం మార్చి 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. అప్పటికే విదేశాల నుంచి చేరుకున్నవారికి నిర్బంధంగా 14 రోజుల క్వారంటైన్ విధించింది. వారి ఆరోగ్య స్థితిగతులను పరిశీలించింది. వారి ద్వారా ఎవరికైనా సోకే ప్రమాదం ఉందని గ్రహించి వారికి కూడా ఈ వైరస్ లక్షణాలు కనిపించడానికి కనీసం వారం రోజులు పడుతుందనే ఉద్దేశంతో మొత్తం మూడు వారాల లాక్‌డౌన్ విధించింది. ఆ అంచనా ప్రకారం ఇప్పటికి కరోనా పాజిటివ్ కేసులన్నీ లెక్కతేలి చికిత్స అనంతరం డిశ్చార్జి కూడా అయ్యేవని ప్రభుత్వం అభిప్రాయపడింది. కానీ ఊహించని విధంగా మర్కజ్ మసీదు ద్వారా కరోనా వ్యాపించిందనే వార్తలు మార్చి రెండవ వారంలో వెలుగులోకి వచ్చినా దాని తీవ్రత బైటపడడానికి పది రోజుల సమయం పట్టింది. ఆ విధంగా ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎక్కువగా వచ్చిన పాజిటివ్ కేసులు ఆ కారణంగా నమోదైనవేనని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పరీక్షలు తక్కువ… ఆందోళన ఎక్కువ
కరోనా పాజిటివ్ కేసు అని నిర్ధారణ కావడానికి ముందు ఆ అనుమానితుల్లో వైరస్ లక్షణాలను వైద్యులు ముందుగా తెలుసుకుంటున్నారు. కానీ వారాలు గడుస్తున్నకొద్దీ లక్షణాలు లేకుండా కూడా పాజిటివ్ నిర్ధారణ అవుతోందని తెలంగాణ అనుభవం తెలిపింది. కేసులపై పలు దఫాలుగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ‘లక్షణాలు లేకున్నా పాజిటివ్ కేసులు వస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. దేశంలో తొలుత పూణెలోని వైరాలజీ ఇన్‌స్టిట్యూట్ మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహించగా ఆ తర్వాత ఆరు లేబొరేటరీలకు విస్తరించింది. వైరస్ తీవ్రతను, రాష్ట్రాల్లో వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని సుమారు 200 చోట్ల లేబొరేటరీలకు అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పటిదాకా (ఏప్రిల్ 14) దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు జరిగింది కేవలం 2.17 లక్షలు మాత్రమే. కొద్దిమందికి నాలుగైదు పరీక్షలు చేయాల్సి రావడంతో 2.02 లక్షల మందికి చేసినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
అత్యధికంగా మహరాష్ట్రలో ఇప్పటిదాకా 31,481 పరీక్షలు జరిగాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (24,857), కేరళ (14,163), ఢిల్లీ (11,709), తమిళనాడు (9,872) రాష్ట్రాల్లో జరిగాయి. కరోనా పీడ ప్రపంచవ్యాప్తంగా ఉంది. చాలా దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య, మృతుల సంఖ్య తీవ్రంగా ఉంది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు జరిగిన పరీక్షలను పరిశీలిస్తే ప్రతీ పది లక్షల మందిలో గరిష్టంగా నార్వేలో 19,528, సిట్జర్లాండ్‌లో 18,256, ఇటలీలో 11,436, దక్షిణ కొరియాలో 8,996, అమెరికాలో 5,355 చొప్పున జరిగాయి. కానీ భారతదేశంలో మాత్రం ఇది కేవలం 93 మాత్రమే. జనాభా ప్రకారం చూస్తే ప్రతీ పది లక్షల మందిలో 1.3 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించినట్లయింది. రాష్ట్రాలవారీగా చూస్తే ప్రతీ పది లక్షల జనాభాకు ఢిల్లీలో 7.3, కేరళలో 4.2, రాజస్థాన్‌లో 3.6 మందికి చొప్పున పరీక్షలు జరిగాయి. కరోనా పాజిటివ్ కేసులను తేల్చడంలో ఇప్పుడు చేస్తున్న తీరులో పరీక్షలు నిర్వహిస్తే ఫలితం లేదని, విస్తృతంగా ‘రాండమ్ టెస్ట్’ జరగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే మన దేశానికి అంత భారీ స్థాయిలో టెస్టులు చేయడానికి తగిన వైద్య సదుపాయాలు లేవనేది బహిరంగరహస్యం.
ప్రస్తుతం వైరస్ లక్షణాలు ఉన్నవారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు డాక్టర్లు. కానీ తెలంగాణ అనుభవం మాత్రం ఎలాంటి లక్షణాలు లేకున్నా పాజిటివ్ నిర్ధారణ అవుతోందని తేల్చింది. దీన్ని బట్టి లక్షణాలతో సంబంధం లేకుండా ఇప్పటికే పాజిటివ్ అని నిర్ధారణ అయిన పేషెంట్ల సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఆయనతో అప్పటికి ఇరవై రోజుల నుంచి కలిసినవారందరికీ పరీక్షలు చేస్తే ప్రయోజనం ఉంటుందని, అప్పుడు ఒక స్పష్టతకు రావడానికి ఆస్కారం ఉంటుందని ఒక సెక్షన్ వైద్యుల అభిప్రాయం. కానీ ఆ స్థాయిలో పరీక్షలు చేయడానికి అవసరమైన టెస్టింగ్ కిట్లు లేవనేది కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ అధికారుల అభిప్రాయం. విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహించడం ద్వారా మాత్రమే కరోనా ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వ్యాపించిందనేదానిపై ఒక స్పష్టత వస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల అభిప్రాయం. రెండో దశలో 19 రోజుల లాక్‌డౌన్ విధించడం ద్వారా వైరస్ వ్యాప్తిని ఒక మేరకు అరికట్టడం సాధ్యమవుతుందే తప్ప పూర్తిస్థాయిలో కట్టడి చేయడం వీలుకాదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఐఎంఏ జాతీయ ప్రతినిధి ఒకరు వివరించారు.
తెలంగాణలో పరిస్థితి అగమ్యగోచరం
తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు మార్చి 4వ తేదీన నమోదైంది. దాదాపు పది రోజుల దాకా రెండో కేసు నమోదు కాలేదు. మార్చి 14వ తేదీ నుంచి లాక్‌డౌన్ అమల్లోకి వచ్చే (మార్చి 25) నాటికి కేసుల సంఖ్య పెరుగుతూ 39కు చేరుకుంది. లాక్‌డౌన్ కాలంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రారంభమైంది. ఇందుకు ప్రధాన కారణం మర్కజ్ యాత్రకు వెళ్ళివచ్చినవారి ద్వారా ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్‌డౌన్ తొలి విడత ముగిసే (ఏప్రిల్ 14) నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య సుమారు 600కు చేరుకుంది. దాదాపు 15 రెట్లు పెరిగింది. జాతీయ స్థాయిలోగానీ కొన్ని రాష్ట్రాల స్థాయిలోగానీ ఎంత మందికి పరీక్షలు జరుగుతున్నాయి, ఎన్ని పరీక్షలు జరుగుతున్నాయి, వాటిలో ఎన్ని పాజిటివ్ వస్తున్నాయి, ఎంత మంది క్వారంటైన్‌లో ఉన్నారు, ఎంత మంది ఐసొలేషన్‌లో ఉన్నారు, ఏ పాజిటివ్ వ్యక్తి ద్వారా ఎంత మందికి మళ్ళీ అది సోకింది.. ఇలా అనేక వివరాలు అధికారపూర్వకంగానే వెల్లడవుతున్నాయి.
కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇప్పటికీ ఈ వివరాలేవీ బైటకు రాలేదు. ఎన్ని పరీక్షలు జరిగాయో, ఎన్ని కిట్లు అందుబాటులో ఉన్నాయో, ఏ లేబొరేటరీలో రోజుకు ఎన్ని జరుగుతున్నాయో, వాటిల్లో ఎంత శాతం పాజిటివ్‌గా నిర్ధారణ అవుతున్నాయో అంతుచిక్కదు. కరోనా కట్టడి కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోందంటూ ప్రభుత్వం చెప్పడమే తప్ప ఆచరణలో ఆ తరహాలో లేదనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక్కో స్థాయిలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైద్యారోగ్య మంత్రి దగ్గర ఉన్న వివరాలకు భిన్నమైన గణాంకాలు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వెలువడుతుంటాయి. వైద్యారోగ్య శాఖ దగ్గర ఉన్న వివరాలకు, మంత్రి దగ్గర ఉన్న వివరాలకు పొంతన ఉండదు. ఇక ఆసుపత్రుల దగ్గర నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు, వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం దగ్గర ఉన్న లెక్కలకు తేడా ఉంటుంది. జిల్లాల స్థాయిలో కలెక్టర్లు అధికారికంగా వెల్లడిస్తున్న వివరాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతీరోజు విడుదల చేస్తున్న ‘కరోనా హెల్త్ బులెటిన్’ వివరాలకు మధ్య అగాధం ఉంటోంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పాజిటివ్ కేసు నమోదైందని మీడియా సమావేశంలో వెల్లడించినా బులెటిన్‌లో మాత్రం అది కనిపించదు. సూర్యాపేట జిల్లాలో ఏడు కేసులు నమోదైనట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించినా ఆ రోజు రాత్రి విడుదలయ్యే బులెటిన్‌లో మాత్రం ఆ వివరాలు చోటుచేసుకోవు. ఇలా అనేక స్థాయిలో సమన్వయ లోపం చాలా సందర్భాల్లో బహిర్గతమైంది.
కరోనా కట్టడి కోసం ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం మరోవైపు అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని, త్వరలోనే సింగిల్ డిజిట్‌లోకి వస్తుందని, మరికొన్ని రోజుల్లో అందరూ చికిత్స అనంతరం కోలుకుని డిశ్చార్జి అవుతారని, ఏ పేషెంట్‌కూ ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరం రాలేదని, ప్రజలు ‘ప్యానిక్’ కావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి ప్రకటించిన మరుసటి రోజు నుంచే కొత్త పాజిటివ్ కేసులు పెరగడం మొదలైంది. పరిస్థితి మెరుగుపడుతోందంటూ ముఖ్యమంత్రే స్వయంగా చెప్పిన తర్వాత ప్రజల్లో లాక్‌డౌన్ ఆంక్షలను పాటించాలన్న చిత్తశుద్ధి తగ్గుతోంది. క్వారంటైన్‌లో ఉన్నవారంతా క్షేమంగా ఇళ్ళకు వెళ్ళిపోయారని, ఏప్రిల్ చివరివారంకల్లా పాజిటివ్ పేషెంట్లు కూడా చికిత్స పూర్తి చేసుకుని ఇళ్ళకు వెళ్ళిపోతారని ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత నగరంలో హాట్‌స్పాట్‌లు, కంటైన్‌మెంట్ క్లస్టర్లు ఏర్పడుతున్నాయి. ఒకవైపు తగ్గుతుందని చెప్తూనే మరోవైపు ‘కట్టడి కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి ఆగడంలేదు’ అనే ప్రకటనలు రావడం ప్రజలను అప్రమత్తం చేయడానికి బదులుగా గందరగోళానికి గురిచేస్తోంది.
మర్కజ్ యాత్ర తర్వాతనే కరోనా వ్యాప్తి ఎక్కువైందని, అది లేకుంటే ఈ పాటికి రాష్ట్రం కరోనా రహితంగా మారేదని ముఖ్యమంత్రి చెప్తున్నారు. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారందరినీ పట్టుకున్నాం, సుమారు 1090 మంది వివరాలు, వారితో కాంటాక్టులోకి వెళ్ళినవారందరి ఆరోగ్య స్థితిని తెలుసుకున్నాం, పరీక్షలు కూడా చేశాం, ఒకటి రెండు రోజుల్లో మొత్తం రిపోర్టులు వస్తాయి, ఇక కరోనాను తరిమేసినట్లే.. అని సీఎం చెప్తే అంతా సద్దుమణిగిందనే ప్రజలు భావించారు. కానీ ఒకటి రెండు రోజుల్లో పరీక్షల రిపోర్టు వస్తుందని చెప్పి పది రోజులైనా ఇంకా పాజిటివ్ కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారెంతమందో ఇప్పటికీ గందరగోళమే. తొలుత 1039 మంది అని, ఆ తర్వాత 1089 అని, ఆ తర్వాత 1090 అని, ఆ తర్వాత 1100 అని, చివరకు మంత్రి ఈటల రాజేందర్ దాదాపు 1200 మంది అని.. ఇలా రకరకాలుగా చెప్పడంతో అసలు వాస్తవం గోప్యంగానే ఉండిపోతోంది. ప్రజలను అప్రమత్తం కంటే గందరగోళమే ఎక్కువగా ఉంటోందనడానికి అనేక సందర్భాల్లో చేసిన ప్రకటనలే నిదర్శనం.
ఎవ్వరికీ వెంటిలేటర్, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరమే రాలేదని చెప్తున్నప్పటికీ ప్రతీ రోజూ ఎందుకు చనిపోతున్నారనేది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఎన్ని కేసులు పెరిగినా ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, గచ్చిబౌలిలో 1500 బెడ్‌లు, 22 ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో 15 వేల బెడ్‌లు ఉన్నాయని, వైద్య సేవలు అందించడానికి సుమారు పాతికవేల మంది డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారని చెప్తున్నా అందుకు తగిన ఏర్పాట్లు మాత్రం లేవని వైద్యారోగ్య శాఖ అధికారులే మొత్తుకుంటున్నారు. పీపీఈ కిట్లకు కొదవ లేదని ప్రభుత్వం చెప్తున్నా పాజిటివ్ వార్డుల్లో చికిత్స చేస్తున్న డాక్టర్లు, నర్సులు మాత్రం దానికి భిన్నంగా స్పందిస్తున్నారు. చివరకు డాక్టర్లే విరాళాల రూపంలో ఆర్థిక వనరులు సమకూర్చుకుని పీపీఈ కిట్లను తెప్పించుకుంటున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలోని పరిస్థితులకు పొంతన ఉండడంలేదు.
Tags: Corona, Positive, Test, Kits, Medical Infrastructure, LockDown, Extension