కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి కమిటీల ఏర్పాటు

by Shyam |
కరోనా వ్యాక్సిన్​ పంపిణీకి కమిటీల ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా వ్యాక్సిన్ వీలైనంత తొందరగా అందుబాటులోకి వస్తుందని కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో రాష్ట్రంలో పంపిణీ కోసం అనుసరించాల్సిన మెకానిజంపై అధికారులు చర్చిస్తున్నారు. ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఉన్న వైద్యారోగ్యం, పోలీసు, పారిశుధ్య సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల డాటా బేస్ తయారుచేయడానికి ‘కొవిన్’ (కరోనా వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్) సాఫ్ట్‌వేర్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘నెగ్ వాక్’ (నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్)ను కూడా వినియోగించాలని భావిస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం వ్యాక్సిన్ అందడం కోసం రాష్ట్రస్థాయిలో స్టీరింగ్ కమిటీ, టాస్క్ ఫోర్స్, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. ప్రధాన కార్యదర్శి చైర్మన్​గా వ్యవహరించే స్టీరింగ్ కమిటీ సమావేశం సచివాలయంలో గురువారం సమావేశమై ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది.

రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ..

స్టీరింగ్ కమిటీకి ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అన్ని ప్రభుత్వ శాఖల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, రోటరీ ఇంటర్నేషనల్, లయన్స్ క్లబ్, యూఎన్‌డీపీ, బీఎంజీఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా ఉంటాయి. ఈ కమిటీ ప్రతీ నెల ఒకసారైనా సమావేశం కావాలి. అవసరమైతే అదనపు సమావేశాలను కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో ప్రిపరేటరీ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అనే రెండు దశలను అమలు చేయాల్సి ఉంటుంది. ప్రిపరేటరీ దశలో లబ్ధిదారుల వివరాలను సేకరించడం మొదలు అమలు చేసే దశ వరకు పూర్తిస్థాయిలో సమన్వయం కమిటీ బాధ్యత.

రాష్ట్ర టాస్క్ ఫోర్స్, జిల్లాల టాస్క్ ఫోర్స్ కమిటీలు పనిచేస్తున్న తీరు, వివిధ విభాగాలతో సమన్వయంతో ఉండడం, అనుకున్న నిర్ణయాలను అమలుచేయడం.., లబ్ధిదారుల వివరాలను సేకరించడం.., వ్యాక్సిన్‌ను గ్రామ స్థాయి వరకు అందించడం.., రవాణా వ్యవస్థ, కోల్డ్ చైన్ స్టోరేజీ వ్యవస్థ, వివిధ స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయడం.., ఆర్థిక వనరుల కోసం వివిధ కార్పొరేట్ సంస్థల నుంచి సీఎస్ఆర్ కింద నిధులను సేకరించడం.., మైక్రో ప్లానింగ్, జరుగుతున్న లోపాలు, చక్కదిద్దడానికి తీసుకుంటున్న చర్యలు…. ఇలా సమస్త వివరాలను స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది, సమయానుగుణంగా సమీక్షిస్తుంది.

రాష్ట్ర టాస్క్ ఫోర్స్..

వైద్యారోగ్య శాఖ కార్యదర్శి చైర్మన్​గా వ్యవహరించే ఈ కమిటీలో రాష్ట్ర ఇమ్యునైజేషన్ ఆఫీసర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, రాష్ట్ర స్థాయి వైద్యారోగ్య శాఖ అధికారులు, పట్టణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, ఆయుష్ తదితర విభాగాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉంటాయి.

కమిటీ పని తీరు/ బాధ్యతలు…

* కమిటీ ప్రతీ నెల కనీసంగా రెండుసార్లు సమావేశమై వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారి డాటాబేస్ రూపకల్పన చేయడం.
* ఆపరేషనల్ గైడ్‌లైన్స్ రూపొందించడం, ఇతర విభాగాలవారి సేవలను వినియోగించుకోవడం.
* వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి సిబ్బందిని ఎంపిక చేయడం, ఆ టీమ్‌ల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా పర్యవేక్షకులను నియమించడం.
* జిల్లాస్థాయిలో అమలుచేయడానికి ఏర్పడే జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ సభ్యులను కలెక్టర్‌తో మాట్లాడించి తగిన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం.
* ఇందులో కూడా సన్నాహక, అమలు దశ అని రెండు దశలుంటాయి.

జిల్లా టాస్క్ ఫోర్స్..

జిల్లా స్థాయిలోని టాస్క్ ఫోర్స్ కమిటీకి కలెక్టర్ చైర్మన్​గా వ్యవహరిస్తారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సభ్య కార్యదర్శిగా, ముఖ్యమంత్రి కార్యాలయం మొదలు స్థానికంగా ఉండే ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ, నెహ్రూ యువ కేంద్ర, వైద్యులు, మత పెద్దలు, ప్రొఫెషనల్ సంస్థల వరకు అన్ని ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ప్రతీ వారం ఈ కమిటీ సమావేశమై సన్నాహక, అమలు దశల్లోని అంశాలపై ఫోకస్ పెడుతుంది. కేంద్ర ప్రభుత్వం సైతం అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహా మెకానిజం అమలయ్యేలా మార్గదర్శకాలను రూపొందించి జాతీయ స్థాయిలో సమన్వయంపై దృష్టి పెట్టనుంది.

కేంద్రం నుంచి అందిన ముసాయిదా మార్గదర్శకాలను లోతుగా చర్చించిన ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ వీలైనంత ఎక్కువగా ప్రభుత్వ విభాగాలు, శాఖలు, కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ సేవా సంస్థలు, స్థానిక సంక్షేమ కమిటీలు, ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి యూనిట్ల నుంచి తీసుకోవాల్సిన సహకారం గురించి మాట్లాడారు. రవాణా, నిల్వ, పంపిణీ తదితర స్థాయిల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, సమకూర్చుకోవాల్సిన సౌకర్యాలు వంటివి డిస్కస్​ చేశారు. రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ మొదలు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ వరకు పోషించాల్సిన పాత్రపై చర్చించింది.

Advertisement

Next Story