- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోఠి ఈఎన్టీకి పొంచి ఉన్న ముప్పు…
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కోఠి లోని ఈఎన్టీ ఆసుపత్రి పాత భవనం శిథిలావస్థకు చేరి రోగులు, వైద్యులు, సిబ్బందిని భయపెడుతోంది. 1955 సంవత్సరంలో ఈ హాస్పిటల్ ను ప్రారంభించారు. మొత్తం 200 పడకల సామర్ధ్యం ఉంది. అయితే భవనానికి గత కొన్నేండ్లుగా మరమ్మత్తులు లేకపోవడం, చాలా చోట్ల గోడలపై చెట్లు పెరగడంతో వేర్లు గోడలలోకి చొచ్చుకు పోయాయి. దీంతో వర్షాకాలంలో కురిసే వర్షాలకు భవనం తడిసిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకువస్తుందోనని అందరినీ ఆందోళనలకు గురి చేస్తోంది.
తెలంగాణ, ఏపీ లతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా రోగులు ఇక్కడికి చెవి,ముక్కు, గొంతు వైద్య సేవల గురించి వస్తుంటారు. బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాక ముందు ప్రతినిత్యం 1500 నుండి 2 వేల వరకు ఓపీ నమోదయ్యేది. ప్రతినిత్యం పదుల సంఖ్యలో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తుంటారు. దీంతో ఆస్పత్రి ఎల్లప్పుడు రద్దీగా ఉంటుంది. ఇలాంటి హాస్పిటల్ పాత భవనంలో శిథిలావస్థకు చేరడంతో నూతన భవనం నిర్మించి వైద్య సేవలకు అంతరాయం లేకుండా చూడాలనే అభిప్రాయాలు వినబడుతున్నాయి.
2013లో నోటీసులు జారీ చేసీన జీహెచ్ఎంసీ…
ఈఎన్టీ ఆస్పత్రి పాత భవనం శిథిలావస్థకు చేరిందని, ఇది ఏ మాత్రం నివాసయోగ్యం కాదని మహా నగర పాలక సంస్థ అధికారులు 10 జూలై 2013 లో జీహెచ్ఎంసీ సెక్షన్ 459 యాక్ట్ 1955 ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా భవనం కూలే ప్రమాదముందని, వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ సర్కిల్
14 ( అప్పట్లో సర్కిల్ 8) ఇంజనీరింగ్ అధికారులు ఏడేండ్ల క్రిందనే నిర్ధారించారు. పాత భవనాన్ని వెంటనే కూల్చి వేయాలని నోటీసులలో పేర్కొన్నారు. మూడు రోజులలో ఏమైనా అభ్యంతరాలుంటే చెప్పాలని సూచించారు . ఇది జరిగి ఏండ్లు గడుస్తున్నా నేటికీ పాత భవనం పూర్తి స్థాయిలో ఖాళీ కాలేదు. ప్రతినిత్యం ప్రమాదపుటంచున వైద్యులు, సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహిస్తుండగా రోగులు కూడా భవనాన్ని చూసి భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మొదటి అంతస్థు ఖాళీ చేస్తే సరిపోతుందా …?
జీహెచ్ఎంసీ నోటీసులు అందుకున్న ఈఎన్టీ హాస్పిటల్ అధికారులు సుమారు మూడేండ్ల క్రితం పాత భవనం మొదటి అంతస్థును ఖాళీ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఓపీ, ఫార్మసీ, పోస్ట్ ఆపరేటివ్ వార్డు, పేయింగ్ రూమ్స్ సేవలు అందిస్తున్నారు. మొదటి అంతస్థులోని రోగులను నూతనంగా నిర్మించిన క్యాజువాల్టీ భవనంలోకి తరలించగా పూర్తి స్థాయిలో రోగుల తరలింపు జరగలేదు. గ్రౌండ్ ఫ్లోర్ లో వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రతినిత్యం భయాందోళనల మద్య రోగులు, వైద్యులు, సిబ్బంది కాలం వెల్లదీస్తున్నారు. ప్రస్థుతం వర్షాకాలం కావడం, ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందోననే భయం అందరిలో నెలకొంది.
నిధులు మంజూరు చేసినా …
ఈఎన్టీ పాత భవనం శిథిలావస్థకు చేరినందును హాస్పిటల్ ముందున్న పార్క్ స్థలంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం రూ 20 కోట్లు మంజూరు చేసింది. మాడ్యులార్ ఆపరేషన్ థియేటర్ల కోసం మరో రూ 7 కోట్లు కేటాయించింది. ప్రస్థుతం ఆస్పత్రి నూతన భవనం నిర్మాణం కోసం రూ 27 కోట్లు ప్రభుత్వం
కేటాయించినప్పటికీ నూతన భవనం నిర్మాణం కోసం వైద్య ఆరోగ్య శాఖ, టీఎస్ ఎంఎస్ ఐడీసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.ప్రమాదకరంగా మారిన భవనంను పూర్తిగా ఖాళీ చేసి యుద్ధ ప్రాతిపధికన నూతన భవనం నిర్మాణం చేపట్టాలని ఇక్కడ పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది కోరుతున్నారు .
అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం…
ఆస్పత్రి పాత భవనం శిథిలావస్థకు చేరడంతో మూడేండ్ల క్రితమే మొదటి అంతస్తులోని రోగులను ఖాళీ చేశాం. నివాసయోగ్యం కాదని జీహెచ్ఎంసీ అధికారులు 2013 లోనే నోటీసులు జారీ చేసిన విషయం వాస్తవమే. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఉంది. నూతన భవనం, మాడ్యులార్ థియేటర్ల కోసం రూ 27 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించింది. త్వరలో నూతన భవనం నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
-డాక్టర్ శంకర్ – సూపరింటెండెంట్