గుడ్ న్యూస్.. పెట్రోల్ పాత బైక్ టూ ఎలక్ట్రిక్‌ వెహికల్‌.. లాంచింగ్ అప్పుడే.!

by Anukaran |
గుడ్ న్యూస్.. పెట్రోల్ పాత బైక్ టూ ఎలక్ట్రిక్‌ వెహికల్‌.. లాంచింగ్ అప్పుడే.!
X

దిశ, ఫీచర్స్ : పెట్రోల్ ధర సెంచరీ దాటి.. టీ20 స్కోర్‌బోర్డులా వడివడిగా పరుగులు పెడుతూనే ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు దేశంలో పౌరులను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుండగా, వ్యక్తిగత వాహనాలను కలిగి ఉన్న వ్యక్తులపై ఇది మరింత ఎక్కువగా ఉంది. దీంతో సామాన్యుడి రథం ముందుకు కదలడం లేదు సరికదా.. ఇంటిముందు షోకేస్ చెట్లలా నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త వెహికల్ కొనే అవసరం లేకుండా ఇంట్లో ఉన్న పెట్రోల్ స్కూటర్‌నే ఎలక్ట్రిక్‌ వెహికల్‌గా మార్చడానికి ఇదే మంచి తరుణం. అయినా ఇది సాధ్యమేనా అని ఆలోచిస్తున్నారా? బెంగుళూరుకు చెందిన ‘జుయింక్ రెట్రోఫిట్‌’ అనే స్టార్టప్ కంపెనీ.. జస్ట్ నాలుగు గంటల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసింది. ఇంతకీ ఈవీకి మారడం వల్ల మనకొచ్చే లాభమేంటి? పెట్రోల్ చార్జీలతో పోల్చితే ఎలక్ట్రిసిటీ చార్జీలు తక్కువేనా? దీనివల్ల ప్రకృతికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది?..

డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల కారణంగా కాలుష్యం పెరుగుతున్న క్రమంలో ప్రపంచమంతా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) వైపు దృష్టి సారిస్తోంది. పర్యావరణహిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వెహికల్‌- ఎనర్జీ స్టోరేజ్‌ 2020-30 పాలసీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రిజిస్ట్రేషన్‌, రోడ్డు పన్ను నుంచి మినహాయింపులు సహా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్‌ స్టేషన్‌ నెలకొల్పనుంది. మరోవైపు పెట్రోల్ ధరలు ఊహించని విధంగా పెరుగుతుండటం, సర్కారు ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తుండటంతో ఈ వాహనాల జోరు పెరిగింది.

కానీ మార్కెట్లో కొత్త ఈవీ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 60 వేల నుంచి రూ.లక్ష వెచ్చించాల్సిందే. ఇది సామాన్యుడికి అదనపు భారం అవుతోంది. దీంతో ‘జుయింక్ రెట్రోఫిట్‌’ కొత్త ఐడియాతో వచ్చేసింది. ఇంట్లో ఉన్న పాత స్కూటీ/స్కూటర్‌నే ఎలక్ట్రిక్ వెహికల్‌గా మార్చేస్తోంది. ముందస్తు చార్జీలేవీ లేకుండా కేవలం రూ.26,999 లేదా నెలకు రూ. 899 ఈఎమ్ఐ చెల్లించి పాతబైక్‌ను ఈవీ వెహికిల్‌గా తయారుచేస్తోంది. బెంగుళూరులోని వినియోగదారులు తమ కన్వర్షన్ కిట్‌‌ను కేవలం రూ.499 కి రిజర్వ్ చేసుకునే సౌలభ్యం ఉండగా.. ప్రజెంట్ బెంగుళూరులో అందుబాటులో ఉన్న ‘జుయింక్ రెట్రోఫిట్‌’ సేవలు 2022 జూన్ నాటికి ఢిల్లీ, అహ్మదాబాద్, పూణే, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

ఎందుకు మారాలి.?

పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌ వెహికిల్‌గా మార్చితే.. నెలవారీ ఇంధన ఖర్చులు 50శాతానికి తగ్గిపోతాయి. ఉదాహరణకు 50 కిలోమీటర్ల మైలేజ్‌ ఇచ్చే ఓ పెట్రోల్‌ బైక్‌పై నెలకు సరాసరిన 600 కిలోమీటర్లు(రోజుకు 20కిలోమీటర్ల) తిరిగితే 12 లీటర్ల పెట్రోల్‌ అవసరమవుతుంది. లీటర్‌కు రూ.108 వేసుకుంటే ఏడాదికి రూ. 15,552 ఖర్చవుతుంది. అదే ఒక యూనిట్‌కు రూ. 3. 50 ఖర్చు చేస్తే, ఒక్క యూనిట్‌తో సగటున మూడు కిలోమీటర్లు తిరగొచ్చు. అంటే ఒక్క కి.మీ.కు అయ్యే ఖర్చు సగానికి సగం తగ్గుతుంది.

అంతేకాకుండా పాత పెట్రోల్ స్కూటర్, IC- ఇంజన్‌ల స్వభావాన్ని బట్టి ఎక్కువ ఉద్గారాలు విడుదల చేస్తాయి. యాక్టివా, జెస్ట్, జూపిటర్, యాక్సెస్, ప్లెజర్ వంటి ఎలాంటి వాహనమైన సరే దాదాపు ఐదు లేదా ఆరు సంవత్సరాలు వాడినట్లయితే ఈవీగా మార్చడం ఉత్తమం. ఎందుకంటే అలా మారడం వల్ల దాని ఉద్గారాలు సున్నాకి పడిపోతాయి. ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా భూమిని మరింత వాయు కాలుష్యం నుంచి కాపాడే వ్యక్తిగా నిలవచ్చు. అలాగే IC-ఇంజిన్ వేరియంట్స్ ప్రస్తుతం మార్కెట్లో కనిపించే ఈవీల కంటే పటిష్టంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

కన్వర్షన్ ప్రాసెస్ :

మార్పిడి ప్రక్రియలో భాగంగా స్కూటర్ ఇంజిన్, ఇంధన ట్యాంక్, సైలెన్సర్ తొలగిస్తారు. బైక్‌కు మౌంట్ హబ్ మోటార్‌తో ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు ఒక వైరింగ్ జీను కూడా అమర్చుతారు. కొన్ని ఇతర సవరణలతో పాటు వాటి కన్వర్టెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై 2kWh లిథియం-అయాన్ బ్యాటరీని ఇన్‌స్టాల్ చేస్తారు. కేవలం 4-5 గంటల్లో ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది. గత ఏడాదిన్నర కాలంలో సుమారు 200+ IC- ఇంజన్ స్కూటర్లను ఎలక్ట్రిక్‌ వెహికిల్‌గా మార్చిన స్టార్టప్ మార్కెట్‌లో మన్ననలు పొందుతోంది.

బ్యాటరీ స్వాపింగ్ :

బ్యాటరీ స్వాపింగ్ అనేది ఒక టెక్నిక్. ఇప్పటికే చార్జ్ చేసిన బ్యాటరీతో రీచార్జ్ అయిపోయిన ఎలక్ట్రిక్ కారు బ్యాటరీని మార్చేస్తారు. ఇది రీచార్జింగ్‌ సమయాన్ని ఆదా చేస్తుంది. బెంగళూరులో 700లకు పైగా పెట్రోల్ పంపులు ఉండగా.. రెట్రోఫిట్‌కు 150కి పైగా బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గత ఏడాదిన్నర కాలంలో సుమారు 3 లక్షల బ్యాటరీ చేంజెస్ నిర్వహించింది. ఈ సిస్టమ్‌తో కారు యజమాని ఎక్స్‌ట్రా బ్యాటరీని కలిగి ఉండాల్సిన అవసరం లేకపోగా.. కేవలం రూ.80కి అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. పైగా బ్యాటరీ మార్పిడి పూర్తయ్యేందుకు మూడు నిమిషాల కన్నా తక్కువ సమయం పడుతుంది. ఇక బ్యాటరీని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి రీప్లేస్‌మెంట్ చేయడం ఉత్తమం.

ఉత్తమ మైలేజీ :

‘బైక్‌లను కన్వర్ట్ చేసిన తర్వాత ఈవీలు, గత ఐసీ- ఇంజన్‌కు ఏమాత్రం భిన్నంగా అనిపించవు. వేగంలో మార్పు ఉండొచ్చు కానీ రైడింగ్‌లో ఎలాంటి చేంజ్ ఉండదు. స్కూటర్లు గరిష్టంగా 60 కి.మీ.ల వేగాన్ని అందిస్తాయి. బ్యాటరీ రేంజ్ దాదాపు 55 కి.మీ.ల చార్జ్‌తో వస్తాయి. అయితే ఉత్తమంగా నడిపితే 80 కి.మీ. వరకు ఫలితాలను అందిస్తాయి. మార్కెట్‌లోని స్టాండర్డ్ EV ద్విచక్ర వాహనాలు ఇక్కడ ఉన్న వాటితో పోలిస్తే చాలా తక్కువ వేగం, బ్యాటరీ రేంజ్‌ను అందిస్తాయి. రెట్రోఫిట్ కిట్ (కన్వర్షన్ కిట్)లోని అన్ని భాగాలు భారతదేశంలోనే తయారయ్యాయి. బెంగుళూరులోనే 150ప్లస్ బ్యాటరీ మార్పిడి స్టేషన్లు ఉండగా.. ప్రతీ కిలోమీటరుకు ఒక మార్పిడి స్టేషన్ ఉండాలనే లక్ష్యంతో ఉన్నాం’
– సచిన్ షెనాయ్, జుయింక్ రెట్రోఫిట్ వైస్ ప్రెసిడెంట్

Advertisement

Next Story