750కి.మీ.. 2లక్షల మొక్కలు.. 9 ఏళ్ల పిల్లోడి అసాధారణ ప్రయాణం!

by Shyam |
sustainability
X

దిశ, ఫీచర్స్ : పర్యావరణ విధ్వంసం లేకుండా జరిగే అభివృద్ధిని ‘సుస్థిరాభివృద్ధి’ అంటారు. పేదరిక, ఆకలి నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాలు పెంపు, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం తాగునీరు, పారిశుద్ధ్యం, సముద్ర, జల చరాల పరిరక్షణ, జీవ వైవిధ్యం వంటి సామాజిక, ఆర్థిక, పర్యావరణ అంశాల్లోని 17 లక్ష్యాలను 2030 లోపు ప్రతి దేశం సాధించాలని అన్ని దేశాలు తీర్మానించుకున్నాయి. కానీ ఆ దిశగా ఏ దేశం కూడా ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలోనే సుస్థిరాభివృద్ది అవగాహన పెంచుతూ 9 ఏళ్ల పిల్లవాడు మారథాన్ ప్రారంభించాడు. ఇతరులకు స్ఫూర్తినిస్తూ, స్థిరమైన జీవనం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంత ఉందో వివరించే ప్రయత్నం చేస్తూనే, మార్పును తీసుకువచ్చేందుకు ఓ ముందడుగు వేశాడు.

చెన్నయ్‌లోని, తాంబరానికి చెందిన శర్వేష్ సుస్థిర అభివృద్ధి కోసం ఐక్యరాజ్యసమితి ప్రపంచ లక్ష్యాల గురించి అవగాహన కల్పించడానికి కన్యాకుమారి నుంచి చెన్నయ్ వరకు మారథాన్ ప్రారంభించాడు. దాదాపు పది రోజుల్లో 750 కిలోమీటర్ల మేర నడిచి ఔరా అనిపించాడు. అతడు తన ప్రపంచ రికార్డు బ్రేకింగ్ ప్రయాణంలో రెండు లక్షలకు పైగా విత్తనాలను నాటాడు. రోటరీ ఇంటర్నేషనల్, జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ అతడి ప్రయత్నానికి మద్ధతు పలికాయి.

శర్వేష్ ఇప్పటికే పరుగులో పలు రికార్డ్‌లు బద్దలుకొట్టాడు. ఐదేళ్లకే 1 కిమీ రివర్స్ రన్నింగ్‌ చేసి చరిత్ర సృష్టించాడు. ఆరేళ్లప్పుడు 486 కిలోమీటర్లు పరిగెత్తి మరో రికార్డ్ బ్రేక్ చేయగా, అతడు ఇప్పటివరకు 56 మారథాన్‌లలో పాల్గొన్నాడు. అనేక పథకాలు అతడి ఖాతాలో ఉన్నాయి. ప్రపంచం చాలా గందరగోళంగా ఉందని, పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యతని, ఇప్పుడు మేల్కొనకపోతే తీవ్ర ముప్పు తప్పదని శర్వేష్ పేర్కొన్నాడు.

Advertisement

Next Story

Most Viewed