భారత్, చైనాల శాంతి ఒప్పందాలు సా..గుతున్నాయి

by Shamantha N |   ( Updated:2020-06-18 11:52:37.0  )
భారత్, చైనాల శాంతి ఒప్పందాలు సా..గుతున్నాయి
X

న్యూఢిల్లీ: లడాఖ్‌లోని గాల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న తర్వాత ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్, చైనాల మధ్య గురువారం మూడోదఫా శాంతి చర్చలు జరిగాయి. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు ఇరుదేశాల మధ్య మిలిటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మంగళ, బుధవారాల్లో మేజర్ జనరల్ స్థాయిలో సమావేశాలు జరిగాయి. కానీ, ఈ రెండు చర్చలు నిష్ఫలంగానే మిగిలాయి. కాగా, గురువారం మాత్రం ఆరుగంటలపాటు సుదీర్ఘ చర్చ సాగింది. నాలుగో రౌండ్ చర్చలు గాల్వాన్ లోయలోని పెట్రోలింగ్ పాయింట్ 14 దగ్గర మేజర్ జనరల్ అభిజీత్ బాపట్ నేతృత్వంలోని బృందం చైనా తరఫున మేజర్ జనరల్ బృందంతో చర్చలు జరిపింది. గడిచిన రెండు చర్చల మాదిరిగాకాకుండా గురువారం కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని ఓ అధికారి వెల్లడించారు. ఇంకా చాలా విషయాల్లో రానున్న రోజుల్లో పరిష్కారాలు లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ చర్చల తర్వాత ఉద్రిక్తతలు సమసిపోవడమో, లేదా ఉధృతమవడమో జరగకపోవడం గమనార్హం. కాగా, చర్చలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి.

చైనా తన సరిహద్దులకే పరిమితమవ్వాలి: భారత్

సరిహద్దులో ఉద్రిక్తతలు సమసిపోయే విషయమై ఇరుదేశాలు నిత్యం టచ్‌లోనే ఉన్నాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. చైనా తన సరిహద్దుల్లోనే మెలగాలని, తన కార్యకలాపాలన్నీ సరిహద్దు లోపలే ఉండాలని తెలిపింది. వాస్తవాధీన సరిహద్దు(ఎల్ఏసీ)ని గమనించుకోవాలనీ, యథాతథాస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదని భారత విదేశాంగశాఖ చైనాకు సూచించింది. సరిహద్దులో శాంతి నెలకొల్పేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని, విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్టు వివరించింది. అయితే, ప్రధాని మోడీ చెప్పినట్టు దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడుకునేందుకు కట్టుబడి ఉన్నదని, ఆ సామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని గుర్తుచేసింది. కాగా, చైనా మాత్రం మళ్లీ పాతపాటే అందుకున్నది. భారత సైన్యం వల్లే హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. ఇరుదేశాల మధ్యనున్న ఏకాభిప్రాయానికి భారత సైన్యమే తూట్లు పొడిచిందని ఆ దేశ విదేశాంగశాఖ చెప్పుకొచ్చింది.

చైనా కస్టడీలో ఎవ్వరూ లేరు: ఆర్మీ

తూర్పు లడాఖ్‌లోని ఎల్ఏసీ సరిహద్దులో చైనా సైన్యంతో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలతో ప్రమేయమున్న భారత సైనికులందరూ మన అధీనంలోనే ఉన్నారని ఆర్మీ వెల్లడించింది. ఈ ఘర్షణల్లో కొందరు భారత జవాన్లను చైనా ఆర్మీ నిర్బంధించినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఓ సీనియర్ ఆర్మీ అధికారి స్పష్టం చేశారు.

కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలు

చైనాతో సరిహద్దులో కల్నల్ సహా 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయి భయానక వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జమ్ము కశ్మీర్ పోలీస్ చీఫ్ దిల్‌బాగ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే అదనుగా భావించి పాకిస్తాన్, కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని అన్నారు. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంత సరిహద్దుల్లో పరిస్థితులు సమీక్షించేందుకు డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కాలంలోనూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలు ఎక్కువగానే చోటుచేసుకున్నాయనీ, ప్రస్తుత పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమున్నదని చెప్పారు.

ఆ రోజు జవాన్ల దగ్గర ఆయుధాలున్నాయి: ఎస్ జైశంకర్

సోమవారం రాత్రి చైనా సైన్యంతో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు మన జవాన్ల దగ్గర ఆయుధాలున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. కానీ, సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు ఘర్షణలు చోటుచేసుకున్నప్పుడు ఆయుధాలను వినియోగించబోరని చెప్పారు. మనదేశ సైనికులను నిరాయుధులగా ఎందుకు పంపించారని రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుపుతూ, సరిహద్దుల్లో సైనికులు ఎల్లప్పుడూ ఆయుధాలను వెంటపెట్టుకునే ఉంటారని చెప్పారు. ముఖ్యంగా పోస్టు వదిలిపెట్టేటప్పుడు కచ్చితంగా ఆయుధాలు కలిగి ఉంటారని తెలిపారు. హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్న రోజు (జూన్ 15న) కూడా మన జవాన్ల దగ్గర ఆయుధాలున్నాయని అన్నారు. అయితే, 1996, 2005 ఒప్పందాల ప్రకారం సరిహద్దుల్లో శాంతి నెలకొనే ఉండాలన్న ఉద్దేశంతో ఘర్షణలు జరిగినప్పుడు ఆయుధాలు వాడొద్దనే నిబంధన అమలవుతున్నదని తెలిపారు.

33యుద్ధ విమానాల కొనుగోలుకు గ్నీన్ సిగ్నల్

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంలో భారత వైమానిక దళం 33 యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదనను కేంద్రానికి పంపింది. కొత్తగా 12 సుఖోయ్ యుద్ధ విమానాలు, 21 మిగ్-29 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర రక్షణశాఖకు పంపించింది. సుమారు రూ.5 వేల కోట్ల విలువ చేసే ఈ ప్రాజెక్టుపై వారంలోపు కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. 2016లో కుదిరిన 36 రాఫెల్ యుద్ధ విమానాల తర్వాత జరగనున్న ఒప్పందం ఇదే కావడం గమనార్హం. కాగా, చైనా కూడా మిలిటరీ ఆధునికీకరణకు సిద్ధమైంది. సైన్యాన్ని ఆధునికీకరించాలని, బలగాలను మరింత పటిష్టం చేయాలని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదేశించారు. 13వ పంచవర్ష ప్రణాళికను అమలు చేసి బలగాలను నిర్మించాలని సూచించారు. అలాగే, 14వ పంచవర్ష ప్రణాళికలో మిలిటరీ వృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

దేహాలను చీల్చిన ఆ రాడ్లు ఇవే..

సరిహద్దులో ఆయుధాలు వినియోగించరాదనే నిబంధన ఉన్నది కానీ, భారత జవాన్లపై దాడి చేయడానికి చైనా సైన్యం ఉపయోగించిన రాడ్లను చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇనుప రాడ్లకు మేకులను అతికించి భయంకరంగా ఉన్న ఆ ఆయుధాలతో వేటు వేస్తే దేహాన్ని చీల్చి కండను బయటికి లాగేసేలా ఉన్నాయి. చైనా ఉపయోగించిన ఆ రాడ్ల ఫొటోపై ట్విట్టర్‌లో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. డిఫెన్స్ అనలిస్ట్ అజయ్ శుక్లా ట్వీట్ చేసిన ఈ ఫొటో వైరల్ అయింది.

Advertisement

Next Story