- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఊళ్లల్లో రాజకీయ నాయకులకు నో ఎంట్రీ.. పొలిమేర దాటి లోపలికి వచ్చారో..!
దిశ, వెబ్‌డెస్క్: పల్లెటూర్లే దేశ ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లెలు సామరస్యంగా ఉన్నప్పుడే అవి అభివృద్ధి దిశగా పయనిస్తాయి. కానీ దేశంలో ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. గ్రామంలో వంద ఇళ్లు, ఐదు వందల ఓట్లు లేకున్నా దేశంలో ఉన్న పార్టీల జెండాలన్నీ ఆ ఊరి నడిబొడ్డున వెలిశాయి. ఇక ఎన్నికలు వచ్చిందంటే ఆ హడావిడి అంతా ఇంతా కాదు. జీపులు, టాటా సుమోలు, కార్లపై ఊరేగింపులు, వీధుల వెంట రణగొణ ధ్వనులు, భారీ కటౌట్లు, గోడల మీద పోస్టర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు.. ఆ హడావిడి మామూలుగా ఉండదు. కులసంఘాల వారీగా ఊర్లను కొంటున్నారు రాజకీయ నాయకులు. ఊళ్లలో ఉండే కులసంఘాలే కాదు, ఇంట్లో ఐదుగురు ఉంటే వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉండాల్సిన దుస్థితి. కానీ తమిళనాడులోని కొన్ని ఊర్లలో దీనికి ఆస్కారం లేదు. అక్కడి గ్రామాల్లో రాజకీయ పార్టీల జెండాలు కాదు కదా.. ఎజెండాలు కూడా చర్చలోకి రావు. ఆ ఊళ్లలోకి అడుగుపెట్టాలంటేనే రాజకీయ నాయకులు గజగజ వణుకుతారు. మంత్రి స్థాయి నాయకుడు వచ్చినా ఆ ఊరు పొలిమేర కూడా తొక్కడు.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ తమిళనాడులోని మధురైలో పలు గ్రామాలు స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాయి. తమ గ్రామాలలో రాజకీయ నాయకులు ప్రచారం చేపట్టడం నిషిద్ధం. దీనిని మూడు తరాలుగా స్ట్రిక్ట్‌గా పాటిస్తున్నారు అక్కడి ప్రజలు. మధురైకు ఆనుకుని ఉన్న ఓతవీడు, కరుప్పయురని ప్రజలు గ్రామాలకు రాజకీయ నాయకులను రానీయరు. సుమారు 250 ఆవాసాలు, 650 ఓటర్ల జనాభా కలిగిన ఈ గ్రామాలలో రాజకీయ నాయకులు గ్రామాల్లోకి రావడం, ఎన్నికల ప్రచారాలు చేయడం నిషిద్ధం. అంతేకాదు.. ఇంటి గోడల మీద గోడ రాత (వాల్ రైటింగ్)లు, జెండాలు, ఫ్లెక్సీలు కట్టడం కూడా చేయనివ్వరు.
ఊరవతల పడిగాపులు కాయాల్సిందే…
‘మా ఊళ్లలో రాజకీయ ప్రచారం చేయడం నిషిద్ధం. ఎవరైనా వస్తే వారిని ఊరి పొలిమేరల్లోనే ఆపుతాం. అక్కడే వారికి శాలువాలు కప్పి.. మా ఊరుకు ఏం కావాలో, వాళ్లు ఏం చేయగలరో అడుగుతాం. మాకు నచ్చితే ఓటు వేస్తాం. బలవంతం లేదు. గత మూడు తరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నాం’ అని గ్రామనివాసి ఆర్. ముత్తు అన్నాడు. ‘మా అవసరాలేంటో వారికి చెబుతాం. కొద్దికాలంగా మా ఊరికి రోడ్లు బాగోలేవు. వాటితో పాటు తాగునీటి సౌకర్యం కూడా అందరికీ అందడం లేదు. ఈసారి ఓటు అడగటానికి వచ్చేవారిని వీటిని అభ్యర్థిస్తున్నాం. అవి తీరుస్తామని మాకు హామీ ఇస్తేనే వాళ్లకు ఓటువేస్తాం. అంతేగానీ గ్రామంలో ప్రచారం మాత్రం చేయనీయం’ అని ఓతవీడు నివాసి, రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి జి. ఇలంగోవన్ తెలిపారు. గతంలో అయితే తమ గ్రామాల ప్రజలు ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్‌కు కూడా వెళ్లేవారు కాదని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలోని పెద్దలే ఆ సమస్యలను పరిష్కరించేవారట.
ఊరంతా ఒక్కతాటి మీదే..
ఒతివీడు మాదిరిగానే తెని, విరుధునగర్ జిల్లాలలో కూడా పలు గ్రామాలు ఇదే తరహా ఆచారాన్ని పాటిస్తున్నాయి. విరుధునగర్ జిల్లాలోని మరుతంగులమ్ గ్రామంలో ప్రజలు ప్రచారానికి అనుమతిస్తారు గానీ లౌడ్ స్పీకర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటివి చేయకూడదు. ఈ గ్రామానికి వచ్చే రాజకీయ నాయకులు గ్రామంలోని కచీరు వద్ద వాహనాలను నిలిపి నడుచుకుంటూ గ్రామంలోకి వెళ్లి ప్రచారం చేసుకోవచ్చు. 920 ఓట్లు ఉన్న ఈ ఊళ్లో.. ఆశ్చర్యకరంగా 75 శాతం మంది తెలుగు మాట్లాడేవారే కావడం గమనార్హం. తెని జిల్లాలోని భద్రకాళిపురం గ్రామంలోనూ ఇదే ఆచారం కొనసాగుతున్నది. తెవార్లు ఎక్కువగా ఉండే ఈ గ్రామంలో 1980లో రెండు రాజకీయ వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. దీంతో అప్పట్నుంచి ఊరు ఊరంతా ఒక కట్టుమీదకు వచ్చింది.