నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ ‘జాబ్ క్యాలెండర్’..

by Anukaran |   ( Updated:2021-07-14 01:05:45.0  )
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ ‘జాబ్ క్యాలెండర్’..
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వంలోని వివిధ శాఖలు, విభాగాల్లో ఇకపైన ప్రతీ ఏటా నియామకాలు జరిగేలా ‘వార్షిక జాబ్ క్యాలెండర్‘ను తయారుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాలని అభిప్రాయపడింది. ప్రతీ ఏటా ఖాళీ అవుతున్నపోస్టులు, వాటి భర్తీ ప్రక్రియ నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని కేబినెట్ ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టులు, ఖాళీగా ఉన్నవి, భర్తీ చేయాల్సినవి, అందుకు అవలంబించాల్సిన విధివిధానాలు తదితరాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఇకపైన ఉద్యోగ నియామకాలకు ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ తయారుచేయడంతో పాటు దానికి అనుగుణంగా భర్తీ ప్రక్రియ కూడా జరగాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతీ సంవత్సరం రిక్రూట్‌మెంట్ కోసం ‘వార్షిక క్యాలెండర్ ’ను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే ఉద్యోగ ఖాళీల గుర్తింపు, భర్తీ కోసం చేపట్టాల్సిన చర్యలు, తదితరాలపై బుధవారం కూడా కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులను పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా కేబినెట్ ఆదేశించింది.

కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగులను జిల్లాలవారీగా కేటాయించడంతో పాటు కొత్త జిల్లాలవారీగా పోస్టులను కూడా కేటాయించాలని దానికి తగినట్లుగా ఆ పోస్టుల్లో అధికారులను కేటాయించాలని టీఎన్‌జీవో, టీజీవో ప్రతినిధులు చేసిన విజ్జప్తిపై చర్చించిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు ఇకపైన జిల్లాలవారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపు ఉంటుందని, ఈ ప్రక్రియను సత్వరమే చేపట్టాలని, ఖాళీల గుర్తింపుతో పాటు భర్తీ ప్ర్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది.

గురుకుల స్కూళ్ళలో స్థానికులకు 50 శాతం రిజర్వేషన్

రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో స్థానిక రిజర్వేషన్లకు కేబినెట్‌ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందుకు అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని అక్కడి విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ప్రతి నెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్, మున్సిపల్ చైర్‌పర్సన్‌లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

నెల రోజుల్లో వైకుంఠధామాలు పూర్తికావాలి

ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలు కేబినెట్‌ సమావేశానికి నివేదిక సమర్పించాయి. దీనిపై చర్చించిన మంత్రివర్గం నెల రోజుల్లో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా జిల్లా మంత్రులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం మూడవ వైర్‌‌ను ఏర్పాటుచేసే లాంటివి పూర్తి చేయాలన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధిపైనా, హైదరాబాద్ నగర శివారులోని మున్సిపాలిటీల పరిథిలో మంచినీటి సమస్యపైనా కేబినెట్ చర్చించింది. ఇప్పటికే విడుదలైన నిధులకు అదనంగా మరో రూ. 1200 కోట్లను మంజూరు చేసింది. నీటి ఎద్దడి నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లే- అవుట్లలో ‘లాండ్ పూలింగ్’ విధానాన్ని అమలు చేయాలనే అంశాన్ని కేబినెట్ చర్చించి అలాంటి అవకాశాలను అన్వేషించాలని, విధి విధానాలపై దృష్టిసారించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed