గాలి ద్వారా కరోనా సోకవచ్చు

by Shyam |   ( Updated:2020-07-10 07:58:16.0  )
గాలి ద్వారా కరోనా సోకవచ్చు
X

న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా సోకే అవకాశముందని చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. అంతేకాదు, కరోనా లక్షణాలు కనిపించని పేషెంట్లతోనూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదమున్నదని అభిప్రాయపడింది. సుమారు 200 మంది శాస్త్రజ్ఞులు చేసిన అప్పీళ్లపై స్పందిస్తూ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గాలి ద్వారా కూడా కరోనా సోకే అవకాశమున్నదని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కరోనా పేషెంట్లు మాట్లాడినప్పుడు, దగ్గినప్పుడు, శ్వాస విడిచినప్పుడు బయటికొచ్చే మైక్రో డ్రాప్‌లెట్లు కొన్ని గాలిలో సుదీర్ఘకాలం ఉండే అవకాశమున్నదని ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు డబ్ల్యూహెచ్‌వో సహా పలుదేశాల సంస్థలకు లేఖలు రాశారు. కాబట్టి మరిన్ని కఠిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అయితే, గాలి ద్వారా కరోనా సోకే వాదనను డబ్ల్యూహెచ్‌వో మొదటి నుంచీ తోసిపుచ్చుతున్నది. అయితే, శాస్త్రజ్ఞులు ఆధారాలతో పరిశోధనలను ప్రచురించిన అనంతరం దీనిపై స్పందించింది. రెస్టారెంట్లు, ఒకేసారి ఎక్కువమంది కలిసే పాడే గదులు, ఫిట్‌నెస్ క్లాసుల్లో గాలి ద్వారా సోకే అవకాశమున్నదని అధ్యయనాలు తెలుపుతున్నాయని పేర్కొంది. వెంటిలేషన్ లేకుండా రద్దీగా ఉండే గదుల్లో కరోనా పేషెంట్ ద్వారా వైరస్ సోకే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించింది. 5 మిల్లీమీటర్లుండే తుంపర్లు గాలిలో చాలా కాలం ఉండే అవకాశమున్నదని, వీటి ద్వారానూ వైరస్ సోకే ప్రమాదమున్నదని తెలిపింది. అలాగే, చాలా కాలం నుంచి అసింప్టమాటిక్ పేషెంట్ల నుంచి కరోనా సోకడాన్ని తిరస్కరించిన డబ్ల్యూహెచ్‌వో తాజాగా భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. అయితే, లక్షణాలున్న పేషెంట్ల నుంచే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశమున్నదని, అసింప్టమాటిక్ పేషెంట్ల నుంచి తక్కువ మొత్తంలో వ్యాప్తి చెంది ఉండొచ్చని తెలిపింది.

Advertisement

Next Story